Karnataka: పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నారా.. అయితే ఒక్క సారి ఈ సంతకు వెళ్లండి..
పెళ్లీడుకు వచ్చిన వారికి వివాహం చేసేందుకు తల్లిదండ్రులు తెగ కష్టపడుతూ ఉంటారు. వారికి సరైన జోడి కోసం బంధువులను, తెలిసిన వారి గురించి వాకబు చేస్తుంటారు. గుణ గణాలు, కుటుంబం గురించి ఆరా తీస్తుంటారు....
పెళ్లీడుకు వచ్చిన వారికి వివాహం చేసేందుకు తల్లిదండ్రులు తెగ కష్టపడుతూ ఉంటారు. వారికి సరైన జోడి కోసం బంధువులను, తెలిసిన వారి గురించి వాకబు చేస్తుంటారు. గుణ గణాలు, కుటుంబం గురించి ఆరా తీస్తుంటారు. అన్నీ కుదిరాయి అనుకున్న తర్వాత పెళ్లి చేస్తారు. అయితే పరిస్థితులు మారిపోయాయి. గతానికి, భవిష్యత్ కు స్పష్టమైన తేడా వచ్చేసింది. పెళ్లి విషయంలో యువతకు చాలా నమ్మకాలున్నాయి. ఉద్యోగవ్యాపారాల్లో ఆర్థికంగా స్థిర పడిన తర్వాత పెళ్లి అని కరాకండీగా చెప్పేస్తున్నారు. ఉద్యోగాలు చేస్తున్న యువతుల్లోనూ ఇదే రకమైన అభిప్రాయం ఉంది. అయితే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో యువరైతులకు అమ్మాయిలు దొరకని దుర్భర స్థితులు నెలకొన్నాయి. దేశానికి అన్నం పెట్టేవాడు రైతు అని, రైతే దేశానికి వెన్నెముక గా చెప్పుకుంటున్న రైతులకు పెళ్లి కుదరడం సమస్యగా మారిపోయింది. అబ్బాయి వ్యవసాయం చేస్తాడు అని చెప్పగానే అతనికి వధువును ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు అమ్మాయి తల్లిదండ్రులు. ఇలాంటి వారి ఇబ్బందులను తీర్చేందుకు సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కర్ణాటకలోని మండ్యలో నిర్వహించిన భారీ పెళ్లిచూపుల కార్యక్రమం.. యువ రైతులు పెళ్లి కోసం ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నారనేందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
మండ్య జిల్లాలోని ఆదిచుంచనగిరిలో ఒక్కలిగ కులస్థులు.. వధూవరుల సమ్మేళనాన్ని నిర్వహించారు. మండ్య జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది యువకులు ఈ సమ్మేళనానికి తరలివచ్చారు. 250 మంది అమ్మాయిలు రాగా.. వారిని చూసుకోవడానికి 11,775 మంది యువకులు వచ్చారు. వీరందరూ యువ రైతులే కావడం గమనార్హం. పెళ్లిచూపులకు వచ్చిన యువకుల క్యూలైన్ చూసి అందరూ షాక్ అయ్యారు.
మరోవైపు.. బిహార్ రాష్ట్రంలోని మధుబని జిల్లాలోనూ ఇలాంటి సమ్మేళనమే జరుగుతోంది. సౌరత్ సభ పేరుతో వరులను విక్రయానికి పెడతారు. మైథిల్ బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన ప్రజలు తమ కుమార్తెలతో పాటు వచ్చి.. తమకు నచ్చిన వరులను ఎంపిక చేసుకుంటారు. వరుడిని సెలెక్ట్ చేసుకునే ముందు.. వధువు తరఫున వారు వరుడి అర్హతలు, వారి కుటుంబ పరిస్థితులను తెలుసుకుంటారు. ఈ సంప్రదాయం కర్నాట్ రాజవంశస్థుల కాలం నుంచి ఆచరిస్తూ వస్తున్నారు. వివాహాలను సులభతరం చేయడానికి రాజా హరిసింగ్ ఈ మార్కెట్‌ను ప్రారంభించినట్లు చెబుతున్నారు. ఇందులో వరకట్న రహిత వివాహాలు చేయడం మరో లక్ష్యం.
మరిన్ని జాతీయ వార్తల కోసం..