ట్రైన్, బస్సులోనే కాదు.. విమానల్లోనూ దొంగలుంటారా? చిన్నారిని ఓదార్చే పేరుతో..
తిరువనంతపురం నుండి బెంగళూరుకు ప్రయాణించిన ఇండిగో విమానంలో ఐదేళ్ల బాలిక మెడలోని బంగారు గొలుసును ఎయిర్ హోస్టెస్ దొంగిలించినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బెంగళూరు విమానాశ్రయ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎయిర్‌లైన్స్ సీసీటీవీ ఫుటేజ్ అందించడానికి నిరాకరించింది. బాధితుల కుటుంబం ఫిర్యాదు చేసింది.

ఇండిగో విమాన ఎయిర్ హోస్టెస్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. తిరువనంతపురం నుండి బెంగళూరుకు ప్రయాణించిన ఇండిగో విమానంలో ఎయిర్ హోస్టెస్ ఐదేళ్ల చిన్నారి మెడలో బంగారు గొలుసును దొంగిలించిందని చిన్నారి తండ్రి ఫిర్యాదు చేసింది. చిన్నారి తల్లి ప్రియాంక ముఖర్జీ ఫిర్యాదు ఆధారంగా కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇస్రో శాస్త్రవేత్త భార్య ప్రియాంక ఏప్రిల్ 1న తన ఇద్దరు కుమార్తెలతో విమానంలో తిరువనంతపురం నుంచి కోల్‌కతాకు వెళ్లేందుకు ఇండిగో విమానంలో ప్రయాణించింది. ఆ జర్నీలో బెంగళూరులో స్టాప్‌ఓవర్ ఉంది. విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆమె ఇద్దరు చిన్నారులు ఏడవడం ప్రారంభించారు. దీంతో ఎయిర్ హోస్టెస్ వచ్చి ఓ చిన్నారిని ఓదార్చేందుకు విమానంలో అలా నడిపించుకుంటూ తీసుకెళ్లింది. మరో చిన్నారిని తల్లి ప్రియాంక ఓదార్చింది.
అయితే బెంగళూరులో విమానం దిగుతున్న సమయంలో తన ఐదేళ్లు కూతురి మెడలో ఉండాల్సిన రెండు తులాల గొలుసు కనిపించలేదు. దీంతో ప్రియాంక కంగారు పడి, విమానంలో ఉన్న సిబ్బందిని అడిగింది. వాళ్లు మాకేం తెలుసంటూ చెప్పారు. ఈ చోరీపై విమానయాన సంస్థ, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం, విమానాశ్రయ అధికారులను సంప్రదించినప్పటికీ, ల్యాండింగ్ తర్వాత చాలా గంటల పాటు తనకు స్పష్టమైన స్పందన రాలేదని ప్రియాంక వెల్లడించింది. ఈ సంఘటన విమానంలో జరిగినందున, ఈ విషయం విమానయాన సంస్థ, పోలీసుల పరిధిలోకి వస్తుందని విమానాశ్రయ అధికారులు స్పష్టం చేశారు. అయితే.. విమానంలోని సీసీ టీవీ ఫుటేజ్ ఇచ్చేందుకు ఎయిర్‌లైన్స్ నిరాకరించినట్లు సమాచారం. అయితే.. విమానంలో తన కూమార్తె మెడలో చైన్ ఉందని నిరూపించేందుకు ప్రియాంక విమానంలో తన కుమార్తె కేక్ తింటున్నప్పుడు తీసిన వీడియో కూడా అధికారులకు ఇచ్చింది. ఆ టైమ్‌లో చిన్నారి మెడలో బంగారు ఆభరణం ఉంది. కానీ, ఎయిర్ హోస్టెస్ ఆ చిన్నారిని బుజ్జగించేందుకు అలా లోపలికి తీసుకెళ్లి, తీసుకొచ్చిన తర్వాత లేదని ప్రియాంక ఆరోపిస్తోంది.
ఈ విషయం తెలుసుకున్న ప్రియాంక భర్త వెంటనే తిరువనంతపురం నుండి బెంగళూరుకు చేరుకున్నాడు. ఘటనపై ఫిర్యాదు చేసేందుకు ఆ రాత్రి ఎయిర్‌పోర్ట్‌లోనే వాళ్లు బస చేశారు. వారు కోల్‌కతాకు ప్రయాణించాల్సిన విమానం మిస్ అయినా కూడా వాళ్లు ఫిర్యాదు చేసే వెళ్లారు. దర్యాప్తు జరుగుతోందని, ఘటనపై తగిన ఒక సీనియర్ పోలీసు అధికారి హామీ ఇవ్వడంతో వాళ్లు అక్కడి నుంచి కోల్‌కతా వెళ్లారు. కాగా ఈ ఆరోపణలపై ఇండిగో స్పందిస్తూ.. తిరువనంతపురం నుండి బెంగళూరుకు వెళ్లే 6E 661 విమానంలో సిబ్బందికి సంబంధించిన ఇటీవలి సంఘటన గురించి మా కస్టమర్ లేవనెత్తిన ఆందోళన గురించి మాకు తెలిసింది. మేం అలాంటి విషయాలను చాలా తీవ్రంగా పరిగణిస్తాం, దర్యాప్తులో సంబంధిత అధికారులకు పూర్తి మద్దతు, సహకారాన్ని అందిస్తున్నాం” అని వెల్లడించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.