AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆర్ట్ ఆఫ్ లివింగ్‌కు 45 ఏళ్లు.. ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా 5 జాతీయ కార్యక్రమాల ప్రారంభం

బెంగళూరులో జరిగిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకల్లో ఉపరాష్ట్రపతి సి.పీ. రాధాకృష్ణన్ ఐదు కీలక జాతీయ కార్యక్రమాలను ప్రారంభించారు. గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ సేవలను ప్రశంసిస్తూ ప్రత్యేక తపాలా బిళ్లను కూడా ఆవిష్కరించారు. యువత, విద్య, స్టార్టప్‌లు, పర్యావరణ పరిరక్షణ, మానవ అభివృద్ధి లక్ష్యంగా ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

ఆర్ట్ ఆఫ్ లివింగ్‌కు 45 ఏళ్లు.. ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా 5 జాతీయ కార్యక్రమాల ప్రారంభం
CP Radhakrishnan -- Sri Sri Ravi Shankar
Ram Naramaneni
|

Updated on: May 29, 2026 | 2:19 PM

Share

బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ 45 ఏళ్ల సేవా ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి సి.పీ. రాధాకృష్ణన్ ఐదు కీలక జాతీయ కార్యక్రమాలను ప్రారంభించారు. ఇదే సందర్భంగా గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకలు కూడా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వ్యక్తిగత శ్రేయస్సు, సామాజిక మార్పు, ప్రపంచ శాంతి కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేసిన సేవలను గుర్తిస్తూ ప్రత్యేక స్మారక తపాలా బిళ్లను కూడా ఆవిష్కరించారు.

ప్రారంభించిన ఐదు ప్రధాన కార్యక్రమాల్లో.. యువతకు ఉపాధి, సివిల్ సర్వీసుల దిశగా శిక్షణ ఇచ్చే “యూత్ కెరీర్ ఎక్సలెన్స్ ప్రోగ్రామ్”, భారతీయ జ్ఞాన సంప్రదాయాలను ఆధునిక విద్యతో అనుసంధానించే “ఫ్యాకల్టీ ఆఫ్ ఈస్టర్న్ నాలెడ్జ్ సిస్టమ్స్”, స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందించే “ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇన్నోవేషన్ అండ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ ఇన్‌క్యూబేషన్”, మానసిక ఆరోగ్యం, చైతన్యం, మానవ సామర్థ్యాలపై పరిశోధనలు చేసే “సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ కాన్షియస్‌నెస్ స్టడీస్ అండ్ హ్యూమన్ పొటెన్షియల్” ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే పర్యావరణ కార్యక్రమం “ఈకో శాంతి” ఉన్నాయి.

ఈ సందర్భంగా మాట్లాడిన ఉపరాష్ట్రపతి సి.పీ. రాధాకృష్ణన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందని తెలిపారు. ప్రస్తుతం ఈ సంస్థ 182 దేశాల్లో పనిచేస్తోందని పేర్కొన్నారు. “అంతర్గత శాంతే బాహ్య సామరస్యానికి పునాది” అనే భావనతో 45 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ ఉద్యమం కోట్లాది మందిని ప్రభావితం చేసిందన్నారు. గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ గురించి మాట్లాడుతూ.. “ఆయన చిరునవ్వు, వినయం, ప్రేమ ప్రతి ఒక్కరి మనసును తాకుతాయి. ఆయన గొప్పతనంలో మానవత్వం స్పష్టంగా కనిపిస్తుంది” అని ప్రశంసించారు.

గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ మాట్లాడుతూ.. “ధ్యానం ఇప్పుడు విలాసం కాదు.. ఆరోగ్యకరమైన, ఒత్తిడి లేని జీవితానికి అది అవసరం” అని పేర్కొన్నారు. ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని 192 దేశాలు గుర్తించడం ఇందుకు నిదర్శనమన్నారు. “జీవితంలో జ్ఞానం, ధ్యానం, సంగీతం ఎప్పుడూ ఉండాలి” అని యువతకు సందేశం ఇచ్చారు. అలాగే “భయం, ద్వేషం, ఒత్తిడి లేని వసుధైవ కుటుంబకాన్ని నిర్మిద్దాం. శాంతియుత ప్రపంచం.. శాంతియుత వ్యక్తుల నుంచే ప్రారంభమవుతుంది” అని పిలుపునిచ్చారు.

కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోత్ మాట్లాడుతూ.. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉద్యమానికి కర్ణాటక నేల పుట్టినిల్లు కావడం గర్వకారణమన్నారు. గురుదేవ్ శాంతి స్థాపన కోసం ప్రపంచవ్యాప్తంగా చేసిన కృషిని కొనియాడారు. ఈ నెల పొడవునా జరిగిన వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, సర్బానంద సోనోవాల్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, నటుడు రజనీకాంత్, విక్రాంత్ మాస్సే, పారిశ్రామికవేత్తలు ముకేశ్ అంబానీ, అనంత్ అంబానీ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

ఆశ్రమ సందర్శనలో భాగంగా ఉపరాష్ట్రపతి శ్రీ శ్రీ గురుకులాన్ని సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. గోశాల, ప్రతాప్ గణపతి ఆలయం, సోమనాథ జ్యోతిర్లింగ అవశేషాలను దర్శించారు. అలాగే ఆర్ట్ ఆఫ్ లివింగ్ “ఇంట్యూషన్ ప్రోగ్రామ్”లో పిల్లలు ప్రదర్శించిన ప్రతిభను కూడా వీక్షించారు. మొత్తంగా.. ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45 ఏళ్ల సేవా ప్రయాణం కేవలం ఒక ఆధ్యాత్మిక సంస్థ విజయగాథ మాత్రమే కాకుండా.. శాంతి, సేవ, మానవతా విలువలతో ప్రపంచాన్ని కలిపే ఉద్యమంగా నిలిచిందనే భావన ఈ వేడుకల ద్వారా వ్యక్తమైంది.

Follow Us