Khatu Shyam Temple: రాజస్థాన్‌లో విషాదం.. శ్యామ్‌జీ ఆలయంలో తొక్కిసలాట.. ముగ్గురు మహిళల మృతి..
Khatu Shyam Temple Stampede: సికార్‌లోని ఖతు శ్యామ్‌జీ ఆలయంలో సోమవారం తెల్లవారుజామున తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.
Khatu Shyam Temple Stampede: రాజస్థాన్‌లో విషాదం చోటుచేసుకుంది. సికార్‌లోని ఖతు శ్యామ్‌జీ ఆలయంలో సోమవారం తెల్లవారుజామున తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం జైపూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఆలయ ముఖద్వారం వద్ద ఉదయం 5 గంటల ప్రాంతంలో తొక్కిసలాట జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. హిందూ సంప్రదాయం ప్రకారం.. చాంద్రమాన క్యాలెండర్‌లో 11వ రోజున శ్రీకృష్ణుని అవతారంగా భావిస్తున్న ఖతు శ్యామ్ జీ దర్శనాన్ని శుభప్రదంగా భావిస్తారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడి బయట భక్తులు గేట్లు తెరిచే వరకు భారీ సంఖ్యలో వేచి ఉన్నారు. గేట్లు తెరవగానే ఒక్కసారిగా లోపలికి పరుగులు తీశారు. ఈ క్రమంలో ఒక మహిళ స్పృహతప్పి పడిపోయింది. వెనుక నుంచి భక్తులు ఒక్కసారిగా ప్రవేశించడానికి ప్రయత్నించడంతో గందరగోళం ఏర్పడి తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసుల బృందం వెంటనే ఆలయానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సికార్ ఎస్పీ కున్వర్ రాష్ట్రదీప్ మాట్లాడుతూ.. పరిస్థితి అదుపులో ఉన్నట్లు వెల్లడించారు. మరికొంతమంది కూడా గాయపడినట్లు తెలిపారు.
కాగా.. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. రాజస్థాన్‌లోని సికార్‌లోని ఖతు శ్యామ్‌జీ ఆలయంలో తొక్కిసలాట కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రెషియా..
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కూడా ఈ ఘటనపై ఆవేదన వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు చొప్పున, గాయపడిన వారికి రూ.20 వేలు ఎక్స్‌గ్రెషియా ప్రకటించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..