ఓ వైపు వ్యాక్సిన్ల తీవ్ర కొరత, మరో వైపు వృధా చేస్తున్న రాష్ట్రాలు, తెలంగాణాలో కూడా !
కరోనా సెకండ్ వేవ్ తో దేశమంతా అల్లాడుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ల కోసం కోట్లాది మంది వేచి చూస్తున్నారు. ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న వైరస్ కేసుల కారణంగా అనేక రాష్ట్రాలను...
కరోనా సెకండ్ వేవ్ తో దేశమంతా అల్లాడుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ల కోసం కోట్లాది మంది వేచి చూస్తున్నారు. ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న వైరస్ కేసుల కారణంగా అనేక రాష్ట్రాలను టీకామందుల కొరత తీవ్రంగా పట్టి పీడిస్తోంది. తమకు 5.4 కోట్ల వ్యాక్సిన్ డోసులు కావాలని పశ్చిమ బెంగాల్ కేంద్రాన్ని కోరగా ఏపీ వంటి రాష్ట్రాలు తమకు పంపుతున్న డోసులు ఏ మాత్రం చాలడంలేదని, కొన్ని లక్షల డోసులను అత్యవసరంగా పంపాలని అభ్యర్థిస్తున్నాయి. అటు ఆక్సిజన్ సిలిండర్ల కొరత కూడా ఆందోళన కలిగిస్తోంది. దేశంలో వివిధ రాష్ట్రాలకు కేటాయించిన మొత్తం వ్యాక్సిన్లలో ఈ నెల 11 వరకు 23 శాతం వృధా అయిన షాకింగ్ న్యూస్ తెలిసింది. ఆర్ టీ ఐ చట్టం కింద ఓ వ్యక్తి దాఖలు చేసిన దరఖాస్తును పురస్కరించుకుని వెల్లడైన ఈ వాస్తవం ఆశ్చర్యం కలిగించడమే కాకుండా ఆందోళనను కూడా రేకెత్తిస్తోంది. ఈ రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడు ఎక్కువగా వ్యాక్సిన్లను వృధా చేసిందట. ఆ రాష్ట్రం 12.10 శాతం వేస్ట్ చేసిందట. ఇక హర్యానా 9.74, పంజాబ్ 8.12, మణిపూర్ 7.8, తెలంగాణ 7.55 శాతం వృధా చేసినట్టు తేలింది.
ఈ నెల 11 వ తేదీవరకు రాష్ట్రాలు వినియోగించిన 10 కోట్ల డోసులకు గాను 44 లక్షల డోసులు వృధా అయినట్టు వెల్లడైంది. అటు-కేరళ, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, మిజోరాం, గోవా, డామన్ డయ్యు, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ వ్యాక్సిన్ నిల్వలను కాస్త తక్కువగా వృధా చేశాయట. ఇప్పటికే దేశంలో కోవిడ్ కేసులు దాదాపు మూడు లక్షలకు చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇండియా వైపు వెళ్లరాదని అమెరికా తమ దేశస్థులను హెచ్చరిస్తుంటే బ్రిటన్ కూడా తమ దేశంలోకి ఎంటర్ కావద్దంటూ ఇండియాను రెడ్ లిస్టులో చేర్చింది. ఒకప్పుడు వ్యాక్సిన్ల కోసం ఇండియాను అర్థించిన దేశాలు ఇప్పుడు ముఖం చాటేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో టీకామందుల కొరత కూడా భారత ప్రభుత్వానికి పరోక్షంగా ఆందోళన కలిగిస్తోంది. ఇక వీటి వృదాను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాల్సి ఉంది.