NDA vs INDIA: ప్రతిపక్ష కూటమి ‘ఇండియా‘లో బీఎస్పీ చేరుతుందా?.. క్లారిటీ ఇచ్చేసిన మాయావతి
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మోదీ సర్కారును గద్దె దించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఇండియా కూటమి పార్టీల నేతలు ముంబైలో ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో సమావేశంకానున్నారు. ఈ నేపథ్యంలో బహుజన్ సమాజ్‌వాది పార్టీ(బీఎస్పీ) కూడా విపక్ష కూటమి - ఇండియాలో చేరే అవకాశముందన్న ప్రచారంపై ఆ పార్టీ చీఫ్ మాయావతి స్పందించారు.

2024 General Elections: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ జాతీయ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్డీయే వ్యతిరేక పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ‘ఇండియా’ కూటమి నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మోదీ సర్కారును గద్దె దించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఇండియా కూటమి పార్టీల నేతలు ముంబైలో ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో సమావేశంకానున్నారు. ఈ నేపథ్యంలో బహుజన్ సమాజ్‌వాది పార్టీ(బీఎస్పీ) కూడా విపక్ష కూటమి – ఇండియాలో చేరే అవకాశముందన్న ప్రచారంపై ఆ పార్టీ చీఫ్ మాయావతి స్పందించారు. ఎన్డీయే లేదా ఇండియా కూటమిలో బీఎస్పీ ఎట్టి పరిస్థితిలోనూ చేరబోదని ఆమె తేల్చేశారు.
ఎన్డీయే, ఇండియా కూటమిలో అందుకే చేరడం లేదు..
వచ్చే సార్వత్రిక ఎన్నికలు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ‘ఎక్స్’ వేదికగా ఆమె స్పష్టంచేశారు. ఇండియా కూటమిలో బీఎస్పీ చేరనున్నట్లు అవాస్తవ కథనాలను ప్రచారం చేయొద్దని ఆమె మీడియాను కోరారు. ఎన్డీయే, ఇండియా కూటమితో బీఎస్పీ ఎందుకు చేరడం లేదో ఆమె వివరణ ఇచ్చారు. ఆ రెండు కూటములలోని చాలా పార్టీలు ప్రజా వ్యతిరేక, కులతత్వ, పెట్టుబడిదారీ పార్టీలుగా ఆమె ధ్వజమెత్తారు. దీనికి వ్యతిరేకంగా బీఎస్పీ చాలా కాలంగా పోరాటం చేస్తోందని గుర్తుచేశారు. అలాంటి పార్టీలతో చేతులు కలిపి ఎన్నికల బరిలో నిలిచే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తమతో చేతులు కలిపిన వారే ‘లౌకిక పార్టీలు’ అన్నట్లు ఇండియా కూటమి ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని మాయావతి అన్నారు.
అందరి చూపు ముంబై వైపే..
ముంబైలో జరిగే ఇండియా కూటమి నేతల సమావేశం సర్వత్రా ఉత్కంఠరేపుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల పంపిణీని ఈ సమావేశంలో ఖరారు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 27 పార్టీలకు చెందిన దాదాపు 62 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇండియా కూటమి లోగోకు ఆమోదం తెలపడంతో పాటు.. కూటమి కనీస ఉమ్మడి ప్రణాళికను కూడా ఈ సమావేశంలో ఖరారు చేసే అవకాశముంది. ఇండియా కూటమికి కన్వీనర్‌గా ఎవరు వ్యవహరిస్తారన్న అంశంపైనా ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇండియా కూటమి తొలి సమావేశం పాట్నాలో జరగ్గా.. రెండో సమావేశం బెంగుళూరులో జరగ్గా.. ఇప్పుడు మూడోసారి ముంబైలో జరగుతోంది. దీన్ని విజయవంతం చేసేందుకు మహా వికాస్ అగాడీ (MVA) గత కొన్ని రోజుల ముందు నుంచే భారీ ఏర్పాట్లు చేస్తోంది. ముంబై కాన్‌క్లేవ్‌లో గత రెండు సమావేశాలకు హాజరుకాని కొన్ని ప్రాంతీయ పార్టీల నేతలు కూడా పాల్గొంటారని నిర్వాహకులు ధీమా వ్యక్తంచేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి..