Medical Students: ప్రతి నలుగురు మెడికోల్లో ఒకరికి మానసిక సమస్య
దేశంలో ప్రతి నలుగురు MBBS స్టూడెంట్స్‌లో ఒకరు మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఇక ప్రతి ముగ్గురు పీజీ స్టూడెంట్స్‌లో ఒకరు...సూయిసైడ్ టెండెన్సీతో బాధ పడుతున్నారు. నిర్ఘాంతపోయే ఈ నిజాలను నేషనల్ మెడికల్ కమిషన్ బయటపెట్టింది. అందరికి వైద్యం చేసే మెడికోలకు చికిత్స చేసేదెవరు? ఎలా?

తెల్ల కోటు వేసుకుని, స్టెతస్కోపు పట్టుకుని అందరికి వైద్యం చేసే మెడికోలే ఇప్పుడు పేషంట్లుగా మారుతున్నారు. రోగులకు మేమున్నాం అంటూ భరోసా ఇస్తారు మెడికోలు. వాళ్లను చూస్తే సగం రోగం తగ్గిపోయినట్లు ఫీలవుతారు పేషంట్లు. చెయ్యి పట్టుకుని నాడి చూసి, బీపీ చెక్ చేసి మందులు రాసిస్తే…మహద్భాగ్యంగా భావిస్తారు. అయితే ఆ తెల్లకోటు వెనకాల కనిపించని నల్లని మానసిక వ్యథ కథ దాగి ఉంది.
25 శాతం మందికి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్
దేశంలోని ప్రతి నలుగురు MBBS స్టూడెంట్స్‌లో ఒకరు..మానసిక సమస్యలతో బాధ పడుతున్నారు. అంటే దేశంలోని MBBS విద్యార్థుల్లో 25 శాతంమందిని ఏదో ఒక మానసిక రోగం వెంటాడుతోంది. ఇక మెడికల్ పీజీ చేసే విద్యార్థుల్లో…ప్రతి ముగ్గురిలో ఒకరు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలతో సతమతమై పోతున్నారుట. 31.23 శాతంమందిలో ఈ టెండెన్సీ కనిపిస్తోందట. గత 12 నెలల్లో 4.4 శాతం మంది పీజీ మెడికోలు…అంటే 237మంది ఆత్మహత్యా యత్నం చేశారట. ఇక MBBS చదువుతున్న వారిలో 10.5 శాతం..అంటే 564మంది విద్యార్థులు ఆత్మహత్యా యత్నం చేశారట. నేషనల్ మెడికల్ కమిషన్ ఆన్‌లైన్ సర్వేలో ఈ నమ్మలేని నిజాలు బయటపడ్డాయి.
16.2 శాతం MBBS విద్యార్థుల్లో సూయిసైడ్ టెండెన్సీ
MBBS చదువుతున్న వారిలో 27.8 శాతం మందికి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తేలిందట. ఇక 16.2 శాతం సూయిసైడ్ చేసుకోవాలనే ఆలోచనతో సతమతమై పోయారట. మానసిక సమస్యలతో బాధ పడుతున్న మెడికోలకు మెంటల్ హెల్త్ సర్వీసెస్ అందుబాటులో లేవని తేలింది. ఇక మెడికోలు కూడా తమ మానసిక సమస్యలను బయటకు చెప్పుకోవడానికి, చికిత్స చేయించుకోవడానికి ఇష్టపడడం లేదట. తమ మీద పిచ్చోళ్లనే ముద్ర వేస్తారనే భయంతో వాళ్లు చికిత్సకు ముందుకు రావడం లేదుట. మానసిక సమస్యలను బయటకు చెప్పుకుని, వైద్య సహాయం తీసుకోవడానికి…పీజీ స్టూడెంట్స్‌లో 41 శాతం మంది నిరాకరిస్తున్నారట.
పలు చర్యలు సిఫార్సు చేసిన టాస్క్‌ఫోర్స్
ఇలాంటి మానసిక సమస్యలతో బాధపడుతున్న మెడికోలు…రేపు డాక్టర్లు అయ్యాక, వాళ్లపై అవి ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైద్య నిపుణులు. దేశవ్యాప్తంగా 25,590మంది MBBS స్టూడెంట్స్, 5,337మంది పీజీ విద్యార్థులు, 7,035మంది ఫ్యాకల్టీ మెంబర్స్ నుంచి అభిప్రాయ సేకరణ జరిపి ఈ సర్వే నిర్వహించారు. ఈ సర్వేను దేశపు అత్యున్నత వైద్య విద్యా నియంత్రణ మండలి నియమించిన టాస్క్‌ఫోర్స్ చేసింది. దీంతో ఇది మరింత కలవరం కలిగించే అంశంగా మారింది. మానసిక సమస్యల బారి నుంచి మెడికోలను కాపాడేందుకు పలు చర్యలను టాస్క్‌ఫోర్స్ సిఫార్సు చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




