Success Tips: వారెన్ బఫెట్ విజయ రహస్యం ఇదే! అలవాట్లు, అభిరుచులకు అంత శక్తి ఉందా?
మంచి అభిరుచులు, అలవాట్లు ఉన్న వ్యక్తులు తక్కువ ఒత్తిడికి గురవుతారని, సంతోషంగా ఉంటారని, మరింత సృజనాత్మకంగా ఉంటారని, ఎక్కువ కాలం జీవిస్తారని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
మీ అలవాట్లు మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయని తెలుసా? మీ అభిరుచులు మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తాయనిని ఎప్పుడైనా కనీసం ఆలోచించారా? లేదు కదా! అయితే ఈ కథనం మీరు చదివితీరాలి. మీకున్న అలవాట్లు, మీకున్న అభిరుచులు మిమ్మల్నీ మీ లక్ష్యాలవైపు నడిపిస్తాయని సైన్స్ నిరూపించింది. అనేక రకాల అధ్యయనాలు కూడా దీనిని స్పష్టం చేస్తున్నాయి. ప్రముఖ బిలియనీర్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతున్నారు. మధ్యలో వారెన్ బఫెట్ ఎందుకొచ్చారు అని ఆలోచిస్తున్నారా? ఆయన తన సక్సెస్ సీక్రెట్ ని ఇటీవల వెల్లడించారు. అందులో ఆయన చెప్పిన విషయం తెలుసుకుంటే ఆశ్చర్యపోకమానరు. వారెన్ బఫెట్ విజయ రహస్యం ఏంటో తెలుసా? ఆయన ఆఫీస్ సమయాన్ని ముగించిన తర్వాత చేసే పనులేనట. ఆఫీస్ సమయంలో విపరీతమైన ఒత్తిడిని అనుభవించే వారెన్ బఫెట్.. తన ఆఫీస్ ముగిసిన తర్వాత కార్డ్స్ ఆడతారట! దాని ద్వారా మానసిక ప్రశాంతత వస్తుందట. దాంతో పాటు గిటార్ ప్లే చేస్తూ ఉంటారట. ఈ రెండింటిని చేయడం ద్వారా ఆయన మానసిక ప్రశాంతత పొందుతారట. ఈ అభిరుచి, అలవాట్లే తనకు మంచి ఆలోచనలు కలిగేలా చేస్తాయని తద్వారా ఆఫీసులో ఉత్సాహంగా పనిచేయడానికి అవకాశం ఏర్పడుతుందని వివరించారు.
అధ్యయనాలు కూడా ఇదే చెబుతున్నాయి..
ఇదే విషయాన్ని కొన్ని అధ్యయనాలు కూడా నిరూపించాయి. మంచి అభిరుచులు ఉన్న వ్యక్తులు తక్కువ ఒత్తిడికి గురవుతారని, సంతోషంగా ఉంటారని, మరింత సృజనాత్మకంగా ఉంటారని, ఎక్కువ కాలం జీవిస్తారని ఆ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ అధ్యయనాల్లో కొన్నింటిని చూద్దాం..
పనిలో మెరుగ్గా ఉండేందుకు.. తమ అభిరుచులును ఆస్వాదించే వారు, అలాగే కేవలం పనిలో నిమగ్నమయ్యే వారి మధ్య తేడాలను గమనించడానికి ఓ అధ్యయనం చేశారు. దాదాపు 400 మంది ఉద్యోగులపై ఈ పరిశోధన జరిగింది. దీనికి సంబంధించిన ఫలితాలు జర్నల్ ఆఫ్ ఆక్యుపేషనల్ అండ్ ఆర్గనైజేషనల్ సైకాలజీలో ప్రచురితమయ్యాయి. పని వెలుపల సృజనాత్మక కార్యకలాపాలను కొనసాగించే ఉద్యోగులు వివిధ ప్రాజెక్ట్‌లలో సమస్యలను పరిష్కరించడంలో మెరుగ్గా ఉన్నారని అలాగే ఉద్యోగంపై మెరుగైన వైఖరిని కలిగి ఉన్నారని దానిలో పేర్కొన్నారు.
ఒత్తిడి స్థాయిని తగ్గిస్తుంది.. అన్నల్స్ ఆఫ్ బిహేవియరల్ మెడిసిన్‌లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం.. ఖాళీ సమయాల్లో మంచి అలవాట్లతో మైండ్, శరీరానికి ఉల్లాసాన్ని నింపే ఉద్యోగుల్లో ఎక్కువ సానుకూలత, తక్కువ ప్రతికూల మానసిక స్థితి ఉన్నట్లు కొనుగొన్నారు. ఎక్కువ ఆసక్తి, తక్కువ ఒత్తిడి, తక్కువ హృదయ స్పందన రేటును కలిగి ఉన్నట్లు గుర్తిఇంచారు. అభిరుచులు తక్షణ ఒత్తిడి ఉపశమనాన్ని ఎలా అందిస్తాయో ఈ అధ్యయనం వివరించింది. 1,400 మంది వ్యక్తులపై చేసిన మరొక అధ్యయనంలో మీ రక్తపోటును తగ్గించడానికి, మీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి క్రాఫ్టింగ్, అల్లికలు, వంట చేయడం, వాయిద్యం వాయించడం వంటి అలవాట్లు సాయపడతాయని కనుగొన్నాయి. పెయింటింగ్ లేదా డ్రాయింగ్ ఒత్తిడిని తగ్గిస్తుందని ఆ అధ్యయనం స్పష్టం చేసింది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..