AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెడ్ మీద కూర్చొని తింటున్నారా.. అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్లే.. ఎందుకో తెలుసా..?

Eating on Bed: మీకు మంచం మీద కూర్చుని టీవీ చూస్తూ భోజనం చేసే అలవాటు ఉందా..? అయితే మీరు తెలియకుండానే పెద్ద ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటున్నారు. చూడటానికి ఇది చాలా సౌకర్యంగా అనిపించినా.. మీ జీర్ణవ్యవస్థను, నిద్రను, చివరికి మీ చర్మాన్ని కూడా ఇది దెబ్బతీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మంచం మీద తినడం వల్ల కలిగే ఆ భయంకరమైన నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

బెడ్ మీద కూర్చొని తింటున్నారా.. అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్లే.. ఎందుకో తెలుసా..?
Side Effects Of Eating On Bed
Krishna S
|

Updated on: Jan 22, 2026 | 11:18 AM

Share

చాలామందికి రాత్రిపూట లేదా ఖాళీ సమయాల్లో మంచం మీద కూర్చుని, టీవీ చూస్తూనో లేదా మొబైల్ వాడుతూనో భోజనం చేయడం అలవాటు. ఇది ఎంతో హాయిగా, సౌకర్యంగా అనిపించవచ్చు. కానీ ఈ చిన్న అలవాటు మీ ఆరోగ్యానికి ఎంతటి చేటు చేస్తుందో తెలుసా..? మంచం మీద తినడం వల్ల కలిగే అనర్థాలపై ఆరోగ్య నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. మనం ఆహారం తిన్నప్పుడు మన శరీరం నిటారుగా ఉండాలి. అప్పుడే ఆహారం అన్నవాహిక ద్వారా కడుపులోకి సులభంగా వెళుతుంది. మంచం మీద కూర్చున్నప్పుడు మనం నిటారుగా ఉండము, దీనివల్ల జీర్ణ రసాలు సరిగ్గా ఉత్పత్తి కావు. పడుకుని తినడం వల్ల ఆహారం అన్నవాహికలో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. ఇది తీవ్రమైన ఎసిడిటీ, గ్యాస్, గుండెల్లో మంటకు దారితీస్తుంది.

తెలియకుండానే పెరిగే బరువు

మంచం మీద తింటున్నప్పుడు మన దృష్టి ఆహారం మీద కంటే టీవీ లేదా మొబైల్ స్క్రీన్‌పైనే ఎక్కువగా ఉంటుంది. దీనిని మైండ్‌లెస్ ఈటింగ్ అంటారు. అంటే మనం ఎంత తింటున్నామో మన మెదడుకు సరిగ్గా తెలియదు. దీనివల్ల అవసరానికి మించి ఎక్కువగా తినేస్తాం. ఫలితంగా ఊబకాయం, మధుమేహం వంటి జీవనశైలి వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదం ఉంది.

కనిపించని క్రిములు.. ఇన్ఫెక్షన్ల భయం

మంచం మీద తిన్నప్పుడు మనకు తెలియకుండానే చిన్న చిన్న ఆహార కణాలు పరుపులు, దుప్పట్లపై పడతాయి. ఇవి కంటికి కనిపించవు కానీ, బ్యాక్టీరియా, ఇతర కీటకాలను ఆకర్షిస్తాయి. దీనివల్ల చర్మ సంబంధిత అలర్జీలు, ఉబ్బసం ఉన్నవారికి శ్వాసకోశ సమస్యలు పెరగవచ్చు. మంచం పరిశుభ్రంగా లేకపోవడం వల్ల నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయి.

నిద్రపై ప్రభావం

మెదడుకు మంచం అంటే నిద్రపోయే చోటు అనే సంకేతం ఉంటుంది. కానీ మీరు అక్కడే తినడం, ల్యాప్‌టాప్ వాడటం చేస్తే.. అది విశ్రాంతి తీసుకోవాల్సిన చోటా లేక పని చేయాల్సిన చోటా అని మెదడు గందరగోళానికి గురవుతుంది. దీనివల్ల రాత్రిపూట ప్రశాంతమైన నిద్ర కరువవుతుంది.

నిపుణులు ఇస్తున్న సలహాలు

ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం తినే విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

  • వీలైనంత వరకు నిటారుగా కూర్చుని భోజనం చేయండి.
  • తినేటప్పుడు మొబైల్స్, టీవీలకు దూరంగా ఉండండి. ఆహారాన్ని బాగా నమలి తినడం వల్ల పోషకాలు శరీరానికి బాగా అందుతాయి.
  • భోజనం చేసిన తర్వాత కాసేపు అటు ఇటు నడవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
  • తిన్న తర్వాత నోటిని శుభ్రం చేసుకోవడం మర్చిపోవద్దు.

మంచం అనేది కేవలం విశ్రాంతికి, నిద్రకు మాత్రమే పరిమితం చేయాలి. తిండి సరిగ్గా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది అనే సామెతను గుర్తుంచుకుని, సరైన భంగిమలో ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..