Secret Santa: క్రిస్మస్ వేళ ఎవరీ ‘సీక్రెట్ శాంటా’? ఈ సంప్రదాయం వెనుక ఉన్న చరిత్ర తెలుసా?
డిసెంబర్ వచ్చిందంటే చాలు ప్రపంచమంతా క్రిస్మస్ వెలుగులతో నిండిపోతుంది. రంగురంగుల విద్యుత్ దీపాలు, క్రిస్మస్ ట్రీలు, కేకులతో పాటు ప్రతి ఆఫీసులోనూ, స్నేహితుల మధ్య ఒక వింతైన ఆట మొదలవుతుంది. అదే 'సీక్రెట్ శాంటా'. ఎవరో ఒకరు మనకు తెలియకుండా మన డెస్క్ ..

డిసెంబర్ వచ్చిందంటే చాలు ప్రపంచమంతా క్రిస్మస్ వెలుగులతో నిండిపోతుంది. రంగురంగుల విద్యుత్ దీపాలు, క్రిస్మస్ ట్రీలు, కేకులతో పాటు ప్రతి ఆఫీసులోనూ, స్నేహితుల మధ్య ఒక వింతైన ఆట మొదలవుతుంది. అదే ‘సీక్రెట్ శాంటా’. ఎవరో ఒకరు మనకు తెలియకుండా మన డెస్క్ మీద గిఫ్టులు పెట్టి వెళ్తుంటారు, అలాగే మనం కూడా ఎవరికో ఒకరికి గిఫ్ట్ పంపాలి కానీ అది మనమే అని వారికి తెలియకూడదు. ఈ దాగుడుమూతల గిఫ్ట్ గేమ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక ట్రెండ్‌గా మారింది. అయితే ఈ సంప్రదాయం ఊరికే పుట్టలేదు. దీని వెనుక వందల ఏళ్ల చరిత్ర, ఒక గొప్ప మనసున్న వ్యక్తి కథ దాగి ఉంది. అసలు ఈ ‘సీక్రెట్ శాంటా’ ఆలోచన ఎక్కడ పుట్టిందో ఇప్పుడు చూద్దాం.
అసలైన సీక్రెట్ శాంటా..
ఈ ఆధునిక సంప్రదాయానికి ఆద్యుడు లారీ డీన్ స్టీవర్ట్ అనే అమెరికన్ బిజినెస్ మ్యాన్ అని చెబుతుంటారు. 1970వ దశకంలో ఆయన తన జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించారు. కానీ ఒకసారి తన వ్యాపారం పుంజుకున్నాక, తాను పడిన కష్టాలు ఇతరులు పడకూడదని నిర్ణయించుకున్నారు. ప్రతి ఏడాది క్రిస్మస్ సమయంలో ఆయన అపరిచితులకు, పేదవారికి తన పేరు బయట పెట్టకుండా 100 డాలర్ల నోట్లను పంచుతుండేవారు. దాదాపు 25 ఏళ్ల పాటు తన ఎవరో ఎవరికీ తెలియకుండా ఈ దానధర్మాలు చేశారు. అందుకే ఆయనను ‘ఒరిజినల్ సీక్రెట్ శాంటా’ అని పిలుస్తారు.
వివిధ పేర్లతో..
ఈ సంప్రదాయం కేవలం అమెరికాకు మాత్రమే పరిమితం కాలేదు. వివిధ దేశాల్లో దీనిని రకరకాల పేర్లతో పిలుస్తారు. స్కాండినేవియాలో దీనిని ‘జుల్‌క్లాప్’ అని పిలుస్తారు. ఎవరో ఒకరు ఇంటి తలుపు కొట్టి, పేరు చెప్పకుండా గిఫ్ట్ వదిలేసి వెళ్ళడం ఇక్కడి ఆచారం. జర్మనీలో ఇక్కడ ‘విక్టెల్న్’ అని పిలుస్తారు. అంటే ఒక చిన్న దేవత లేదా పిశాచి అని అర్థం. వారు తెలియకుండా గిఫ్టులు ఇస్తారని వారి నమ్మకం. ప్రస్తుత కార్పొరేట్ ప్రపంచంలో ‘సీక్రెట్ శాంటా’ అనేది కేవలం గిఫ్టులకే పరిమితం కాలేదు.
ఇది ఉద్యోగుల మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి ఒక మంచి మార్గంగా మారింది. ఆఫీసులో ఒకరితో ఒకరికి పెద్దగా పరిచయం లేని వారు కూడా ఈ ఆట వల్ల మాట్లాడుకోవడం మొదలుపెడతారు. ఏడాది పొడవునా పని ఒత్తిడిలో ఉండే ఉద్యోగులకు ఈ సరదా పండుగ వాతావరణం ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. అందరూ కలిసి గిఫ్టులు ఇచ్చుకోవాలి అంటే ఖరీదైనవి కాకుండా, ఒక నిర్ణీత బడ్జెట్‌లో కొనుక్కోవడం వల్ల ఎవరికీ భారం అనిపించదు.
ఎవరు ఏ గిఫ్ట్ ఇస్తారో అన్న ఉత్సుకత, చివరి రోజున మన శాంటా ఎవరో తెలుసుకున్నప్పుడు కలిగే ఆనందం.. ఇవే ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ సజీవంగా ఉంచుతున్నాయి. బహుమతి చిన్నదా పెద్దదా అన్నది ముఖ్యం కాదు, దాని వెనుక ఉన్న ఆ ప్రేమ, సంతోషం పంచడమే ఈ ‘సీక్రెట్ శాంటా’ అసలైన ఉద్దేశం. మరి ఈ ఏడాది మీ సీక్రెట్ శాంటా ఎవరో గెస్ చేశారా?
