AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జింగ్ జింగ్ అమేజింగ్.. చెప్పులు లేకుండా నడిస్తే ఇన్ని ప్రయోజనాలా..?

చెప్పులు లేకుండా నడవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇది నిద్రలేమి, ఒత్తిడిని తగ్గించి, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే, రక్తప్రసరణను వృద్ధి చేసి, కండరాలను, ఎముకలను దృఢం చేస్తుంది. శరీరం నొప్పి నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

జింగ్ జింగ్ అమేజింగ్.. చెప్పులు లేకుండా నడిస్తే ఇన్ని ప్రయోజనాలా..?
Walking Barefoot Benefits
Shaik Madar Saheb
|

Updated on: Jan 24, 2026 | 6:15 AM

Share

ప్రస్తుత కాలంలో మనం ఇంట్లో ఉన్నా లేదా బయట ఉన్నా పాదరక్షలు (చెప్పులు) ధరించడం సర్వసాధారణంగా మారింది. అయితే, చెప్పులు లేకుండా నడవడం వల్ల ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఇటీవలి పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఈ అభ్యాసం మన పూర్వీకులకు సుపరిచితమైనప్పటికీ. శాస్త్రీయ అధ్యయనాలు దీని ప్రాముఖ్యతను తిరిగి ధృవీకరిస్తున్నాయి. చెప్పులు లేకుండా నడవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

చెప్పులు లేకుండా నడవడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలలో ఒకటి నిద్రలేమిని దూరం చేయడం, ఒత్తిడిని తగ్గించడం. మనం నేరుగా భూమితో సంబంధం కలిగి ఉన్నప్పుడు, మన శరీరం ప్రతికూల అయాన్లను గ్రహించి, సానుకూల అయాన్లను విడుదల చేస్తుంది. ఈ ప్రతికూల అయాన్లు సహజసిద్ధమైన యాంటీ డిప్రెసెంట్‌లుగా పనిచేసి, మంచి నిద్రను అందిస్తాయి.. ఇంకా మానసిక ప్రశాంతతకు దోహదపడతాయి. తద్వారా మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుంది. యోగా, ధ్యానం వంటి ప్రక్రియలలో ఒట్టికాళ్ళతో ఉండడం ఈ అయాన్ల సమతుల్యతకు సహాయపడుతుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపరిచి, ఆలోచనా విధానాన్ని స్పష్టం చేస్తుంది.

అదనంగా, చెప్పులు లేకుండా నడవడం శరీర నొప్పులను గణనీయంగా తగ్గిస్తుంది. హైహీల్స్ వంటి ఫ్యాన్సీ ఫుట్‌వేర్ ధరించడం వల్ల శరీర భంగిమ, నడక తీరు మారి, మెడనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు వంటి సమస్యలు తలెత్తుతాయి. ఒట్టికాళ్ళతో నడవడం వల్ల మునివేళ్ళు, చీలమండలు, మోకాళ్ళు దృఢంగా తయారై, ఈ రకాల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.

ఈ అభ్యాసం జ్ఞానేంద్రియాల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. పాదరక్షలు ధరించినప్పుడు, నేలతో మనకు ఉండే ప్రత్యక్ష సంబంధం తగ్గిపోతుంది. చెప్పులు లేకుండా నడిచినప్పుడు, మన పాదాలు స్పర్శను బాగా గ్రహించి, మనం ఎక్కడ నడుస్తున్నాం, దేనిపై కాలు వేస్తున్నాం అనే సమాచారాన్ని మెదడుకు వేగంగా చేరవేస్తాయి.. తద్వారా జ్ఞానేంద్రియాలు చురుగ్గా పనిచేస్తాయి.

మెరుగైన రక్తప్రసరణ చెప్పులు లేకుండా నడవడం ద్వారా లభించే మరో ముఖ్య ప్రయోజనం. భూమి గురుత్వాకర్షణకు అనుగుణంగా, పాదాల నుండి మెదడుకు రక్తప్రసరణ మరింత చురుగ్గా జరుగుతుంది. ఇది రక్తప్రసరణ వ్యవస్థను బలోపేతం చేసి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఇంకా, చెప్పులు లేకుండా నడవడం వల్ల కండరాలు, ఎముకలు గట్టిపడతాయి. ఉదయాన్నే లేదా సాయంకాలం సూర్యరశ్మి పడే చోట ఒట్టికాళ్ళతో నడిస్తే, ఎముకలకు కాల్షియం సమృద్ధిగా అందుతుంది. ఇది ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కంటిచూపు సమస్యలు ఉన్నవారు పొద్దున్నే గడ్డిపై చెప్పులు లేకుండా నడవడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.. ఈ విధంగా, చెప్పులు లేకుండా నడవడం సమగ్ర శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుంది.