Balakrishna: నెట్‌ఫ్లిక్స్‌కు బాలయ్య మేనియా.. బయోలోనే ‘జై బాలయ్య’! అఖండ 2 తాండవం వేళ సోషల్ మీడియాలో సెన్సేషన్!
ఆయన ఒక అడుగు వేస్తే అది సంచలనం.. ఆయన ఒక డైలాగ్ చెబితే అది ప్రభంజనం. నందమూరి నటసింహం పేరు వింటేనే థియేటర్లు దద్దరిల్లిపోతాయి. ఆయన అభిమానులు చేసే 'జై బాలయ్య' అనే నినాదం ఇప్పుడు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు.

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఒక అంతర్జాతీయ ఓటీటీ దిగ్గజం సైతం ఇప్పుడు ఈ నినాదంతో ఊగిపోతోంది. సాధారణంగా సినిమాలు ప్రమోట్ చేసే ఓటీటీ సంస్థలు, మొదటిసారి ఒక స్టార్ హీరోకు వీరాభిమానిగా మారిపోయి అందరినీ ఆశ్చర్యపరిచాయి. తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ బయోలోనే మార్పులు చేసి నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించాయి. అసలు నెట్‌ఫ్లిక్స్ వంటి పెద్ద సంస్థ బాలయ్య కోసం ఇలా ఎందుకు చేసింది? ఆ ‘తాండవం’ వెనుక ఉన్న అసలు కథ ఏంటో తెలుసుకుందాం..
నెట్‌ఫ్లిక్స్‌ను కమ్మేసిన బాలయ్య క్రేజ్..
ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలో నెట్‌ఫ్లిక్స్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి అంతర్జాతీయ సంస్థ ఇప్పుడు బాలయ్య అభిమానిగా మారిపోయింది. నెట్‌ఫ్లిక్స్ ఇండియా సౌత్ (Netflix India South) తన ట్విట్టర్ (X) బయోలో “Jai Balayya” అని రాయడం చూసి నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. సాధారణంగా ఫ్యాన్ పేజీలు మాత్రమే ఇలాంటివి చేస్తాయి. కానీ ఒక అఫీషియల్ కార్పొరేట్ పేజీ ఇలా స్పందించడం అంటే బాలయ్య ఇమేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
అఖండ 2: తాండవం ..
బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ విజయం ‘అఖండ 2: తాండవం’. థియేటర్లలో పరవాలేదు అనిపించుకున్న ఈ సినిమా, జనవరి 9, 2026 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ తమ ప్రొఫైల్ బ్యానర్ పై అఖండ ఫోటోను పెట్టి, బయోలో జై బాలయ్య అని రాసి ఈ సినిమాకు గ్రాండ్ వెల్కమ్ చెప్పింది.
బోయపాటి మార్క్.. బాలయ్య మేనరిజం..
ఈ సినిమాలో బాలయ్య అఘోర పాత్రలో చేసిన నటన, ఆయన పవర్ ఫుల్ డైలాగ్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ వచ్చినా, నటన పరంగా బాలయ్యకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభించాయి. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్క్రీన్‌పై అందుబాటులోకి రావడంతో, థియేటర్లకు వెళ్లలేని వారు కూడా ఇంట్లోనే కూర్చుని ఈ మాస్ యాక్షన్ డ్రామాను ఆస్వాదిస్తున్నారు. “జై బాలయ్య” అనే ఒకే ఒక్క మాటతో నెట్‌ఫ్లిక్స్ తెలుగు రాష్ట్రాల్లోని నందమూరి అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఒక అంతర్జాతీయ ప్లాట్‌ఫామ్ ఒక ప్రాంతీయ హీరో పట్ల ఇంతటి గౌరవాన్ని చూపించడం బాలయ్య గ్లోబల్ క్రేజ్‌కు నిదర్శనం.
