DIY Cleaning Hacks: పాత వస్తువులే మీ క్లీనింగ్ వెపన్స్! చేతులు పాడవకుండా స్మార్ట్‌గా ఇల్లు సర్దేయండి ఇలా!
సంక్రాంతి పండుగకు సమయం దగ్గరపడుతోంది. పండుగ అనగానే పిండివంటలు, కొత్త బట్టలతో పాటు ఇంటిని శుభ్రం చేయడం అనేది ఒక పెద్ద టాస్క్. చాలామంది ఇంటిని శుభ్రం చేయడానికి మార్కెట్లో దొరికే ఖరీదైన కెమికల్స్ వాడుతుంటారు, కానీ మన ఇంట్లో ఉండే పాత సాక్సులు, బేకింగ్ సోడా మరియు నిమ్మరసంతోనే అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చని మీకు తెలుసా? శ్రమ తగ్గించుకుంటూ, ఇంటి మూలమూలలను మెరిసేలా చేసే కొన్ని స్మార్ట్ క్లీనింగ్ చిట్కాలను ఇప్పుడు చూద్దాం.

పండుగ రోజున ఇల్లు లక్ష్మీకళతో ఉట్టిపడాలంటే శుభ్రత చాలా ముఖ్యం. అయితే గంటల తరబడి కష్టపడకుండా, తక్కువ సమయంలో ఇంటిని ఎలా క్లీన్ చేయాలో ఈ కథనం మీకు వివరిస్తుంది. పాత చీపురును మాప్‌గా మార్చడం నుండి, వంటింటి టైల్స్‌ను మెరిపించే హోమ్ మేడ్ లిక్విడ్ తయారీ వరకు.. పొంగల్ క్లీనింగ్ కోసం ఎనిమిది వినూత్నమైన ఐడియాలు మీ కోసం ఇక్కడ ఉన్నాయి. ఈ చిట్కాలతో మీ ఇల్లు కొత్త పెళ్లికూతురులా మెరిసిపోవడం ఖాయం!
సాక్సులతో ఫ్యాన్ క్లీనింగ్: ఫ్లెక్సిబుల్ చీపురు చివర పాత సాక్సును కట్టి, అందులో కొంచెం బేకింగ్ సోడా వేసి ఫ్యాన్ రెక్కలను తుడవండి. దుమ్ము కింద పడకుండా సాక్సుకే అంటుకుంటుంది.
అలెర్జీల నుండి రక్షణ: కొంతమందికి క్లీనింగ్ చేసేటప్పుడు చేతులకు బొబ్బలు వస్తాయి. అరచేతికి సాక్స్ వేసుకుని రబ్బరు బ్యాండ్ కట్టుకోవడం వల్ల దుమ్ము, కెమికల్స్ నుండి రక్షణ పొందవచ్చు.
టైల్స్ కోసం స్పాంజ్ ట్రిక్: మీడియం సైజు స్పాంజ్ మధ్యలో చిన్న గీత గీసి, అందులో క్లీనింగ్ పౌడర్ వేసి నీటిలో ముంచి టైల్స్ తుడవండి. మొండి మరకలు కూడా సులభంగా వదులుతాయి.
టూత్ బ్రష్‌తో తలుపుల క్లీనింగ్: తలుపుల మూలల్లో ఉండే సన్నటి మురికిని వదిలించడానికి పాత టూత్ బ్రష్ ఉత్తమంగా పనిచేస్తుంది.
DIY హోమ్ మేడ్ క్లీనర్: ఒక గిన్నె నీటిలో అర కప్పు నిమ్మరసం, 2 స్పూన్ల డిష్ వాష్ లిక్విడ్, 1 స్పూన్ బేకింగ్ సోడా కలపండి. దీనికి వెనిగర్ కలిపితే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది.
సాలెపురుగుల నివారణ: గోడల మూలల్లో బేకింగ్ సోడా కలిపిన నీటితో తుడవడం వల్ల సాలెపురుగులు మళ్లీ రాకుండా ఉంటాయి.
పాత చీపురుతో మాప్ స్టిక్: మీ దగ్గర మాప్ స్టిక్ లేకపోతే, పాత చీపురు పిడిని పొడవైన కర్రకు స్క్రూ చేసి ఎత్తైన ప్రాంతాలను శుభ్రం చేయడానికి వాడుకోవచ్చు.
తలుపుల మెరుపు: సబ్బు నీటితో తుడిచిన తర్వాత, తడి గుడ్డపై కొంచెం డెటాల్ వేసి తుడవండి. దీనివల్ల తలుపులు మెరవడమే కాకుండా క్రిములు కూడా నశిస్తాయి.
