Parenting Tips: పిల్లలు మీ మాట వినట్లేదా..? అయితే ఇలా చేసి చూడండి..!
ప్రస్తుత రోజుల్లో పిల్లలతో సంబంధాలను మెరుగుపర్చడం తల్లిదండ్రులకు ఓ సవాలుగా మారుతోంది. పిల్లలు మన మాటలను పట్టించుకోకుండా ప్రవర్తించినప్పుడు.. తల్లిదండ్రుల మనసులో నిరాశ, బాధ కలుగుతుంది. కానీ పిల్లల మానసిక పరిస్థితిని అర్థం చేసుకుంటూ.. కొన్ని సరళమైన మార్గాలను అనుసరిస్తే వారు మన మాటలను స్వీకరించటం సులభమవుతుంది.

పిల్లలు ఏదైనా చిన్న మంచి పని చేసినా వెంటనే మెచ్చుకోవడం చాలా అవసరం. చాలా బాగా చేశావ్, మేము గర్వపడేలా చేశావ్ అంటూ వారిని అభినందించడం వల్ల వారు మరింత ఉత్సాహంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇలా చేయడం వల్ల వారు మనం చెప్పే విషయాల పట్ల విశ్వాసంతో స్పందిస్తారు.
పిల్లలతో ఎప్పుడూ మృదువుగా, ప్రేమతో మాట్లాడాలి. కోపంగా, గట్టిగా మాట్లాడితే వారు మన మాటలను పట్టించుకోరు. కానీ సున్నితంగా, గౌరవంగా మాట్లాడితే వారు మనతో ఓపికగా మెలగడం మొదలుపెడతారు. వారిలో భయాన్ని కాకుండా నమ్మకాన్ని కలిగించాలి.
ఇది చెయ్యాల్సిందే, అది వద్దు అని హుకుం జారీ చేసే బదులు.. ఇలా చేస్తే బాగా ఉంటుంది కదా..? అని అడగండి. ఇలా సూచనలుగా చెబితే పిల్లలు ఒత్తిడికి గురికాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను పొందుతారు.
మీరు చెప్పే సూచనలు వారికి అర్థమయ్యేలా ఉండాలి. క్లిష్టమైన పదాలు వాడకుండా సింపుల్‌గా ఒకేసారి ఒకటి చెప్పండి. ఉదాహరణకి వర్షం పడుతుంది కాబట్టి దుప్పటి వేసుకో అని చెప్పే బదులు.. బయట చలిగా ఉంది జాకెట్ వేసుకుంటే బాగుంటుంది అని నెమ్మదిగా చెప్పడం చాలా మంచిది.
పిల్లలు తల్లిదండ్రుల్ని గమనిస్తూ పెరుగుతారు. మీరు ఎలా ప్రవర్తిస్తారో వారు కూడా అలాగే ప్రవర్తించేందుకు ప్రయత్నిస్తారు. మీరు చెప్పే విషయాలు మీరు స్వయంగా అనుసరిస్తే వారు మీ మాటను గౌరవంగా తీసుకుంటారు.
పిల్లలకు ఏం చేయాలో ముందే స్పష్టంగా చెప్పాలి. ఉదాహరణకి టీవీ చూడొచ్చు కానీ 30 నిమిషాలకే ఆపు అని ముందే చెప్పడం వల్ల వారు మీ అంచనాలపై స్పష్టత పొందుతారు.
పిల్లలు తప్పు చేస్తే వెంటనే శిక్షించడం కాదు ఆ తప్పులోని ప్రభావాలను వారికి అర్థమయ్యేలా చెప్పండి. ఇలా చేస్తే నువ్వు నష్టపోతావు అని వివరించండి. ఇలా చెప్పడం వల్ల వారు సమస్య ఏంటో తామే అర్థం చేసుకునేలా మారతారు.
పిల్లలతో మాట్లాడేటప్పుడు ఫోన్స్ పక్కన పెట్టండి. వారి కళ్లలోకి చూసి మాట్లాడండి. మీరు వారిని పూర్తిగా గమనిస్తున్నారని వారికి అనిపిస్తే వారు కూడా మీ మాటలకు ప్రాధాన్యత ఇస్తారు.
మీరు చెప్పిన మాటను వారు వెంటనే వినకపోతే కేకలు వేయకూడదు లేదా ఇతర విషయాలతో కలిపి మాట్లాడకూడదు. మీ మాట ఎంత ముఖ్యమో వారు అర్థం చేసుకునే వరకు ఓపికగా ఉండాలి. అప్పుడు వాళ్లు మన మాటను ఆలకించేందుకు సిద్ధంగా ఉంటారు.
ఇవి ప్రతి తల్లిదండ్రులు పాటిస్తే పిల్లలతో బంధం బలపడుతుంది. ప్రేమతో, శ్రద్ధతో, సహనంతో మాటల్ని చెప్పడం వల్ల పిల్లలు మన మాటలను వినడమే కాకుండా.. మనపై నమ్మకంతో మెలుగుతారు. తల్లిదండ్రుల ప్రేమపూరిత సంభాషణే పిల్లల మనసుపై మంచి ప్రభావం చూపుతుంది.