Rainy Season: వాన ముసురుకు బట్టలు ఆరట్లేదా?.. దుర్వాసన రాకుండా ఇలా చేయండి!
వర్షాకాలం మొదలైతే బట్టలు ఆరబెట్టడం ఒక సవాలుగా మారుతుంది. ఎంత బాగా పిండినా, వాతావరణంలోని తేమ కారణంగా దుస్తులు త్వరగా ఆరవు. పూర్తిగా ఆరనప్పుడు వాటిని బీరువాలో పెడితే ఒక రకమైన చెడు వాసన వస్తుంటుంది. ఈ సమస్యలను నివారించడంతో పాటు, మీ దుస్తులు వేగంగా ఆరడానికి నిపుణులు కొన్ని చక్కటి చిట్కాలను అందిస్తున్నారు. అవేంటో చూద్దాం..

బయట చిరుజల్లులు పడుతున్నప్పుడు, ఇంట్లో గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే చోట డ్రైయింగ్ ర్యాక్‌లు లేదా క్లాత్ లైన్‌లు ఏర్పాటు చేసుకోండి. దుకాణాలలో, ఆన్‌లైన్‌లో ఇవి సులభంగా లభిస్తాయి. బట్టలను ఆరేసేటప్పుడు దగ్గరగా కాకుండా, వాటి మధ్య తగినంత ఖాళీ ఉండేలా చూసుకోండి. ఇది గాలి ప్రసరణను పెంచి, బట్టలు త్వరగా ఆరడానికి తోడ్పడుతుంది.
ఫ్యాన్ ఉపయోగించండి: తడిగా ఉన్న దుస్తులను ఫ్యాన్ కింద ఆరేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీంతో పాటు, వీలైనంతవరకు కిటికీలు, తలుపులు తెరిచి ఉంచండి. బయటి గాలి ఇంట్లోకి వచ్చి, బట్టలు వేగంగా ఆరడానికి సహాయపడుతుంది.
ఒకేసారి ఎక్కువ వద్దు: వర్షాకాలంలో వీలైనంత వరకు బట్టలను ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఉతకకుండా ఉండటం మంచిది. అలాగే, కాటన్, పాలిస్టర్, మందంగా లేదా పల్చగా ఉండే బట్టలను వేర్వేరుగా ఉతకండి. ఇలా చేయడం వల్ల ఒకటి ఆరి, మరొకటి తడిగా ఉండే సమస్య తప్పుతుంది, దుర్వాసన కూడా రాదు. కొన్ని దుస్తులు ఆరిన తర్వాత మిగిలినవి ఉతకడం ద్వారా వేగంగా ఆరతాయి.
హెయిర్ డ్రైయర్ లేదా డీహ్యుమిడిఫైయర్: వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నప్పుడు లేదా భారీ వర్షాలున్నప్పుడు ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. దుస్తులను వాష్ చేసి, బాగా పిండిన తర్వాత హెయిర్ డ్రైయర్ లేదా డీహ్యుమిడిఫైయర్ సహాయంతో ఆరబెట్టండి. పరిశోధనలు కూడా హెయిర్ డ్రైయర్‌లు తడి దుస్తులను ఆరబెట్టడంలో సమర్థవంతంగా పనిచేస్తాయని ధృవీకరించాయి.
దుస్తులకు మంచి వాసన కోసం చిట్కాలు
వెనిగర్ వాడకం: వాషింగ్ మెషీన్‌లో బట్టలు ఉతికే ముందు డిటర్జెంట్‌తో పాటు ఒక కప్పు వెనిగర్‌ను కలపండి. చేత్తో ఉతుకుతున్నట్లయితే, డిటర్జెంట్‌తో పాటు కొద్దిగా వెనిగర్‌ను నీటిలో కలుపుకోవచ్చు. ఇది దుర్వాసనను తగ్గిస్తుంది.
నిమ్మరసం: బట్టలను నానబెట్టిన నీటిలో కొద్దిగా నిమ్మరసం పిండి, ఆ తర్వాత ఉతికి ఆరబెట్టుకుంటే దుస్తుల నుండి దుర్వాసన రాదు.
ఎసెన్షియల్ ఆయిల్స్: లావెండర్, టీ ట్రీ, యూకలిప్టస్ వంటి మీకు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్స్ లో కొన్ని చుక్కలను వాషింగ్ మెషీన్‌లో కలపండి. లేదా, ఒక స్ప్రే బాటిల్‌లో కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్‌ను నీటితో కలిపి, బట్టలు ఆరబెట్టే ముందు వాటిపై తేలికగా స్ప్రే చేస్తే దుస్తులు తాజాగా, మంచి వాసనతో ఉంటాయి.