Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Motivational Story: ఈ కథ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ఇలా ఆలోచిస్తే విజయం మీదే..!

జీవితంలో ఒక చిన్న సంఘటన లేదా కథ కూడా మన ఆలోచనలను పూర్తిగా మార్చేస్తుంది. అలాంటి గొప్ప మార్పు ను తీసుకురాగల కథే ఇది. ఇది చదివిన తర్వాత మీలో కొత్త ప్రేరణ కలుగుతుంది. మనలో చాలా మందికి చిన్న కష్టాలు పెద్ద సమస్యలుగా అనిపిస్తుంటాయి. అలాంటి సమయంలో మనం వాటి నుండి తప్పించుకోవాలని అనుకుంటాం. కానీ నిజమైన విజయానికి ఆ కష్టాలే మొదటి అడుగులు. ఈ కథ చదివిన తర్వాత మీరు కష్టాలను తప్పించుకోవడం కాదు.. వాటిని గెలవడం ఎలాగో నేర్చుకుంటారు.

Motivational Story: ఈ కథ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ఇలా ఆలోచిస్తే విజయం మీదే..!
Inspirational Story
Prashanthi V
|

Updated on: Jun 17, 2025 | 7:28 PM

Share

ఒకరోజు ఒక శిల్పి అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు అతనికి చాలా అందమైన, ఎక్కడా మచ్చ లేని ఒక రాయి కనిపించింది. ఆ రాయిని చూసి అతనికి ఒక వినాయకుడి విగ్రహం చెక్కాలని ఆలోచన వచ్చింది. వెంటనే తన పనిముట్లు తీసుకుని పని మొదలుపెట్టబోతే ఆ రాయి మాట్లాడింది.

దయచేసి నన్ను గాయపరచకండి. మీకు అవసరం అయితే వేరే రాయిని వెతకండి. నేను మీ దెబ్బలను తట్టుకోలేను అని అది కోరింది. ఆ మాటలు విన్న శిల్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అతనికి ఇంకో రాయి కనిపించింది. ఈసారి అతను అదే పనిముట్టుతో ఆ రాయిని చెక్కడం మొదలుపెట్టాడు. ఆ రాయికి నొప్పి కలిగింది కానీ అది ఆ బాధను ఓర్పుగా భరించింది. కొన్ని గంటల తర్వాత శిల్పి ఆ రాయిని ఒక అందమైన వినాయక విగ్రహంగా మార్చాడు.

ఆ తర్వాత ఆ విగ్రహాన్ని ఒక గ్రామానికి తీసుకెళ్లి గుడిలో పెట్టారు. గ్రామస్థులు ప్రతి రోజు ఆ విగ్రహానికి పూజలు చేయడం మొదలుపెట్టారు. సాధువులు, భక్తులు వచ్చి దండాలు పెడుతున్నారు. కొబ్బరికాయ కొట్టి వినాయకునికి అర్పిస్తున్నారు.

కానీ కొబ్బరి కొట్టే శబ్దం వల్ల విగ్రహానికి దెబ్బలు తగలకుండా ఉండేందుకు ఒక గుండ్రటి రాయిని వినాయక విగ్రహం ముందు పెట్టారు. అది మొదట శిల్పి వెనక్కి తిరిగి వెళ్లిపోయిన రాయే. ఇప్పుడు ప్రతిరోజూ వందల కొబ్బరికాయల దెబ్బలు ఆ రాయిపై పడుతున్నాయి.

ఆ సమయంలో ఆ రాయి మౌనంగా ఇలా అనుకుంది. ఒక రోజు నేను ఓర్పుతో ఉండి ఉంటే.. ఈ నిస్సారమైన బాధలను ఇప్పుడు అనుభవించాల్సిన అవసరం ఉండేది కాదు.

ఇలాంటి పరిస్థితి మనలో చాలా మందికి ఎదురవుతుంది. చిన్న సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనే ధైర్యం చూపకుండా వాటి నుంచి తప్పించుకోవాలని చూస్తుంటాం. కానీ ఆ కష్టాలే మనిషిని మానవుడిగా మారుస్తాయి.

ఒకవేళ మీరు ఇప్పుడు కష్టాలను ఓర్పుగా భరించగలిగితే.. భవిష్యత్తులో అందరూ మెచ్చుకునే స్థాయిలో ఎదగవచ్చు. ఈ కథలోని రెండో రాయి లాగే జీవితాంతం గౌరవాన్ని పొందే అవకాశం మీకు కూడా ఉంటుంది.

ఒక్కసారి శ్రమను తట్టుకుని ముందుకు సాగిన వారే జీవితంలో గొప్ప స్థానాన్ని సంపాదిస్తారు. కష్టాన్ని తప్పించుకోవడం కాదు.. దానిని ఎదుర్కొనే తత్వమే మనల్ని గెలిపిస్తుంది. మీరు కూడా అలాంటి ధైర్యాన్ని కలిగి ఉండాలంటే.. ఈ కథను గుర్తుపెట్టుకోండి.