AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓవెన్‌ అవసరం లేదు.. కేవలం 15 నిమిషాల్లో టేస్టీ మిల్క్‌ క్యారమెల్‌ పుడ్డింగ్‌! ఇలా చేస్తే అదిరిపోద్ది

స్వీట్‌ తినాలనిపించినప్పుడు ఇంట్లోనే సింపుల్‌గా మిల్క్‌ క్యారమెల్‌ పుడ్డింగ్‌ తయారు చేసుకోవచ్చు. పాలు, గుడ్లు, పంచదారతో చేసే ఈ డెజర్ట్‌కు ఓవెన్‌ కూడా అవసరం లేదు. క్యారమెల్‌ తయారు చేసి పాలలో కలిపి, గుడ్ల మిశ్రమంతో కలిపి ఆవిరితో ఉడికిస్తే చాలు. ఫ్రిజ్‌లో రెండు గంటలు ఉంచిన తర్వాత క్రీమీగా, రుచికరమైన పుడ్డింగ్‌ సిద్ధమవుతుంది..

ఓవెన్‌ అవసరం లేదు.. కేవలం 15 నిమిషాల్లో టేస్టీ మిల్క్‌ క్యారమెల్‌ పుడ్డింగ్‌! ఇలా చేస్తే అదిరిపోద్ది
Milk Caramel Pudding
Srilakshmi C
|

Updated on: Oct 06, 2026 | 1:08 PM

Share

స్వీట్‌ తినాలనిపించినప్పుడు పెద్దగా శ్రమపడకుండా ఇంట్లోనే రుచికరమైన డెజర్ట్‌ తయారు చేసుకోవచ్చు. పాలు, గుడ్లు, పంచదార ఉంటే చాలు.. మిల్క్ క్యారమెల్ పుడ్డింగ్‌ సిద్ధం చేసుకోవచ్చు. క్యారమెల్‌ రుచి, పాల క్రీమీనెస్‌తో ఉండే ఈ పుడ్డింగ్‌ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది.

కావాల్సిన పదార్థాలు

  • పాలు – ½ లీటర్‌ (సుమారు 2 కప్పులు)
  • గుడ్లు – 2
  • పంచదార – 100 గ్రాములు
  • వెనీలా ఎసెన్స్‌ – ¼ టీ స్పూన్‌
  • డ్రై ఫ్రూట్స్‌ – అవసరాన్ని బట్టి

ముందుగా క్యారమెల్‌ తయారీకి గ్యాస్‌పై కడాయి పెట్టి 100 గ్రాముల పంచదార వేయాలి. మీడియం ఫ్లేమ్‌లో పంచదారను కదపకుండా ఉంచితే క్రమంగా కరగడం ప్రారంభమవుతుంది. పంచదార పూర్తిగా కరిగి మంచి గోల్డెన్‌ కలర్‌లోకి వచ్చినప్పుడు క్యారమెల్‌ సిద్ధమైనట్టే. అయితే పంచదారను మరీ ఎక్కువసేపు వేడి చేయకూడదు. రంగు మరీ ముదురితే కాలిన వాసన వచ్చి పుడ్డింగ్‌ చేదుగా మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు గ్యాస్‌ను లో ఫ్లేమ్‌లో పెట్టి ముందుగా మరిగించి చల్లార్చుకున్న ½ లీటర్‌ పాలను నెమ్మదిగా క్యారమెల్‌లో పోయాలి. పాలు పోసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మొత్తం పాలు వేసిన తర్వాత బాగా కలుపుతూ ఉంటే క్యారమెల్‌ పూర్తిగా కరిగి పాలలో కలిసిపోతుంది. క్యారమెల్‌ పూర్తిగా కరిగిన తర్వాత గ్యాస్‌ ఆఫ్‌ చేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.

మరో గిన్నెలో రెండు గుడ్లు తీసుకుని బాగా బీట్‌ చేయాలి. గుడ్డు వాసన రాకుండా ¼ టీ స్పూన్‌ వెనీలా ఎసెన్స్‌ కలపాలి. వెనీలా ఎసెన్స్‌ లేకపోతే కొద్దిగా యాలకుల పొడి కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు చల్లారిన క్యారమెల్‌ పాలను గుడ్ల మిశ్రమంలో పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒకసారి వడగట్టుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల గుడ్డు పూర్తిగా కలవకుండా మిగిలిన భాగాలు తొలగిపోతాయి. పుడ్డింగ్‌ మరింత స్మూత్‌గా వస్తుంది. తయారైన మిశ్రమాన్ని చిన్న చిన్న కప్పుల్లో పోయాలి. ఆవిరి సమయంలో నీటి బిందువులు పుడ్డింగ్‌పై పడకుండా ప్రతి కప్పును సిల్వర్‌ ఫాయిల్‌తో కప్పాలి. తర్వాత వెడల్పాటి గిన్నెలో ఈ కప్పులను అమర్చి, అందులో వేడి నీటిని పోయాలి. నీటి మట్టం కప్పుల సగం వరకు ఉండేలా చూసుకోవచ్చు. గిన్నెకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌పై సుమారు 15 నిమిషాలు ఆవిరితో ఉడికించాలి. పుడ్డింగ్‌ ఉడికిందో లేదో తెలుసుకోవడానికి టూత్‌పిక్‌తో మధ్యలో గుచ్చి చూడాలి. టూత్‌పిక్‌కు మిశ్రమం అంటుకోకుండా శుభ్రంగా బయటకు వస్తే పుడ్డింగ్‌ సిద్ధమైనట్టే.

ఇవి కూడా చదవండి

పుడ్డింగ్‌ ఉడికిన తర్వాత కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఫ్రిజ్‌లో కనీసం 2 గంటలు ఉంచాలి. చల్లబడిన తర్వాత పుడ్డింగ్‌ మరింత బాగా సెట్‌ అవుతుంది. ఫ్రిజ్‌ నుంచి తీసిన తర్వాత పైన డ్రై ఫ్రూట్స్‌ వేసుకోవచ్చు. మరింత క్యారమెల్‌ రుచి కావాలనుకుంటే ముందుగా తయారు చేసుకున్న క్యారమెల్‌ను కొద్దిగా పైన వేసుకుని తినొచ్చు. పాలు, గుడ్లు, పంచదారతో ఇంట్లోనే సింపుల్‌గా తయారు చేసుకునే ఈ మిల్క్‌ క్యారమెల్‌ పుడ్డింగ్‌ ప్రత్యేక సందర్భాల్లోనే కాదు.. ఎప్పుడైనా స్వీట్‌ తినాలనిపించినప్పుడు కూడా ప్రయత్నించవచ్చు. సరైన విధంగా క్యారమెల్‌ తయారు చేసి, మిశ్రమాన్ని వడగట్టి, ఆవిరితో ఉడికిస్తే సాఫ్ట్‌గా, క్రీమీగా ఉండే పుడ్డింగ్‌ సిద్ధమవుతుంది.

Follow Us