AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Survey: దేశంలో పెరిగిన ఊబకాయం.. అధిక బరువు సమస్య. కారణం అదేనా?

"భారతీయులు తెగ తినేస్తున్నారు" అంటూ అప్పట్లో అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రపంచవ్యాప్తంగా ఆహర పదార్థాల కొరత ఏర్పడ్డ నేపథ్యంలో భారత్, చైనా దేశాలు అత్యధికంగా ఆహారపదార్థాలను వినియోగిస్తున్నాయని ఆయన చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తమైంది. అయితే ఈ మాట ఇప్పుడు అన్వయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవును.. భారతదేశంలో ఊబకాయం పెరిగిపోతోంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే(NFHS-5)లో గణాంకాలు చూస్తే మతిపోతుంది.

Health Survey: దేశంలో పెరిగిన ఊబకాయం.. అధిక బరువు సమస్య. కారణం అదేనా?
India
Mahatma Kodiyar
| Edited By: Srikar T|

Updated on: Jul 22, 2024 | 2:28 PM

Share

“భారతీయులు తెగ తినేస్తున్నారు” అంటూ అప్పట్లో అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రపంచవ్యాప్తంగా ఆహర పదార్థాల కొరత ఏర్పడ్డ నేపథ్యంలో భారత్, చైనా దేశాలు అత్యధికంగా ఆహారపదార్థాలను వినియోగిస్తున్నాయని ఆయన చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తమైంది. అయితే ఈ మాట ఇప్పుడు అన్వయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవును.. భారతదేశంలో ఊబకాయం పెరిగిపోతోంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే(NFHS-5)లో గణాంకాలు చూస్తే మతిపోతుంది. 2019-2021 మధ్యకాలంలో నిర్వహించిన ఈ సర్వే ఫలితాలపై కేంద్ర ఆర్థిక శాఖ ప్రవేశపెట్టిన 2023-24 ఆర్థిక సర్వే నివేదికలో ప్రస్తావించింది. భారతీయుల్లో ఊబకాయం ఎంత మేర పెరిగిందో గణాంకాలతో సహా వివరిస్తూ.. అందుకు దారితీసిన పరిస్థితుల గురించి కూడా నివేదికలో క్లుప్తంగా విశ్లేషించింది. భారతీయుల్లో మహిళలు, పురుషుల్లో ప్రతి 10 మందిలో ఇద్దరు నుంచి ముగ్గురు వరకు అధిక బరువు, ఊబకాయం సమస్యలతో బాధపడుతున్నట్టు సర్వే గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశ జనాభాలో 18-69 ఏళ్ల వయస్సు మధ్య గల స్త్రీ, పురుషులపై ఈ సర్వే నిర్వహించింది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే(NFHS-4) నాటి గణాంకాలతో NFHS-5 గణాంకాలను పోల్చి చూస్తూ డేటా విడుదల చేసింది.

రాజధాని నెంబర్ 1..

నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే(NFHS-5) ప్రకారం సగటున దేశంలో 22.9 శాతం మగాళ్లు స్థూలకాయంతో బాధపడుతుండగా.. 24% మంది మహిళలు ఊబకాయంతో ఉన్నారు. పురుషుల్లో ఊబకాయం గతంలో 18.9 శాతం ఉండగా.. అది ఇప్పుడు 4% పెరిగి, 22.9 శాతానికి చేరుకుంది. మహిళల్లోనూ స్థూలకాయం 20.6% నుంచి 24%కు పెరిగింది. దాదాపు స్త్రీ, పురుషులిద్దరిలో 4% మేర ఊబకాయం సమస్య పెరిగిందని ఈ గణాంకాలను బట్టి అర్థమవుతోంది. స్థూలకాయం సమస్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానంలో తమిళనాడు ఉంది. ఢిల్లీలో మహిళల్లో ఒబేసిటీ 41.3 శాతం, పురుషుల్లో 38 శాతం ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. తమిళనాడులో 37 శాతం పురుషులు, 40.4 శాతం మహిళల్లో స్థూలకాయం ఉంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో స్థూలకాయంతో బాధపడుతున్నవారిలో మహిళలు 36.3 శాతం మంది ఉండగా.. పురుషులు 31.1 శాతం ఉన్నారు. తెలంగాణలో స్థూలకాయంతో బాధపడుతున్నవారిలో మహిళలు 30.1 శాతం ఉండగా.. పురుషులు 32.3 శాతం మంది ఉన్నారు. ఏపీలో పురుషుల కంటే మహిళల్లో ఎక్కువ ఊబకాయం సమస్య ఉంటే, తెలంగాణలో అందుకు భిన్నంగా పురుషుల్లో ఊబకాయం సమస్య ఎక్కువగా ఉంది.

దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఒబేసిటీ ఎక్కువగా పెరిగినట్టు సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పెరుగుతున్న వృద్ధుల జనాభాతో పాటు ఒబేసిటీ ఆందోళన కల్గిస్తోంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే(NFHS-5) జరిపిన సమయం (2019-2021)లో కోవిడ్-19 మహమ్మారి విస్తృతి, లాక్‌డౌన్ కారణంగా ప్రజల్లో శారీరక శ్రమ లేకపోవడం లేదా పరిమితం కావడం కూడా ఒబేసిటీకి కారణమైనట్టు నివేదిక పేర్కొంది. అందుకే NFHS-4 తో పోల్చితే NFHS-5లో ఒబేసిటీ పెరుగుదల ఎక్కువగా ఉందని ప్రభుత్వం అంచనా వేసింది. తదుపరి జరపబోయే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-6లో ఒబేసిటీ ట్రెండ్ తిరోగమనంలో ఉంటే అది ఆరోగ్యకర సంకేతంగా భావించవచ్చు. లేదంటే.. ప్రజలు తమ ఆహారపు అలవాట్లు, జీవనశైలి విషయంలో దృష్టి పెట్టక తప్పదు.

మరిన్ని లైఫ్ స్టైల్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..