AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Motion sickness: మీకూ జర్నీ టైంలో వికారం, వాంతులు అవుతున్నాయా? ఇలా ఎందుకు జరుగుతుందంటే

How to avoid motion sickness During travelling? చాలా మందికి కారులో, బస్సులో ప్రయాణించేటప్పుడు వికారం కలుగుతుంది. మనం సాధారణంగా దీనిని మోషన్ సిక్‌నెస్ అని పిలుస్తాం. ముఖ్యంగా ఎక్కువసేపు ప్రయాణించేటప్పుడు, జనసమూహంలో ఉన్నప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది. తలతిరగడం, వికారం, అసౌకర్యం, అధిక చెమట - ఇవి లక్షణాలు. అయితే కొన్ని సాధారణ పద్ధతుల ద్వారా ఈ సమస్యను నియంత్రించవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకోవచ్చు..

Motion sickness: మీకూ జర్నీ టైంలో వికారం, వాంతులు అవుతున్నాయా? ఇలా ఎందుకు జరుగుతుందంటే
Motion Sickness
Srilakshmi C
|

Updated on: Sep 30, 2025 | 1:16 PM

Share

కారు ముందు లేదా కిటికీ దగ్గర కూర్చోవడం వల్ల వికారం వచ్చే అవకాశం చాలా తక్కువ. వెనుక లేదా కిటికీ లేని ప్రదేశంలో కూర్చోవడం వల్ల గాలి ప్రవాహం తక్కువగా ఉండటం వల్ల అసౌకర్యం పెరుగుతుంది. ముందు సీట్లో కూర్చోవడం వల్ల రోడ్డును చూడటానికి వీలు కల్పిస్తుంది. మెదడు-కంటి సమన్వయానికి ఇది సహాయపడుతుంది. తల తిరగడాన్ని తగ్గిస్తుంది. రద్దీగా ఉండే కారులో ఎక్కువ కుదుపులు ఉన్నప్పుడు కూడా తల తిరగడం మొదలవుతుంది. కాబట్టి తల నిటారుగా, స్థిరంగా ఉంచడానికి ప్రయత్నించాలి. కారు హెడ్‌రెస్ట్‌ను ఉపయోగించవచ్చు. మీకు కావాలంటే మెడ, తలకు మధ్య చిన్న దిండు ఉపయోగించుకోవచ్చు.

ఆక్సిజన్ లేకపోవడం, బలమైన వాసన వాంతికి కారణమవుతుంది. కాబట్టి వీలైతే కిటికీ తెరిచి ఉంచి, కిటికీ వద్ద కూర్చోవడం మంచిది. కారులో ఎయిర్ కండిషనింగ్ ఉంటే ఇంకా మంచిది. ఇది శ్వాసను సులభతరం చేస్తుంది. వికారం చాలా వరకు తగ్గుతుంది. ఖాళీ కడుపుతో ప్రయాణించడం వల్ల వాంతులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఎక్కువగా తినడం వల్ల కూడా సమస్యలు వస్తాయి. ప్రయాణానికి ముందు టోస్ట్, బిస్కెట్లు, అరటిపండ్లు వంటి తేలికైన, సులభంగా జీర్ణమయ్యే ఆహారాలు తినవచ్చు. వేయించిన, కారంగా ఉండే భారీ ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది.

ప్రయాణిస్తున్నప్పుడు పుష్కలంగా నీళ్లు తాగాలి. కానీ ఒకేసారి ఎక్కువగా తాగకూడదు. కావాలంటే నిమ్మకాయ నీరు, అల్లం టీ, పుదీనా ఆకుల రసం జర్నీ టైంలో తీసుకోవచ్చు. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. వికారం తగ్గిస్తాయి. అల్లం మిఠాయి తీసుకున్నా ప్రయోజనకరంగా ఉంటుంది. పుస్తకాలు చదవడం, మొబైల్ ఫోన్ చూడటం, కదులుతున్న కారులో ఎక్కువగా ముందుకు వెనుకకు చూడటం వల్ల కళ్ళు, చెవుల సమతుల్యత దెబ్బతింటుంది. ఇది వికారాన్ని పెంచుతుంది. ప్రయాణిస్తున్నప్పుడు క్రమం తప్పకుండా వికారం అనుభవించేవారు వైద్యుడి సలహా మేరకు యాంటీ-మోషన్ సిక్‌నెస్ మాత్రలు (డోంపెరిడోన్ లేదా సిన్‌రెలీఫ్ వంటివి) తీసుకోవచ్చు. రద్దీగా ఉండే ప్రదేశాలలో అసౌకర్య సమయాల్లో పొడి టిష్యూలు, పాలీబ్యాగులు, మింట్‌లను మీతో ఉంచుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.