Health Tips: ఈ టైమ్‌లో నిద్రపోతే ఏమవుతుందో తెలుసా..? అర్ధరాత్రి చాటింగ్ ఆపకపోతే అంతే సంగతులు..
ఇప్పటివరకు మనం ఎన్ని గంటలు నిద్రపోతామో దాని ఆధారంగానే మన ఆరోగ్యం ప్రభావితమవుతుందని అనుకున్నాం.. అయితే కొత్త పరిశోధన ప్రకారం మీరు నిద్రపోయే సమయం మీ గుండెను కూడా ప్రభావితం చేస్తుందని తేలింది. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి నిద్రించే ఉత్తమ సమయం ఏంటో ఈ పరిశోధన వెల్లడించింది.

మీకు ఆలస్యంగా నిద్రపోయి, అర్ధరాత్రి తర్వాత మేల్కొనే అలవాటు ఉంటే మీరు వెంటనే దాన్ని మానుకోవాలి. ఎందుకంటే ఈ అలవాటు గుండెపోటు, స్ట్రోక్ వంటి తీవ్రమైన గుండె సమస్యలకు దారితీస్తుందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ఇటీవల ప్రచురితమైన ఒక పరిశోధన ప్రకారం.. రాత్రి 10 నుండి 11 గంటల మధ్య నిద్రకు ఉపక్రమించే వారికి గుండెపోటు వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఈ సమయాన్ని నిద్రకు సంబంధించి “గోల్డెన్ అవర్” అని పరిశోధకులు పిలుస్తున్నారు.
నిద్రకు, గుండెకు సంబంధం ఏంటి?
గుండె ఆరోగ్యం గురించి మనం తరచుగా ఆహారం, వ్యాయామం గురించి మాట్లాడుకుంటాం. కానీ సరైన సమయంలో సరైన మొత్తంలో నిద్రపోవడం కూడా అంతే ముఖ్యం. ఆలస్యంగా మేల్కొనే వ్యక్తుల్లో శరీరం సహజ గడియారం అంటే సిర్కాడియన్ రిథమ్ దెబ్బతింటుంది. ఈ లయ హృదయ స్పందన రేటు, రక్తపోటు, హార్మోన్ల సమతుల్యతతో సహా మన శరీరంలోని దాదాపు ప్రతి పనితీరును నియంత్రిస్తుంది. ఈ రిథమ్ సక్రమంగా లేనప్పుడు అది గుండెపై, మెదడుపై ఒత్తిడిని పెంచుతుంది. తీవ్రమైన ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.
88 వేల మందిపై పరిశోధన..
పరిశోధకులు 43 నుండి 74 ఏళ్ల వయస్సు గల 88,000 మంది బ్రిటిష్ పౌరుల నిద్ర అలవాట్లను దాదాపు 5.7 సంవత్సరాల పాటు ట్రాకర్ పరికరాల ద్వారా విశ్లేషించారు. వారి పరిశోధనలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాత్రి 10:00 నుండి 10:59 గంటల మధ్య నిద్రపోయే వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం అతి తక్కువగా ఉంది. రాత్రి 11:00 నుండి 11:59 గంటల మధ్య నిద్రపోయే వారిలో ప్రమాదం 12శాతం పెరిగింది. అర్ధరాత్రి తర్వాత నిద్రపోయే వారిలో గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం 25శాతం వరకు ఎక్కువగా ఉంది. 10 గంటల కంటే ముందు పడుకునే వారిలో కూడా ప్రమాదం దాదాపు 24శాతం పెరిగింది.
మహిళలపై ఎక్కువ ప్రభావం
ఈ అధ్యయనంలో తెలిసిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఆలస్యంగా పడుకోవడం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువగా ఉన్నాయి. మహిళల హార్మోన్ల చక్రాలు నిద్ర దినచర్యలలో అంతరాయాలకు ఎక్కువ సున్నితంగా ఉండడమే దీనికి కారణమని నమ్ముతున్నారు.
మీ నిద్రను ‘హృదయానికి అనుకూలంగా’ ఎలా మార్చుకోవాలి?
ఆరోగ్యకరమైన గుండెకు నిద్రపోయే సమయం చాలా కీలకం. ఈ సాధారణ చర్యలను అనుసరించడం ద్వారా మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు:
గోల్డెన్ అవర్ లక్ష్యం: ప్రతి రాత్రి 10:00 నుండి 11:00 గంటల మధ్య పడుకోవడానికి లక్ష్యం పెట్టుకోండి.
డిజిటల్ డిటాక్స్: పడుకునే ముందు కనీసం 30-60 నిమిషాల ముందు మొబైల్ ఫోన్లు, టీవీలకు దూరంగా ఉండండి. వీటి నీలి కాంతి నిద్ర హార్మోన్ మెలటోనిన్ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది.
తేలికపాటి విందు: నిద్రవేళకు కనీసం 2-3 గంటల ముందు భోజనం పూర్తి చేయండి. ఆలస్యంగా తినడం జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది.
చల్లని వాతావరణం: మీ పడకగదిని నిశ్శబ్దంగా, చీకటిగా, చల్లగా ఉంచుకోవడం వల్ల సుఖవంతమైన నిద్ర లభిస్తుంది.
కెఫిన్ మానుకోండి: సాయంత్రం తర్వాత టీ, కాఫీ, ఎనర్జీ డ్రింక్స్, ధూమపానం పూర్తిగా మానుకోండి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




