TG Govt Jobs 2026: తెలంగాణ నిరుద్యోగులకు భలే న్యూస్.. త్వరలో 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్
రాష్ట్ర నిరుద్యోగులకు సర్కార్ మరో గుడ్‌న్యూస్ చెప్పింది. వైద్యారోగ్య శాఖలో త్వరలో మరో 10 వేల పోస్టులకు నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ మేరకు మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రకటించారు. తాజాగా హైదరాబాద్ కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్లకు ఉద్యోగ నియామకపత్రాలు..

హైదరాబాద్, జనవరి 16: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు సర్కార్ మరో గుడ్‌న్యూస్ చెప్పింది. వైద్యారోగ్య శాఖలో త్వరలో మరో 10 వేల పోస్టులకు నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ మేరకు మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రకటించారు. తాజాగా హైదరాబాద్ కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్లకు ఉద్యోగ నియామకపత్రాలు అందజేసే కార్యక్రమానికి మంత్రి దామోదర్ రాజనర్సింహ హాజరయ్యారు. ఈ సందర్భంగా దామోదర్ మాట్లాడుతూ.. ప్రజాప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే వైద్యారోగ్య శాఖలో 9,572 ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. మరో 7,267 ఉద్యోగాల నియామక ప్రక్రియ పురోగతిలో ఉందన్నారు. వీటితోపాటు త్వరలో 10 వేల పోస్టుల భర్తీకి సీఎం రేవంత్‌రెడ్డి అనుమతి ఇచ్చారని వెల్లడించారు.
2024 సెప్టెంబరు 11న 1,257 ఎల్‌టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా.. 2025 నవంబరు నాటికి భర్తీ ప్రక్రియ ముగిసింది. సంక్రాంతి కానుకగా ఎంపికైన వారందరికీ నియామక పత్రాలను అందించామన్నారు. ఈ సందర్భంగా వైద్య వ్యవస్థలో ల్యాబ్ టెక్నీషియన్ల పాత్రను మంత్రి కొనియాడారు. గతంలో రోగి లక్షణాలను బట్టి వైద్యం చేసేవారని, కానీ నేడు రోగ నిర్ధారణ తర్వాతే చికిత్స ప్రారంభిస్తున్నారని అన్నారు. ల్యాబ్ టెక్నీషియన్లు ఇచ్చే రిపోర్టులే డాక్టర్లకు ప్రామాణికం. వైద్య వ్యవస్థకు వీరు కళ్లు, చెవుల్లాంటి వారని చెప్పారు.
అంతేకాకుండా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలలకే వైద్య విద్యార్థుల హాస్టల్ వసతి కోసం రూ.200 కోట్లతో గాంధీ, ఉస్మానియాల్లో భవనాల నిర్మాణ పనులు ప్రారంభించినట్లు తెలిపారు. త్వరలో తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను ‘సెకండరీ హెల్త్ కేర్’గా మార్చబోతున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రుల పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని, నూతన హెల్త్ పాలసీని తీసుకురానున్నట్లు ప్రకటించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




