ఆరుగురు పతివ్రతలు చేశాక సినిమాలు ఆపేయడానికి కారణం ఇదే.. నిజాన్ని చెప్పిన సీరియల్ నటుడు
సీరియల్ నటుడు కౌశిక్ తన సినిమా కెరీర్ గురించి ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించాడు. అందం, ఆరుగురు పతివ్రతలు, శీను వాసంతి లక్ష్మి లాంటి సినిమాలు నిరాశపరచడంతోనే సినిమాలకు దూరమయ్యానని చెప్పాడు. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా.. ఓ సారి లుక్కేయండి.

సీరియల్ నటుడు కౌశిక్ తన సినిమాలు, బుల్లితెరపై తన కెరీర్ గురించి గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. సినిమాలు వదిలేసి బుల్లితెరకు రావడం వెనుక కారణం గురించి తెలిపాడు. 1990లలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నెంబర్ వన్, సాంప్రదాయం లాంటి చిత్రాలలో నటించిన కౌశిక్.. ఆ తర్వాత ఎం.ఎస్.రెడ్డి నిర్మాతగా 2000వ సంవత్సరంలో అందం అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా విడుదల కాకపోవడం అతడి సినీ కెరీర్‌కు పెద్ద బ్రేక్ పడేలా చేసింది. సినిమా ఆగిపోవడంతో ఇండస్ట్రీలో ఆగిపోయిన సినిమా హీరో అనే సెంటిమెంట్ ఎదురైందని.. పలువురు దర్శకులు ఆ తర్వాత తనతో సినిమా చేయడానికి వెనకాడారని తెలిపాడు. శబ్దాలయ థియేటర్ మీద దాదాపు మూడేళ్ల పాటు తన పోస్టర్ ఉండిపోయిందని తెలిపాడు.
ఇది చదవండి: ‘ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా తీశాడు..’
ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు ఈ.వి.వి. సత్యనారాయణ తనను గుర్తించి ఆరుగురు పతివ్రతలు సినిమాలో అవకాశం ఇచ్చారని కౌశిక్ తెలిపాడు. అయితే ఆ సినిమా కూడా విజయం సాధించలేదు. ఇదే సమయంలో ఆర్.పి. పట్నాయక్ శీను వాసంతి లక్ష్మి చిత్రంలో విలన్ పాత్ర ఇచ్చారు. ఈ సినిమా కూడా ఆడలేదు. వరుసగా రెండు సినిమాలు నిరాశపరచడంతో, సినిమా అవకాశాలు తగ్గిపోయి.. దానితో బుల్లితెర వైపునకు వచ్చేశానని తెలిపాడు. సుమారు 25 సంవత్సరాలుగా జీ, ఈటీవీ, జెమిని, స్టార్ మా లాంటి ఛానళ్లలో 45కు పైగా సీరియల్స్‌లో నటించి.. 18 వేల ఎపిసోడ్‌లకు పైగా పూర్తిచేశానన్నారు. టీవీ రంగంలో వరుస అవకాశాలతో తాను హ్యాపీగా ఉన్నానని పేర్కొన్నాడు.
సినిమా హిట్, ఫ్లాప్ అనేది దర్శకుడి చేతుల్లో ఉంటుందని, నటుల యాక్టింగ్‌పై ఎక్కువగా ఆధారపడి ఉండదని కౌశిక్ అభిప్రాయపడ్డాడు. ఉదాహరణగా రావు రమేష్ కెరీర్‌ను ప్రస్తావిస్తూ.. ఒక్కడున్నాడు, గమ్యం, కొత్త బంగారు లోకం లాంటి సినిమాల్లో మంచి పాత్రలు చేసినప్పటికీ, అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ మావయ్య పాత్ర తర్వాతే ఆయనకు పూర్తిస్థాయి గుర్తింపు వచ్చిందని తెలిపాడు. ప్రకాష్ రాజ్, రావు రమేష్ లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టుల మాదిరిగా తనకు కూడా అలాంటి గుర్తింపు పొందాలని ఇప్పటికీ అనుకుంటున్నట్టు కౌశిక్ చెప్పాడు.
సినిమా అవకాశాల కోసం దర్శకులను తిరిగి ఫాలో అప్ చేయడంలో తాను పూర్తిగా ఫెయిల్ అయ్యానని కౌశిక్ ఒప్పుకున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్, అనిల్ రావిపూడి లాంటి దర్శకులను కలుస్తుంటానని, వారు గౌరవంగా మాట్లాడతారని, అయితే తాను తిరిగి ఫాలో అప్ చేయలేదని చెప్పాడు. టీవీ సీరియల్స్ కోసం నెలకు 20 రోజులు బ్లాక్ అవుతాయని, సినిమాలకు ఎక్కువ డేట్స్ ఇవ్వడం కష్టమని, ఒకవేళ అవకాశం వచ్చినా.. దాన్ని కాదంటే దర్శకులను అవమానించినట్టు అవుతుందని భావించి ప్రయత్నించలేదని తెలిపాడు.
ఇది చదవండి: సామాన్య వ్యక్తిని కూడా కోటీశ్వరుడిని చేయొచ్చు..! ఇది తెలిస్తే శాలరీ లేకపోయినా హ్యాపీగా బ్రతికేయొచ్చు
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




