Monsoon Season: పాములను ఆకర్షించే మొక్కలు ఇవే.. ఇంటి ఆవరణలో ఉంటే ఈ సీజన్ లో జాగ్రత్త సుమా..
పట్టణాలు, పల్లెలు అనే తేడా లేదు ఎక్కడైనా సరే సహజ పచ్చదనం పర్యావరణానికి, ఆరోగ్యానికి, జీవవైవిధ్యానికి ఎంతో అవసరం. గాలిని శుద్ధి చేస్తుంది. నేల కోతని తగ్గిస్తుంది. వాతావరణాన్ని నియంత్రిస్తుంది. అంతేకాదు మన జీవితంలో శాంతిని తెస్తుంది. అయితే వర్షాకాలం వచ్చిందంటే పచ్చదనం అణువణువునా కనిపిస్తుంది. అయితే సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇంట్లో పెరిగే కొన్ని రకాల మొక్కలు, తోటలకు వీలైనంత దూరంగా ఉండాలి. లేదంటే ప్రాణాపాయం కలుగవచ్చు.

వర్షాకాలం పచ్చదనం, తాజాదనాన్ని తెస్తుంది. దీంతో పాటు పాముల ప్రమాదం పెరుగుతుంది. వర్షంలో నేల తడిసిపోతుంది, బొరియలు నీటితో నిండిపోతాయి. దీంతో పాములు బయటకు వచ్చి పొడి ప్రాంతాలను, వెచ్చని ప్రదేశాలను వెతుక్కుంటూ ఇళ్ల వైపుకి చేరుకుంటాయి. అయితే ప్రత్యేకంగా పాములను ఆకర్షించే కొన్ని చెట్లు , మొక్కలు ఉన్నాయని మీకు తెలుసా? వర్షాకాలంలో పాములు తరచుగా ఈ చెట్ల వేర్లు, పొదలు , బెరడులలో దాక్కుంటాయి లేదా విశ్రాంతి తీసుకుంటాయి. కనుక ఈ మొక్కలు ఇల్లు, పొలం, తోట లేదా ఆఫీసు ఆవరణలో ఉంటే జాగ్రత్తగా ఉండాలి. ఆ పాములకు నచ్చే చెట్లు ఏమిటంటే..
అరటి చెట్టు: అరటి మొక్క పాములకు అత్యంత ఇష్టమైన ప్రదేశం. అరటి చెట్టు తడిగా, నీడగా, మృదువుగా ఉంటుంది. దీనిని పాములు చాలా ఇష్టపడతాయి. వర్షాకాలంలో అరటి చెట్టు వేర్లు.. కాండం మధ్య స్థలం పాములు దాక్కోవడానికి అనువైనదిగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో ఇంటికి చాలా దగ్గరగా అరటి మొక్కలను నాటవద్దు. పాములు అరటి చెట్టు మొదల్లో చాలా సులభంగా దాక్కుంటాయి.
రావి, మర్రి చెట్లు: రావి, మర్రి చెట్లు నీడను అందిస్తాయి. అయితే పాముల నివాసానికి కూడా వీలుగా ఉండే చెట్లు. ప్రమాదానికి కూడా కారణమవుతాయి. ఈ రెండు చెట్లు వాటి మందపాటి కాండం, వైమానిక మూలాల కారణంగా పాములు దాక్కోవడానికి, ఎక్కడానికి చాలా అనుకూలంగా ఉంటాయి. వర్షాకాలంలో పాములు వెచ్చదనం, చీకటిని ఇష్టపడతాయి. కనుక వీటిని ఆశ్రయించే అవకాశం ఉంది. కనుక వర్షాకాలంలో ఈ చెట్ల దగ్గరికి వెళ్లకుండా ఉండండి. ఒకవేళ వెళ్ళినా జాగ్రత్తగా ఉండండి.
వెదురు పొదలు: వెదురు చెట్లు దట్టంగా ఉంటాయి. వాటి కింద నేల తేమగా ఉంటుంది. పాములు ఈ వాతావరణాన్ని బొరియలు చేయడానికి లేదా విశ్రాంతి తీసుకోవడానికి అనుకూలంగా భావిస్తాయి. కొన్నిసార్లు పాములు వెదురు బోలు భాగాలలో కూడా దాక్కుంటాయి. ఇది పాముకు బొరియ లేదా సొరంగం లాంటిది. కనుక పెరటి ఆవరణలో వెదురును నాటవద్దు. వర్షకాల సమయంలో పాములు వెదురు చెట్లలో దాక్కునే అవకాశం ఉంది.
తులసి దగ్గర పొదలు: తులసి మొక్కకి ఆధ్యాత్మికంగా విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఈ మొక్కని పవిత్రంగా భావిస్తారు. అయితే తులసి మొక్క చుట్టూ పొదలు లేదా గడ్డి పెరిగితే.. అవి పాములకు దాక్కునే ప్రదేశంగా మారతాయి. ముఖ్యంగా తులసి మొక్క దగ్గర కుండీలు లేదా పనికిరాని వస్తువులను ఉంచినప్పుడు.. పాములు చేరుకునే అవకాశం ఉంది. వర్షాకాలంలో తప్పని సరిగా తులసి మొక్క చుట్టూ పరిశుభ్రతను పాటించండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)








