Body Odor: మీ శరీరం నుండి దుర్వాసన వస్తుందా.. ఆ భయమే కారణం! ఇలా చేస్తే సమస్య దూరం
కొంతమందికి సాధారణం కంటే అధికంగా చెమట పడుతుంటుంది. దీనినే వైద్య పరిభాషలో హైపర్‌హైడ్రోసిస్ అంటారు. అధిక చెమటతో పాటు శరీరం నుండి వచ్చే దుర్వాసన (బాడీ ఓడర్) చాలామందిని ఇబ్బంది పెడుతుంది. దీనివల్ల నలుగురితో కలవడానికి మొహమాటపడాల్సి వస్తుంది. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది, దీనికి కారణాలు ఏమిటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడే ఎక్రిన్ గ్రంథులు చెమటను విడుదల చేస్తాయి. అయితే, ఈ గ్రంథులు అధికంగా పనిచేసినప్పుడు హైపర్‌హైడ్రోసిస్ సమస్య తలెత్తుతుంది. చంకలు, అరికాళ్లు, అరచేతులు, నుదురు, బుగ్గలు, నడుము కింది భాగాల్లో ఈ చెమట ఎక్కువగా కనిపిస్తుంది. ఇది దుస్తులు తడిగా, మురికిగా కనిపించేలా చేయడమే కాకుండా, చర్మంపై తేమ, దురద, చికాకును కలిగిస్తుంది.
అధిక చెమటకు గల కారణాలు:
మానసిక కారణాలు: తీవ్ర భయం, ఒత్తిడి, ఆందోళన వంటి భావోద్వేగాలు శరీరం నుంచి అధిక చెమటను ఉత్పత్తయ్యేలా చేస్తాయి. ముందు ఈ భయం, యాంగ్జైటీ వంటి సమస్యలుంటే వాటిని తగ్గించుకోవాలి.
ఆహారపు అలవాట్లు: కారం ఎక్కువగా ఉన్న పదార్థాలు తినడం మానేయడం వల్ల కూడా ఈ సమస్య తగ్గుముఖం పడుతుంది.
శారీరక శ్రమ: వ్యాయామం చేయడం, పరిగెత్తడం వంటివి రోజూ అలవాటు చేసుకోవాలి. లేకుంటే శరీరం దుర్వాసన వస్తుంటుంది.
అనారోగ్య సమస్యలు: అధిక కొవ్వు, రక్తపోటు తగ్గడం (బీపీ తక్కువ కావడం), రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉండటం.
వాతావరణం: అధిక వేడి, గాలి తగలని ప్రదేశాలు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఉండటం.
ఇతర కారణాలు: కొన్ని మందుల దుష్ప్రభావాలు, మందం గల దుస్తులు ధరించడం, వంట చేసే సమయంలో అధిక వేడి తగలడం. ఇది జన్యుపరంగా కూడా సంక్రమించవచ్చు.
ఎదురయ్యే సమస్యలు:
అధిక చెమట వల్ల చర్మం పొడిగా మారడం, పగుళ్లు రావడం వంటివి జరగవచ్చు. దీనివల్ల వైరస్‌లు, బ్యాక్టీరియాలు సులభంగా శరీరంలోకి ప్రవేశించి మొటిమలు లేదా ఇతర బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లకు దారితీస్తాయి. అలాగే, ముఖం నీరసంగా కనిపించవచ్చు.
నివారణ పద్ధతులు:
అధిక చెమట, దుర్వాసనను తగ్గించడానికి కొన్ని చిట్కాలను పాటించవచ్చు:
పరిశుభ్రత: రోజూ రెండు పూటలా స్నానం చేయాలి. యాంటీబ్యాక్టీరియల్ గుణాలున్న సబ్బులను వాడాలి.
దుస్తులు: తేలికపాటి, గాలి తగిలే దుస్తులు ధరించాలి. శుభ్రమైన దుస్తులు మాత్రమే వేసుకోవాలి.
పరిసరాలు: వేడి ప్రదేశాలలో, రద్దీగా ఉండే ప్రాంతాలలో ఎక్కువ సమయం గడపకుండా ఉండాలి. చల్లని, వెంటిలేషన్ ఉన్న ప్రదేశాలలో ఉండటం ఉత్తమం.
మానసిక ఆరోగ్యం: ఒత్తిడి, ఆందోళనలను తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటివి ప్రయత్నించాలి.
సుగంధ ద్రవ్యాలు: దుర్వాసనను పోగొట్టడానికి మంచి సువాసన గల డీయోడరెంట్లను వాడాలి.
ఈ జాగ్రత్తలు పాటించినా కూడా చెమట నియంత్రణలోకి రాకపోతే, ఆలస్యం చేయకుండా చర్మ వ్యాధి నిపుణుడిని (డెర్మటాలజిస్ట్) సంప్రదించడం మంచిది. వారు సరైన చికిత్సను సూచించి, సమస్య నుంచి బయటపడేలా సహాయపడతారు.




