Parenting Tips: రోజులో ఈ 5 సమయాల్లో పిల్లలను తిట్టారో.. అంతే సంగతులు.. ఎందుకో తెలుసా?
పిల్లల పెంపకం సవాలుతో కూడుకున్న పనే. కోపం వచ్చినా, కొన్ని కీలక సమయాల్లో వారిని తిట్టకుండా ఉండటం వారి మానసిక ఆరోగ్యానికి అత్యవసరం. మీ సహనం పిల్లలపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఈ సున్నితమైన క్షణాలను అర్థం చేసుకుంటే, వారి భవిష్యత్తును మెరుగుపరచవచ్చు. ఈ సమయాల్లో పిల్లలను తిట్టడం వల్ల అది వారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు..

పిల్లలను పెంచడం అంత సులభమేమి కాదు. వారు అప్పుడప్పుడు చిరాకు పెట్టడం, కోపం తెప్పించడం సహజమే. చాలామంది తల్లిదండ్రులు ఓపికగా ఉన్నా, కొన్నిసార్లు వారిని వారించడం లేదా గట్టిగా కోప్పడుతుంటాం. ఇది పెంపకంలో ఒక భాగమే అయినప్పటికీ, తరచూ అరవడం, కోప్పడటం వల్ల పిల్లలు మానసికంగా చాలా ఇబ్బందులు పడతారు. తల్లిదండ్రుల పట్ల భయం పెంచుకుంటారు, వారికి సంబంధించిన విషయాలను పంచుకోవడానికి వెనుకాడతారు.
పేరెంటింగ్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, కొన్ని సందర్భాల్లో పిల్లలను తిట్టడం వల్ల వారు మరింత మానసికంగా కుంగిపోయే ప్రమాదం ఉంది. అటువంటి సమయాల్లో వారు చాలా సెన్సిటివ్‌గా ఉంటారు, కోపంతో రియాక్ట్ అవ్వడం వారి మనసును గాయపరుస్తుంది. ముఖ్యంగా, కింది సమయాల్లో పిల్లలపై కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం.
నిద్ర లేచిన వెంటనే: రోజు ప్రారంభం పిల్లల మూడ్‌ను ప్రభావితం చేస్తుంది. ఉదయం నిద్రలేవగానే ఆలస్యమైందని లేదా ఏదో పని చేయలేదని తిట్టడం వల్ల వారు ఆందోళన చెందుతారు, రోజంతా మూడీగా ఉంటారు. బదులుగా, వారిని దగ్గరకు తీసుకుని, నవ్వుతూ పలకరించండి.
స్కూల్‌కి వెళ్లే ముందు: ఉదయం స్కూల్‌కి సిద్ధం చేయడం హడావిడిగా ఉంటుంది. ఈ సమయంలో పిల్లలు ఆలస్యం చేసినా, చిరాకు పెట్టినా కోపం రావొచ్చు. కానీ, స్కూల్‌కి వెళ్లే ముందు వారిని తిట్టడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ప్రేమగా మాట్లాడుతూ స్కూల్‌కి పంపండి, తద్వారా వారు రోజంతా చురుగ్గా ఉంటారు.
బడి నుంచి వచ్చిన వెంటనే: స్కూల్ నుంచి అలసిపోయి వచ్చిన పిల్లలు కాస్త విశ్రాంతిని కోరుకుంటారు. ఇంటికి రాగానే కఠినమైన నియమాలు పెట్టడం, కోప్పడటం వల్ల వారు మరింత నీరసపడతారు. వెంటనే హోంవర్క్ గురించి అడగకుండా, వారు పూర్తిగా కుదురుకున్నాక మాట్లాడండి.
చదువుకునేటప్పుడు: చదువుకునేటప్పుడు లేదా హోంవర్క్ చేసేటప్పుడు తిడితే, పిల్లలు నేర్చుకోవడానికి భయపడతారు, దేనిపైనా దృష్టి పెట్టలేరు. భయంతో నేర్చుకుంటే ఏదీ గుర్తుండదు. వారికి అర్థమయ్యేలా, ఓపికగా చెప్పాలి, అప్పుడే వారికి చదువుపై ఆసక్తి పెరుగుతుంది.
నిద్రపోయే ముందు: రోజంతా ఎలా ఉన్నా, రాత్రి పడుకునే ముందు పిల్లలు ప్రశాంతంగా ఉండాలి. ఆ సమయంలో బెదిరించడం, తిట్టడం వల్ల వారు ఆందోళనతో సరిగా నిద్రపోలేరు, ఇది వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ప్రశాంతమైన వాతావరణం కల్పించి, హాయిగా నిద్రపోవడానికి సహకరించండి.
తరచూ పిల్లలపై కోప్పడటం వల్ల వారిలో అభద్రతా భావం పెరిగి, భవిష్యత్తుపై ప్రభావం పడుతుంది. కొట్టడం వల్ల వారు మరింత మొండిగా తయారయ్యే ప్రమాదం ఉంది. సాధ్యమైనంత వరకు పిల్లలతో ప్రశాంతంగా మాట్లాడండి, వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరించండి.




