Parenting Tips: పిల్లలు అసభ్యంగా మాట్లాడితే ఇలా చేయండి.. మార్పు ఖచ్చితంగా చూస్తారు..!
ప్రస్తుత రోజుల్లో ఎంత జాగ్రత్తగా పెంచినా పిల్లలు చెడు మాటలు వినడం లేదా మాట్లాడటాన్ని పూర్తిగా నివారించడం కష్టం. టీవీలు, మొబైల్ లు, పాఠశాలలు, ఆట స్థలాలు వంటి అనేక చోట్ల అసభ్యమైన లేదా తగని పదాలను పిల్లలు వినే అవకాశం ఉంది. మీరు ఎంత మంచిగా పెంచినా.. వారి వాతావరణ ప్రభావం వల్ల ఈ పదాలు ఎక్కడో వినిపించి వారి భాషలోకి వస్తాయి.

అయితే దీనిని మీరు పూర్తిగా నియంత్రించలేకపోయినా ముందుగానే సరైన మార్గనిర్దేశం చేస్తే.. పిల్లల భాష మంచి దిశలో ఉంటుంది. తల్లిదండ్రులుగా పిల్లలు ఏ మాటలు వాడుతున్నారో గమనించి సరైన అవగాహన కలిగించాలి. పిల్లలు మొదటిసారి అసభ్యమైన పదం మాట్లాడితే మీకు షాక్ అనిపించవచ్చు. కానీ ఆ పరిస్థితిలో మీరు కోపంగా లేదా కఠినంగా స్పందిస్తే వారు ఆ పదాన్ని మరింత ఎక్కువగా ఉపయోగించాలని అనుకోవచ్చు. కాబట్టి ప్రశాంతంగా స్పందిస్తూ దాన్ని తేలికగా ఎదుర్కోవడం మంచిది.
చిన్న వయస్సులో పిల్లలు చెడు పదం చెప్పినా దాని అర్థం తెలియకపోవచ్చు. అలాంటప్పుడు ఈ మాట అర్థం నీకు తెలుసా..? అని ప్రశ్నించండి. వారితో ప్రశాంతంగా మాట్లాడి ఆ పదం ఎందుకు వాడకూడదో వివరించండి.
పిల్లలు తెలిసి తెలియకపోయినా ఎవరికైనా అసభ్య పదాలు వాడితే అది అంగీకరించబోమని వారికి గట్టిగా చెప్పండి. వారి భావాలను ఎలా మర్యాదగా చెప్పాలో నేర్పించండి. కోపం వచ్చినా గట్టిగా మాట్లాడకుండా సున్నితంగా చెప్పే అలవాటు పెంచండి.
పిల్లలు తప్పుగా ఏదైనా పదం ఉపయోగించినప్పుడు.. అది సరైంది కాదని స్పష్టంగా చెప్పాలి. తెలిసి చేశారో, తెలియక చేశారో అనే తేడా లేకుండా అలాంటి మాటలు వాడకూడదని గట్టిగా తెలియజేయాలి. అలాగే కోపం వచ్చినప్పుడు ఎలా మర్యాదగా మాట్లాడాలో వారికి చూపించాలి. గట్టిగా అరవకుండా, తమ భావాలను నెమ్మదిగా, సున్నితంగా చెప్పే అలవాటు వారిలో పెరగాలంటే మీరు మంచి ఉదాహరణగా ఉండాలి.
పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు క్షమించండి అనే మాట చెప్పడం ద్వారా వారిలో బాధ్యతా భావం పెరుగుతుంది. వారు ఎవరితోనైనా అసభ్యంగా మాట్లాడినట్లయితే.. వెంటనే ఆ వ్యక్తిని కలిసి క్షమాపణ చెప్పాలని వారిని ప్రోత్సహించాలి. ఈ విధంగా వారు తమ ప్రవర్తనపై చింతించి ఇతరులను గౌరవించడం నేర్చుకుంటారు.
మీరు పిల్లల ముందు అసభ్యంగా మాట్లాడితే వారూ అదే నేర్చుకుంటారు. పిల్లల ఎదుగుదలపై మీరు చూపించే ప్రవర్తన చాలా ప్రభావం చూపుతుంది. కాబట్టి పిల్లల ముందు మీరు, కుటుంబ సభ్యులు, స్నేహితులు.. ఎవరూ కూడా అసభ్య పదాలు మాట్లాడకూడదు.
పిల్లల భాషను గమనిస్తూ సరైన దిశగా మళ్లించడమే తల్లిదండ్రుల ప్రధాన బాధ్యత. వారిని తిట్టకుండా ప్రేమతో మార్గనిర్దేశం చేస్తే వారు తప్పు మాటల వాడకాన్ని బాగా అర్థం చేసుకుంటారు. చిన్నవయసులోనే సానుకూల మాటల ప్రాముఖ్యతను చెప్పడం వల్ల వారు భవిష్యత్తులో మంచి వ్యక్తులుగా ఎదుగుతారు.