Brain Health: బ్రెయిన్ షార్ప్ గా ఉండాలంటే ఇలా చేయండి.. 5 గోల్డెన్ టిప్స్ మీకోసం..!
తెలివిని పెంచుకోవాలంటే మెదడు ను చురుకుగా ఉంచడం అవసరం. రోజూ కొన్ని సరళమైన అలవాట్లు మన ఆలోచనా శక్తిని పెంచుతాయి. ధ్యానం, వ్యాయామం, సరైన నిద్ర, చదువు వంటి వాటిని క్రమంగా పాటిస్తే మెదడు పనితీరు మెరుగవుతుంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతి ఒక్కరూ తమ పనుల్లో మెరుగుపడాలంటే మెదడు చురుకుగా ఉండాల్సిందే. రోజూ కొన్ని అలవాట్లను నెమ్మదిగా పాటిస్తే మన తెలివిని పెంచుకోవడం సాధ్యమే. ఇవి చిన్న మార్పులుగా కనిపించినా.. దీర్ఘకాలంలో మీ వ్యక్తిత్వాన్ని మార్చేస్తాయి. ఆ కొన్ని అలవాట్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ధ్యానం
ప్రతి రోజూ పది నుంచి పదిహేను నిమిషాలు ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. దీని వల్ల మన దృష్టి మరింత పెరుగుతుంది. శరీరంతో పాటు మెదడుకు కూడా విశ్రాంతి లభిస్తుంది. ప్రత్యేకంగా కార్టెక్స్ అనే మెదడు భాగం ధ్యానం వల్ల మెరుగుపడుతుంది. ఇది మన ఆలోచనా శక్తికి మూలం. రోజూ ఉదయం లేదా రాత్రి నెమ్మదిగా కూర్చొని శ్వాసపై.. చుట్టూ ఉన్న శబ్దాలపై దృష్టి పెట్టడం మంచి మార్గం.
వ్యాయామం
ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడవడం, జాగింగ్ చేయడం లేదా శరీరానికి సరిపోయే ఏదైనా వ్యాయామం చేయడం మెదడుకు కూడా చాలా మంచిది. వ్యాయామం వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. దీని వల్ల మెదడుకు ఆక్సిజన్ బాగా అంది.. మనసు ప్రశాంతంగా, ఉత్సాహంగా ఉంటుంది. మెదడు చురుకుగా ఉండాలంటే శరీర కదలిక చాలా అవసరం.
స్నేహితులతో మెదడుకు పదును
మీకు సానుకూలంగా స్పందించే వ్యక్తులతో ఎక్కువ సమయం గడపడం వల్ల మీ ఆలోచనలు స్పష్టంగా మారతాయి. ఆరోగ్యకరమైన సంభాషణలు, మంచి స్నేహాలు మన మెదడులో కొత్త ఆలోచనలను పుట్టిస్తాయి. ఇది జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ముఖ్యంగా ఆత్మవిశ్వాసం పెరిగి ఏ పనినైనా పూర్తి చేయగల శక్తిని మీకు అందిస్తుంది.
చదవడం
ప్రపంచంలోని గొప్ప వ్యక్తులందరిలో ఒక అలవాటు.. రోజూ చదవడం. పుస్తకాలు, వార్తాపత్రికలు, ఆన్ లైన్ వ్యాసాలు.. ఏదైనా చదవడం వల్ల మనకు కొత్త విషయాలు తెలుస్తాయి. ఇది మెదడును కొత్త కోణంలో ఆలోచించేలా చేస్తుంది. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉత్సాహాన్ని పెంచుతుంది. దాంతో పాటు మన మాట్లాడే నైపుణ్యం కూడా మెరుగుపడుతుంది.
సరైన నిద్ర
తగినంత నిద్ర లేకపోతే మన మెదడులో గందరగోళం మొదలవుతుంది. మంచి నిద్ర లేనివారు నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. మెదడు విశ్రాంతిగా ఉండాలంటే రోజూ కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం. నిద్ర సమయంలో మన మెదడు గతంలో జరిగిన విషయాలను ఒక పద్ధతిలో పెట్టుకుని గుర్తుంచుకుంటుంది. అందుకే మంచి నిద్ర ఉంటేనే మనం పనులు బాగా చేయగలం.
ఈ అలవాట్లు ఒక్క రోజులో ఫలితాలు ఇవ్వవు. కానీ వాటిని క్రమశిక్షణతో పాటిస్తే.. మీ తెలివి మరింత పెరుగుతుంది. ఈ మార్పులు మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








