Walking benefits: నడకే పదివేలు అంటారు కదా! మరి రోజూ 10,000 అడుగుల నిబంధనేమిటి? ప్రయోజనమెంత? ఆసక్తికర విషయాలు..
రోజుకు 10,000 అడుగులు అనే సిద్ధాంతం కూడా ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇది ఎంత వరకూ నిజం? రోజూ 10,000 అడుగులు నడవాల్సిందేనా? నిపుణులు చెబుతున్న వివరణలు ఏంటి?
కోవిడ్ సంక్షోభం మనిషిలో ఆరోగ్య స్పృహని పెంచింది. అదే సమయంలో ప్రతి విషయాన్ని అనుమానించేలా చేసింది. ఏది చేస్తే ఆరోగ్యం.. ఏది చేస్తే అనారోగ్యం అన్న విషయంలో చాలా మందికి అపోహలు, అనుమానాలు ఉన్నాయి. అయితే ప్రధానంగా శారీరక శ్రమ లేకపోవడమే చాలా రోగాలకు కారణమని నిపుణులు చెబుతుంటారు. ఇదే క్రమంలో సంపూర్ణ అరోగ్యానికి అందరూ చెప్పే ఏకైక సూత్రం నడకని వివరిస్తుంటారు. రోజూ వాకింగ్ చేయడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలకు దూరం కావచ్చని చెబుతుంటారు. అయితే రోజుకు 10,000 అడుగులు అనే సిద్ధాంతం కూడా ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇది ఎంత వరకూ నిజం? రోజూ 10,000 అడుగులు నడవాల్సిందేనా? నిపుణులు చెబుతున్న వివరణలు ఏంటి? చూద్దాం రండి..
ఇది ఎలా బయటకు వచ్చింది..
రోజుకు 10,000 అడుగులు నడిస్తే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది అని చెప్పే వాళ్లు చాలా మంది ఉన్నప్పటికీ.. వాస్తవానికి మొదటిసారిగా ఈ మాట చెప్పిన వాళ్ల ఉద్దేశం తెలిస్తేనే కొంత సందేహం కలగక మానదు. 1965లో ఒక జపాన్ కంపెనీ వారు తమ స్టెప్ మీటర్ విక్రయాలు పెంచుకోవడం కోసం చేసిన ప్రకటనలోంచి ఈ ప్రచారం పుట్టుకొచ్చింది అని చెబుతుంటారు. అంటే ఇది హెల్త్ మేటర్ కంటే మార్కెటింగ్ కోణమే ఎక్కువగా కనిపిస్తోంది అనే వాదన కూడా ఉంది. అయితే, ఈ వాదన సంగతి ఎలా ఉన్నప్పటికీ.. శారీరక శ్రమ అనేది ఎవరికైనా మేలు చేసే అంశమే. సాధారణంగా ఎవరైనా సరే నిత్యం తమ దైనందిన జీవితంలో 5 వేల నుంచి 7,500 అడుగులు నడుస్తారు. ఇంకొంత శ్రమ అనుకోకుండా వాకింగ్ కోసం మరో 30 నిమిషాలు కేటాయిస్తే.. 3 వేల నుంచి 4 వేల అడుగులు అదనంగా నడుస్తారు. అన్నీ కలిపి మొత్తం 10 వేల అడుగులకు చేరువలో ఉంటాం. అసలు నడవకుండా ఒకే చోట ఉండటం కంటే.. ఎంతో కొంత నడవడం అనేది ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతారు.
ప్రయోజనం ఏమిటి?
నడక బరువు తగ్గడానికి చక్కని పరిష్కారంగా ఉంటుంది. అలాగే రోజుకు 10,000 అడుగులు నడవడం అంటే దాదాపు ఐదు మైళ్లు. 3,000 అడుగులు చురుకైన నడక, జాగింగ్ చేయడం వేగంతో బరువు తగ్గడానికి తగినంత కేలరీలు బర్న్ చేయడంలో మేలు చేస్తుంది. నడక మనసును ప్రశాంతంగా చేస్తుంది. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం, నడక మనస్సును తేలిక చేస్తుంది. ఆలోచనలను ప్రశాంతంగా ఉంచడమే కాకుండా, ఆలోచనా సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇంటి నుంచి పనిచేసేవారు మధ్యాహ్నం, భోజన సమయంలో 20 నిమిషాల నడవడం వల్ల అది ఆరోగ్యాన్ని పెంచుతుంది.
- గుండె జబ్బులను దూరం పెట్టొచ్చు.
- ఊబకాయం వ్యాధి నుంచి బయటపడొచ్చు.
- బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉండటం వల్ల డయాబెటిస్ బారిన పడకుండా ఉండొచ్చు.
- అధిక రక్త పోటును నివారించవచ్చు.
- డిప్రెషన్‌ని సైతం దూరం పెట్టొచ్చు.
- ఆందోళనను, నిరాశను తగ్గిస్తుంది.
- దీర్ఘకాలిక రోగులకూ నడక మంచిదే..
ఎవరు నడవకూడదంటే.. గాయాలతో ఉన్నవారు లేదా కీళ్ల సమస్యలు, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో ఉన్నవారు నడిస్తే.. వైద్య పరమైన సమస్యలు తలెత్తుతాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..