AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కన్నతల్లి కాదన్నా.. బొమ్మనే అమ్మని కౌగిలించుకుంది! ఈ చిట్టి కోతి కథ వింటే కన్నీళ్లు ఆగవు

మూగజీవులైనా, మనుషులైనా అమ్మ ఒడిలో ఉండే ఆ నిశ్చింత, భద్రత మరెక్కడా దొరకదు. అమ్మ స్పర్శ ఇచ్చే ధైర్యం బిడ్డకు కొండంత బలాన్ని ఇస్తుంది. కానీ, కన్నతల్లే తన బిడ్డను సాకడానికి ఇష్టపడకపోతే? ఆ పసి ప్రాణం పడే ఆవేదన వర్ణనాతీతం.

కన్నతల్లి కాదన్నా.. బొమ్మనే అమ్మని కౌగిలించుకుంది! ఈ చిట్టి కోతి కథ వింటే కన్నీళ్లు ఆగవు
Japanese Macaque Baby.jpg
Nikhil
|

Updated on: Feb 21, 2026 | 12:28 AM

Share

సరిగ్గా ఇలాంటి హృదయవిదారక పరిస్థితినే ఎదుర్కొంది ఒక చిట్టి కోతి పిల్ల. అమ్మే కావాలంటూ ఆ పసి కూన చేసిన ఆరాటం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇప్పుడు నెటిజన్ల కళ్లను చెమర్చుతున్నాయి. ప్రకృతిలో మాతృత్వం అనేది ఒక గొప్ప వరం. ఏ జీవి అయినా సరే తన ప్రాణానికి ప్రాణంగా బిడ్డను కాపాడుకుంటుంది. అయితే, అరుదుగా కొన్ని సందర్భాల్లో జంతువులు తమ పిల్లలను దగ్గరకు రానివ్వవు. జపాన్‌లోని ఇచికావా సిటీ జూలో నివసించే ఒక మకాక్ జాతి కోతి విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. తల్లి ప్రేమ కోసం ఆ చిట్టి ప్రాణం పడ్డ తపన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

‘పంచ్’ కథ..

జపాన్ లోని ఇచికావా సిటీ జూలో గతేడాది జూలై 26, 2025న ఒక చిట్టి కోతి జన్మించింది. దానికి జూ అధికారులు ‘పంచ్’ అని పేరు పెట్టారు. పంచ్ పుట్టడమే చాలా తక్కువ బరువుతో పుట్టింది. అలాంటి సమయంలో తల్లి సంరక్షణ, ఆ వెచ్చని స్పర్శ ఆ బిడ్డకు ఎంతో అవసరం. కానీ, అనూహ్యంగా పంచ్ తల్లి తన బిడ్డను దగ్గరకు రానివ్వలేదు. పోషణ అందించడానికి నిరాకరించింది. నిజానికి ఇది ఆ కోతికి మొదటి సంతానమే అయినప్పటికీ, కొన్ని కోతుల్లో సహజంగానే మాతృత్వ లక్షణాలు తక్కువగా ఉంటాయని జూ సంరక్షకులు చెబుతున్నారు.

తల్లి దగ్గరకు చేరనివ్వకపోవడంతో పంచ్ మానసిక వేదనకు గురైంది. ఆ బెంగతో ఎక్కడ చనిపోతుందో అని భయపడిన జూ అధికారులు ఒక ఉపాయం ఆలోచించారు. అచ్చం మకాక్ జాతి కోతిలాగే ఉండే ఒక సాఫ్ట్ టాయ్ (బొమ్మ) ను పంచ్ కు అందించారు. ఆ చిన్నారి ఆ బొమ్మను చూడగానే ప్రాణం లేని ఆ వస్తువునే తన కన్నతల్లి అని నమ్మింది. దాన్ని గట్టిగా కౌగిలించుకుని పడుకోవడం, ఆ బొమ్మ చెంతనే నిశ్చింతగా ఉండటం చూసిన జూ అధికారుల మనసు ద్రవించిపోయింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కేవలం బొమ్మతోనే జీవితం గడిపితే పంచ్ తన సహజ సిద్ధమైన లక్షణాలను కోల్పోతుందని భావించిన అధికారులు, దానిని మెల్లగా ఇతర కోతుల మందలోకి పంపారు. మొదట్లో పెద్ద కోతులు కాస్త గద్దించినా, కాలక్రమేణా పంచ్ వాటితో కలిసిపోయింది. తన జాతి కోతులతో ఎలా ఉండాలి, ఎలా సంభాషించాలి అనేది నేర్చుకుంది. ఇప్పుడు పంచ్ కు ఒక మంచి స్నేహితుడు కూడా దొరికాడు. ఇద్దరూ కలిసి జూలో ఎంతో సంతోషంగా ఆడుకుంటున్నారు. అమ్మ లేని లోటు ఏ బిడ్డకైనా తీర్చలేనిది. ఆ చిట్టి కోతి పడ్డ కష్టం చూస్తుంటే ఎవరికైనా కన్నీళ్లు వస్తాయి. మూగజీవులకైనా సరే ప్రేమానురాగాలు అవసరమని ఈ ఘటన నిరూపిస్తోంది. ప్రస్తుతం పంచ్ ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండటం చూసి జూ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Follow Us