Dates Side Effects: డేట్స్‌ను అతిగా లాగించేస్తున్నారా?.. ఈ 5 సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోండి
ఖర్జూరాలను ప్రకృతి ప్రసాదించిన పౌష్టికాహారంగా, సహజసిద్ధమైన స్వీట్లుగా మనం ఎంతో ఇష్టంగా తింటాం. వీటిలో ఉండే ఫైబర్, ఐరన్ విటమిన్లు మన శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయనేది వాస్తవం. అయితే, ఆరోగ్యానికి మంచిది కదా అని వీటిని పరిమితికి మించి తీసుకోవడం వల్ల కలిగే అనారోగ్య సమస్యల గురించి చాలామందికి అవగాహన ఉండదు. ముఖ్యంగా బరువు పెరగడం నుంచి తీవ్రమైన అలర్జీల వరకు ఖర్జూరాలు అతిగా తినడం వల్ల ఐదు రకాల ఆశ్చర్యకరమైన దుష్ప్రభావాలు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

ఖర్జూరాలను పోషకాల గని అంటారు. తక్షణ శక్తిని ఇవ్వడంలో ఇవి ముందుంటాయి. అయితే, వీటిని పరిమితికి మించి తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఖర్జూరాల్లో ఫైబర్ అధికంగా ఉన్నప్పటికీ, వీటిని మోతాదుకు మించి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఇబ్బందులకు గురవుతుంది. ముఖ్యంగా కడుపునొప్పి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. కొన్ని సందర్భాల్లో ఇది విరేచనాలకు కూడా దారి తీస్తుంది. కాబట్టి జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఖర్జూరాల వినియోగం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
బరువు పెరిగే అవకాశం
ఖర్జూరాలలో కేలరీలు సహజ చక్కెరలు చాలా ఎక్కువగా ఉంటాయి. మనం ఆరోగ్యకరమైన స్నాక్ అనుకుని వీటిని ఎక్కువగా లాగించేస్తుంటాం, కానీ వీటిలో ఉండే శక్తి వినియోగం కాకపోతే అది శరీరంలో కొవ్వుగా మారి బరువు పెరగడానికి కారణమవుతుంది. బరువు తగ్గాలనుకునే వారు ఖర్జూరాలను పరిమితంగా తీసుకోవడం ఉత్తమం.
చర్మంపై దద్దుర్లు అలర్జీలు
ఎండిన ఖర్జూరాలను ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు తయారీదారులు ‘సల్ఫైట్స్’ అనే రసాయనాలను ఉపయోగిస్తుంటారు. సున్నితమైన చర్మం కలిగిన వారు లేదా అలర్జీలు ఉన్నవారు ఇటువంటి ఖర్జూరాలను అధికంగా తిన్నప్పుడు చర్మంపై దురదలు, ఎర్రటి దద్దుర్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. వీటిని శుభ్రంగా కడిగి తీసుకోవడం వల్ల కొంతవరకు ముప్పు తగ్గుతుంది.
చిన్నారులకు పొంచి ఉన్న ముప్పు
పసిపిల్లలకు ఖర్జూరాలు తినిపించేటప్పుడు తల్లిదండ్రులు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఖర్జూరం పండు చాలా గట్టిగా, జిగటగా ఉండటం వల్ల చిన్న పిల్లలు దానిని సరిగ్గా నమలలేరు. దీనివల్ల ఆ ముక్కలు గొంతులో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చిన్న పిల్లలకు వీటిని నేరుగా ఇవ్వకుండా జాగ్రత్త వహించాలి.
ఆస్తమాను ప్రేరేపించే గుణం
ఖర్జూరాలు కొన్ని రకాల అలెర్జీలను కలిగిస్తాయి. ముఖ్యంగా శ్వాసకోస సమస్యలు ఉన్నవారు లేదా ఆస్తమా బాధితులు ఖర్జూరాలను అతిగా తిన్నప్పుడు వారిలో అలర్జీలు పెరిగి, అది ఆస్తమా అటాక్‌కు దారితీసే అవకాశం ఉంటుంది. అందుకే అలర్జీలకు గురయ్యే వ్యక్తులు ఖర్జూరాల వినియోగంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. వీటిని పాటించే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం.
