బీపీ, షుగర్ రోగులకు కిడ్నీ సమస్యలు వస్తాయా? నిర్లక్ష్యం వద్దు బ్రో..
ఇటీవలి కాలంలో అధిక రక్తపోటు (బీపీ), మధుమేహం వంటి సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ రెండు వ్యాధులను దీర్ఘకాలం పాటు నియంత్రించకపోతే అవి శరీరంలోని ముఖ్యమైన అవయవాలను దెబ్బతీస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మూత్రపిండాల ఆరోగ్యంపై వాటి ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది..

వైద్యుల అభిప్రాయం ప్రకారం శరీరం నుంచి విష పదార్థాలను తొలగించడంలో, శరీర ద్రవ సమతుల్యతను కాపాడటంలో మూత్రపిండాలు కీలక పాత్ర పోషిస్తాయి. కానీ రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు నిరంతరం పెరిగితే మూత్రపిండాలలోని సున్నితమైన రక్తనాళాలు దెబ్బతింటాయి. దీని కారణంగా మూత్రపిండాల వడపోత సామర్థ్యం నెమ్మదిగా తగ్గడం ప్రారంభమవుతుంది. కాబట్టి అధిక రక్తపోటు, మధుమేహం మూత్రపిండాలను ఎలా దెబ్బతీస్తాయో? మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏమి చేయవచ్చో? ఇక్కడ తెలుసుకుందాం..
అధిక రక్తపోటు, మధుమేహం మూత్రపిండాలను ఎలా దెబ్బతీస్తాయి?
అధిక రక్తపోటు, మధుమేహాన్ని ఎక్కువ కాలం నియంత్రించకపోతే మూత్రపిండాల పనితీరు క్షీణిస్తుంది. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధికి మధుమేహం ఒక ప్రధాన కారణం. రక్తపోటు పెరిగినప్పుడు, మూత్రపిండాలపై మరింత ఒత్తిడి పడుతుంది. సకాలంలో చికిత్స చేయకపోతే ఈ సమస్య తీవ్రమై, డయాలసిస్ కూడా అవసరం రావచ్చని నిపుణుల అభిప్రాయ పడుతున్నారు.
మూత్రపిండాల దెబ్బతింటే కనిపించే లక్షణాలు ఏమిటి?
మూత్రపిండాల సమస్యలు మొదలైనప్పుడు కాళ్లు, ముఖం వాపు, నీరసం, అలసట, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మూత్రం పరిమాణంలో లేదా రంగులో మార్పు కూడా ఒక ముఖ్యమైన సూచన. కొంతమందికి రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన, ఆయాసం, శరీరం బరువుగా ఉన్నట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇటువంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలి?
రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఉప్పు, చక్కెర తక్కువగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పుష్కలంగా నీళ్లు తాగడం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం వంటి ముందస్తు జాగ్రత్తలు మూత్రపిండాలను కాపాడుకోవడానికి సహాయపడతాయి. వైద్యుల సలహా మేరకు క్రమం తప్పకుండా మందులు తీసుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం వల్ల మూత్రపిండాల సమస్యల ప్రమాదాన్ని తగ్గించవచ్చని ఆరోగ్య నిపుణులు తెలిపారు.
నోట్: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. టీవీ9 దీనిని నిర్ధారించడం లేదు. పూర్తి సమాచారం కోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




