AP News: ఇంటర్‌లో 60 మార్కులొస్తే 5 వేసి ఫెయిల్ చేసిన లెక్చరర్‌కి స్వల్ప శిక్షా..? కఠిన చర్యలు తీసుకోవాల్సిందే
మూల్యాంకనంలో పొరబాట్లు చేస్తే లెక్చరర్లకు భారీ జరిమానాలు, షోకాజ్ నోటీసులు అంటూ ఊదరగొట్టిన విద్యాశాఖ ప్రస్తుతం కంటితుడుపు చర్యలు చేపట్టడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మూల్యాంకనంలో పొరపాట్ల వల్ల విద్యార్థుల మనోవేదన, మనస్తాపం చెంది ఏమైనా చేసుకుంటే పరిస్థితి ఏంటి? అని అడుగుతున్నారు..

అమరావతి, మే 18: ఇటీవల విడుదలైన ఇంటర్మీడియల్ ఫలితాల్లో పలు దారుణాలు వెలుగు చూశాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొందరు లెక్చరర్లు మూల్యాంకనంలో ఘోర తప్పిదాలు చేసి, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడారు. నిర్లక్ష్యంగా పేపర్లు మూల్యాంకనం చేసిన లెక్చరర్లపై మాత్రం కఠిన చర్యలు ఉండటం లేదు. మూల్యాంకనం ముందు విద్యాశాఖ హడావిడి చేసినప్పటికీ.. ఇప్పుడు మాత్రం తూతూ మంత్రంగా ఇటువంటి వారిపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మూల్యాంకనంలో పొరబాట్లు చేస్తే లెక్చరర్లకు భారీ జరిమానాలు, షోకాజ్ నోటీసులు అంటూ ఊదరగొట్టిన విద్యాశాఖ ప్రస్తుతం కంటితుడుపు చర్యలు చేపట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
మూల్యాంకనంలో పొరపాట్ల వల్ల విద్యార్థుల మనోవేదన, మనస్తాపం చెంది ఏమైనా చేసుకుంటే పరిస్థితి ఏంటి? అనే వాటినీ మూల్యాంకనం చేసే లెక్చరర్లు పట్టించుకోవడం లేదు. ఎలాంటి ఘోర తప్పిదాలు చేసినా కఠిన చర్యలు లేకపోవడంతో మూల్యాంకనంలో తరచూ తప్పులు చోటుచేసుకుంటున్నాయి. ఏప్రిల్ 15న విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన కర్లపూడి కావ్యకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బొటనీ పరీక్షలో 60కి 60 మార్కులు వచ్చాయి. కానీ మూల్యాంకనం చేసిన లెక్చరర్ మాత్రం ఓఎమ్మార్ షీట్ బబ్లింగ్ సమయంలో కేవలం 5 మార్కులుగా నమోదు చేశారు. అదే ఓఎమ్మర్‌ను స్కాన్ చేయడంతో కంప్యూటర్ 5 మార్కులు వచ్చినట్లు నమోదు చేసింది. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని కావ్యను లెక్చరర్ నిర్లక్ష్యంతో ఫెయిల్ చేసినట్లైంది. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలు మార్చి 13న విడుదల చేశాక ఈ విషయం వెల్లడైంది. దాదాపు నెల రోజులు ఆ విద్యార్థిని తీవ్ర మనోవేదనకు గురైంది. మరికొందరు ఇలాంటి వాటిని తట్టుకోలేక అగాయిత్యాలు చేసుకుంటే బాధ్యులు ఎవరు? తప్పిదాలకు పాల్పడిన అధ్యాపకులపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
కావ్య పేపర్‌ను మూల్యాంకనం చేసిన లెక్చరర్‌కు మాత్రం రూ.7,500 జరిమానా విధించి, మూడేళ్ల పాటు మూల్యాంకనానికి రాకుండా డిబార్ చేయనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇలా నామమాత్రపు చర్యలు తీసుకుంటే బాధ్యులకు భయం ఏం ఉంటుందని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. తప్పు చేసిన లెక్చరర్‌ను మూడేళ్లు మూల్యాంకనానికి దూరంగా ఉంచడం ఒక్కటేనా పరిష్కారం కాదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




