Tomato Price Hiked: భగ్గుమంటున్న టమాటా.. భారీగా పెరిగిన ధరలు! వచ్చే రెండు మూడు వారాల్లో మరింత పైపైకి
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో జనాలు అల్లాడిపోతున్నారు. మరోవైపు పప్పులు, వంట నూనెలు, కూరగాయలు.. వీటి ధరలు సరేసరి. ఆదివారం హాయిగా చికెన్ లేదా మటన్ తిందామా అంటే.. చికెన్ కిలో రూ.360, మటన్ ఏకంగా కిలో రూ.1000 ఉంది. పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లాడిపోతుంటే తాజాగా మరో పిడుగు లాంటి కబురు అందింది..

హైదరాబాద్, మే 18: పెరగిన ధరలతో ఏదీ కొనేటట్లులేదు.. ఏదీ తినేటట్లులేదు. సామాన్యుడి నెత్తిన మరో పిడుగు పడింది. ఇప్పటికే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో జనాలు అల్లాడిపోతున్నారు. మరోవైపు పప్పులు, వంట నూనెలు, కూరగాయలు.. వీటి ధరలు సరేసరి. ఆదివారం హాయిగా చికెన్ లేదా మటన్ తిందామా అంటే.. చికెన్ కిలో రూ.360, మటన్ ఏకంగా కిలో రూ.1000 ఉంది. పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లాడిపోతుంటే ఇప్పుడు ఈ వరుసలో టమాట కూడా చేరింది. నిన్నమొన్నటి వరకు కిలో రూ.10 నుంచి రూ.20 పలికిన టమాట ప్రస్తుతం ఏకంగా రూ.60కి చేరింది.
టమాటా ధర ఒక్కసారిగా భారీగా పెరిగింది. వారం రోజుల క్రితం కేజీ రూ.20 ఉన్న టమాటా ఇప్పుడు కేజీ .40 నుంచి రూ.60 మధ్య వ్యాపారులు విక్రయిస్తున్నారు. రాబోయే వారం రోజుల్లో వీటి ధర మరింత పెరుగవచ్చని మార్కెటింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఎండల తీవ్రతకు టమాట పంట ఎండిపోయి సప్లయ్ తగ్గడమే ఇందుకు కారణమని వ్యాపారులు అంటున్నారు. పంట ఉత్పత్తి తగ్గి డిమాండ్‌కు తగినట్టుగా మార్కెట్‌కి టమాటా సరఫరా లేదు. పైగా గత ఏడాది టమాటా పంటతో నష్టం రావడంతో ఈ ఏడాది రైతులు టమాట సాగును ఘణనీయంగా తగ్గించారు. పైగా మే నెలలో కురిసిన అకాల వర్షాలకు వేసిన కొద్ది పంట కూడా దెబ్బతింది.
ఫలితంగా మార్కెట్‌కు పంట రావడం భారీగా తగ్గిపోయింది. దిగుబడులు తగ్గి, సరఫరా కొరత ఏర్పడంతో వ్యాపారులు అమాంతం రేట్లు పెంచేశారు. వచ్చే రెండు, మూడు వారాల్లో టమాట రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. జూన్ రెండో వారం వరకు ఇదే పరిస్థితి కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని వెల్లడించారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, బోయినపల్లి, వనస్థలిపురం, సరూర్‌నగర్, మెహిదీపట్నం రైతు బజార్ మార్కెట్లలో కిలో టమాట రూ. 40 వరకు విక్రయిస్తున్నారు. టోకుగా క్వింటాల్ టమాట ధర రూ.1600 నుంచి రూ.2 వేలు పలుకుతుంది. టమాటకు ధరలు పెరగడంతో రైతన్నలు సంబరాలు చేసుకుంటున్నారు. అటు ఏపీలోనూ టమాట ధరలు భగ్గుమంటున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




