AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైబీపీతో ఇబ్బంది పడుతున్నారా? రక్తపోటును మంచులా కరిగించే అద్భుత పానీయం..!

మన వంటింట్లో ఉండే పోపుల పెట్టెలో ఔషధాల గని ఉంటుంది. అందులో ముఖ్యమైంది వెల్లుల్లి. ఘాటైన వాసన, రుచిని ఇచ్చే వెల్లుల్లిని కేవలం వంటల కోసమే కాకుండా, వేల ఏళ్లుగా ఆయుర్వేదంలో మందుగా వాడుతున్నారు. ముఖ్యంగా నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా వేధిస్తున్న రక్తపోటు సమస్యకు వెల్లుల్లి ఒక అద్భుతమైన పరిష్కారం.

హైబీపీతో ఇబ్బంది పడుతున్నారా? రక్తపోటును మంచులా కరిగించే అద్భుత పానీయం..!
Garlic Tea.jpg
Nikhil
|

Updated on: Feb 20, 2026 | 10:59 PM

Share

రక్తపోటును సహజంగా ఎలా తగ్గించుకోవాలి, వెల్లుల్లి టీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.. వెల్లుల్లిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయనే సంగతి అందరికీ తెలిసిందే. దాదాపు ప్రతి వంటకంలోనూ దీనిని ఉపయోగిస్తూనే ఉంటారు. వెల్లుల్లి వంటలకు రుచిని పెంచడంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ‘అల్లిసిన్’ అనే శక్తివంతమైన సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలను కలిగి ఉండటమే కాకుండా, ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా కాపాడుతుంది. ముఖ్యంగా రక్తపోటును అదుపులో ఉంచడంలో వెల్లుల్లి పాత్ర అనన్యం.

  • ధమనుల గోడలపై రక్తం బలం సాధారణం కంటే ఎక్కువగా ఉండే స్థితిని రక్తపోటు అంటారు. దీనిని నియంత్రించకపోతే గుండెపోటు, స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వెల్లుల్లిలోని అల్లిసిన్ రక్తపోటును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని వైద్యులు చెబుతున్నారు. వెల్లుల్లిలోని సల్ఫర్ రక్తనాళాల్లో ‘నైట్రిక్ ఆక్సైడ్’ ఉత్పత్తిని పెంచుతుంది. దీనివల్ల రక్తనాళాలు వ్యాకోచించి (వెడల్పుగా మారి), రక్తం సాఫీగా ప్రవహిస్తుంది. ఫలితంగా రక్తపోటు తగ్గుతుంది.
  •  సుమారు 480 మిల్లీగ్రాముల నుండి 960 మిల్లీగ్రాముల మోతాదులో వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకున్న వారిలో సిస్టోలిక్ రక్తపోటు గణనీయంగా తగ్గిందని నిపుణుల అధ్యయనాలు వెల్లడించాయి. ఇది ధమనులు గట్టిపడకుండా కాపాడి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వెల్లుల్లి నేరుగా తినడం వల్ల వచ్చే ఘాటును భరించలేని వారు, దానిని టీ రూపంలో తీసుకోవడం ఉత్తమం.

వెల్లుల్లి టీ తయారీ విధానం..

వెల్లుల్లి టీని తయారు చేసుకోవడం చాలా సులభం. దీనికి కావాల్సిన పదార్థాలు:

  • 3 వెల్లుల్లి రెబ్బలు
  • 3 కప్పుల నీరు
  •  రుచి కోసం కొద్దిగా తేనె లేదా నిమ్మరసం

తయారీ పద్ధతి

ఒక గిన్నెలో మూడు కప్పుల నీరు పోసి వేడి చేయాలి. అందులో మూడు వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. ఈ నీటిని 4 నుండి 5 నిమిషాల పాటు బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ నీటిని వడకట్టి, గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో కొద్దిగా తేనె లేదా నిమ్మరసం కలుపుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులోకి రావడమే కాకుండా, శరీర రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. వెల్లుల్లి టీ కేవలం బీపీకి మాత్రమే కాకుండా జీర్ణశక్తిని మెరుగుపరచడానికి, కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అయితే ఇప్పటికే బీపీకి మందులు వాడుతున్న వారు ఈ టీని ప్రారంభించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. వంటింట్లో దొరికే వెల్లుల్లితో మీ గుండెను భద్రంగా ఉంచుకోండి.

Follow Us