Yuvraj Singh : నా రిటైర్మెంట్‌పై ధోనీనే క్లారిటీ ఇచ్చాడు.. కోహ్లీ, కోచ్ నన్ను పట్టించుకోలేదు.. యువరాజ్ సంచలన వ్యాఖ్యలు
Yuvraj Singh : భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన రిటైర్మెంట్ సమయంలో ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. సెలక్టర్లు తనను పరిగణనలోకి తీసుకోవడం లేదని, టీంలోకి సెలక్ట్ చేయలేదని ధోనీనే తనకు స్వయంగా చెప్పాడని యువరాజ్ సింగ్ వెల్లడించారు.

Yuvraj Singh : భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ తన రిటైర్మెంట్ రోజులను గుర్తు చేసుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2011 ప్రపంచకప్ హీరోగా నిలిచిన తనకు కెరీర్ ఆఖరి దశలో టీమ్ మేనేజ్‌మెంట్ నుంచి సరైన గౌరవం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు తనను జట్టులోకి ఎందుకు తీసుకోవడం లేదనే విషయంలో అప్పట్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ గానీ, కోచ్ గానీ క్లారిటీ ఇవ్వలేదని, చివరికి ఎంఎస్ ధోనీనే తనకు అసలు నిజం చెప్పాడని యువీ వెల్లడించారు.
2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన యువరాజ్ సింగ్, అప్పట్లో జరిగిన పరిణామాలపై ఇప్పుడు నోరు విప్పారు. కెరీర్ చివరి దశలో తాను తీవ్రమైన గందరగోళానికి గురయ్యానని ఆయన తెలిపారు. “నేను అప్పుడు 36-37 ఏళ్ల వయసులో ఉన్నాను. నన్ను జట్టులోకి ఎందుకు ఎంపిక చేయడం లేదో ఎవరూ చెప్పలేదు. ఎన్సీఏ నుంచి గానీ, అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ లేదా కోచ్ నుంచి గానీ నాకు ఎలాంటి సమాచారం లేదు. దేశం కోసం అంత క్రికెట్ ఆడిన నాకు కనీస గౌరవం ఇవ్వాలని కోరుకున్నాను” అని యువీ పేర్కొన్నారు.
ఈ గందరగోళం మధ్య యువరాజ్ సింగ్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఫోన్ చేసి మాట్లాడారట. “ధోనీ అప్పుడు కెప్టెన్ కాదు, అతడికి ఆ నిర్ణయాలతో సంబంధం లేదు. కానీ జరుగుతున్నదంతా అతను గమనిస్తున్నాడు. సెలక్టర్లు ఇకపై నీ వైపు చూడటం లేదని, నీ గురించి వారు ఆలోచించడం లేదని ధోనీ నాకు స్పష్టంగా చెప్పాడు. అతడు ఇచ్చిన క్లారిటీతోనే నాకు అసలు విషయం అర్థమైంది” అని యువీ వివరించారు. మేనేజ్‌మెంట్ తనను ఫిట్‌నెస్ టెస్టులో ఫెయిల్ అవుతావని, రిటైర్మెంట్ ప్రకటించమని కోరినట్లు కూడా యువీ బాంబు పేల్చారు.
యువరాజ్ సింగ్ 2000వ సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి, 2019 వరకు సుదీర్ఘంగా కొనసాగారు. 304 వన్డేలు, 58 టీ20లు, 40 టెస్టులు ఆడి 11 వేలకు పైగా పరుగులు సాధించారు. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదడం, 2011 వన్డే ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచి భారత్ కప్పు గెలవడంలో కీలక పాత్ర పోషించడం యువీ కెరీర్‌లో హైలైట్స్. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధిని జయించి మరీ మైదానంలోకి అడుగుపెట్టిన యువీ పోరాట పటిమ ఎందరికో స్ఫూర్తిదాయకం.
సాధారణంగా ఒక దిగ్గజ ఆటగాడు రిటైర్ అవుతున్నప్పుడు మైదానంలో ఘనమైన వీడ్కోలు దక్కాలని అభిమానులు కోరుకుంటారు. కానీ యువీ విషయంలో అది జరగలేదు. మేనేజ్‌మెంట్ తనకు ఫిట్‌నెస్ సాకులు చెప్పి తప్పించాలని చూసిందని, కానీ తన రిటైర్మెంట్ నిర్ణయం తనదేనని తాను తెగేసి చెప్పినట్లు యువీ గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్ సాగుతున్న వేళ, పాత జ్ఞాపకాలను యువీ నెమరువేసుకోవడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
