Sugar Cane Juice: చెరుకు రసంతో ఎన్నో బెనిఫిట్స్.. కానీ వీరు తీసుకోకూడదు..
చెరుకు రసం ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో మన శరీరానికి మేలు చేసే ఎన్నో ప్రయోజనాలున్నాయి. కాల్షియం తక్కువగా ఉన్న వారు, రక్తలేమితో బాధపడుతున్నవారు, మెగ్నీషియం వంటి పోషకలోపం ఉన్నవారు చెరుకు రసం తీసుకోవచ్చు. కానీ కొన్నిరకాల సమస్యలు ఉన్నవారు దీనిని తీసుకోకూడదు..

చెరుకు రసంలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉండటం వల్ల అన్ని వయసుల వారికి కూడా ఎంతో మంచిది. కిడ్నీ ఆరోగ్యానికి కూడా చెరుకు రసం మేలు చేస్తుంది. శరీరంలో ప్రొటీన్ లెవెల్స్ ను పెంచుతుంది. లివర్ సమస్యలు ఉన్నవారికి చెరుకు రసం తాగించడం చూస్తూనే ఉంటాం. ఇక అనారోగ్యాల బారిన పడిన వారు కూడా తిరిగి వెంటనే కోలుకోవాలని ముందుగా వారికి చెరుకు రసాన్నే రికమెండ్ చేస్తారు. అన్ని పోషకాలున్న ఈ డ్రింక్ తాగడం వల్ల అలసట వెంటనే మాయం చేస్తుంది. ఒంట్లో వేడిని చిటికెలో తగ్గిస్తుంది. జీర్ణక్రియను సులభతరం చేయడంలోనూ ఇది ఎంతో ప్రయోజనకారి. ఇక చర్మ సమస్యలు ఉన్నవారు. డల్ స్కిన్ తో బాధపడేవారు కూడా చెరుకు రసం భేషుగ్గా తీసుకోవచ్చు. ఇక రక్తహీనతతో బాధపడే వ్యక్తులకు ఇది ఎన్నో బెనిఫిట్స్ ను అందిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ను కూడా అందిస్తుంది. ఇందులో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నప్పటికీ కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు చెరుకు రసం తాగకూడదని మీకు తెలుసా.. ఇది వారికి చేసే మేలు కన్నా ప్రమాదమే ఎక్కువని నిపుణులు సూచిస్తున్నారు..
చెరుకు రసం తాగకూడని వారు ఎవరంటే మనకు ముందుగా గుర్తొచ్చేది మధుమేహులే. ఇది నిజమే. ఎందుకంటే ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ స్థాయిలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఇది షుగర్ వ్యాధి ఉన్నవారు తీసుకోకూడదు. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుంది. జ్యూస్ కు బదులుగా వారు తక్కువ మోతాదులో చెరుకు గడను తినవచ్చు.
దంతాలలో సమస్య ఉన్నవారు..
కొందరు దంత కుహరం సమస్యలతో బాధపడుతుంటారు. దీనినే దంతక్షయం లేదా కావిటీలుగా పిలుస్తారు. వీరు చక్కెరతో కలిపిన తీపి పదార్థాలు తినడం వల్ల కేవిటీలు ఏర్పడుతుంటాయి. అలాంటి వారు కూడా చెరుకు రసానికి దూరంగా ఉండాలి. లేదంటే ఈ సమస్యను ఇది మరింత ఎక్కువ చేయొచ్చు.
అధిక కేలరీలు..
ఊబకాయంతో బాధపడుతున్నవారు దీనిని తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. ఎందుకంటే చెరుకు రసంలో కేలరీలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఇవి శరీరంలో కొవ్వును వేగంగా పెంచుతాయి. అందుకే బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారు దీనికి దూరంగా ఉండాలి.
కడుపునొప్పి ఉన్నవారు..
ఇప్పటికే అతిసారం, కడుపునొప్పి, వాంతులు వంటి సమస్యతో ఉన్నవారు కూడా చెరుకురసం తీసుకోకూడదు. ఇది మీ జీర్ణవ్యవస్థను ఇబ్బంది పెట్టగలదు. జలుబు, దగ్గు ఉన్నవారు కూడా చెరుకు రసం తాగకూడదు. ఇందులో ఉండే చక్కెర స్థాయిలు దగ్గును మరింత పెంచగలవు. కాబట్టి ఇలాంటి సమస్యలతో ఉన్నప్పుడు ఈ జ్యూస్ అంత మంచిది కాదు.
