Chilli Paneer: చైనీస్ ఫుడ్ అంటే పిచ్చా.. ఈ సింపుల్ రెసిపీతో ఇంట్లోనే చిల్లీ పనీర్ చేసుకోండి..
మన దేశంలో చైనీస్ వంటలకు మన సాంప్రదాయ రుచులను జోడించి మరింత మరింత రుచికరంగా తయారు చేస్తారు. అలాంటి స్టార్టర్ చిల్లీ పనీర్. చైనీస్ ఫుడ్ చిల్లీ పనీర్ అనేది భారతీయ-చైనీస్ వంటకం. ఇది స్పైసీ చైనీస్ సాస్‌లో పనీర్ ముక్కలను కలిగి ఉంటుంది. దీనిని 20వ శతాబ్దం మధ్యలో భారతదేశంలోని కోల్‌కతాలో మొదటి సారిగా తయారు చేశారు. చిల్లీ పనీర్ ని డ్రై గా లేదా గ్రేవీతో తయారు చేసుకోవచ్చు. ఇది అందరికీ ఇష్టమైన స్టార్టర్ లేదా స్నాక్. ఈ రోజు ఇంట్లోనే చేసుకునే విధానం గురించి తెలుసుకుందాం..

Paneer Chilli Recipe
ఇండో-చైనీస్ వంటకాల్లో చిల్లీ పనీర్ అత్యంత ఇష్టపడే వంటకం. ఈ వంటకాన్ని పనీర్ , స్పైసీ-స్వీట్ చిల్లీ సాస్ కలయికతో తయారు చేస్తారు. ఇది రుచిలో అద్భుతమైనది మాత్రమే కాదు. చిల్లీ పనీర్ ని డ్రై గా లేదా గ్రేవీగా చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. చిల్లీ పనీర్ తయారు చేయడానికి సులభమైన రెసిపీని తెలుసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు
- పనీర్ – 250 గ్రాములు (ముక్కలుగా కట్ చేసుకోవాలి)
- కార్న్‌ఫ్లోర్ – 3 టేబుల్ స్పూన్లు
- మైదా – 2 టేబుల్ స్పూన్లు
- వెల్లుల్లి పేస్ట్ – 1 స్పూన్
- సోయా సాస్ – 1 స్పూన్
- కారం – ½ స్పూన్
- నూనె- వేయించడానికి
- వెల్లుల్లి – 1 టేబుల్ స్పూన్ (సన్నగా తరిగినది)
- పచ్చిమిర్చి – 2 (సన్నగా తరిగినవి)
- ఉల్లిపాయ – 1 పెద్దది (ముక్కలుగా కట్ చేసుకోవాలి)
- కాప్సికమ్ – 1 పెద్దది (ఆకుపచ్చ, ఎరుపు, పసుపు ముక్కలుగా కట్ చేసుకోవాలి)
- ఉల్లిపాయలోని తెల్ల భాగం – 2 టేబుల్ స్పూన్లు (సన్నగా తరిగినవి)
- సోయా సాస్ – 1 టేబుల్ స్పూన్
- టమాటా కెచప్ – 2 టేబుల్ స్పూన్లు
- రెడ్ చిల్లీ సాస్ – 1 టేబుల్ స్పూన్
- వెనిగర్ – 1 స్పూన్
- చక్కెర – 1 స్పూన్
- మిరియాల పొడి – ½ స్పూన్
- ఉప్పు – రుచికి సరిపడా
- కార్న్‌ఫ్లవర్ – 1 టీస్పూన్
- కొత్తిమీర – కట్ చేసుకున్నది
తయారీ విధానం:
- ముందుగా ఒక గిన్నె తీసుకుని కార్న్‌ఫ్లోర్, మైదా, వెల్లుల్లి పేస్ట్, సోయా సాస్, కారం, కొంచెం ఉప్పు వేసి, కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ మందపాటి పిండిని సిద్ధం చేయండి.
- ఇప్పుడు ఈ మిశ్రమంలో పనీర్ ముక్కలు వేసి బాగా కోట్ చేసి.. ఇవి క్రిస్పీగా, బంగారు గోధుమ రంగు వచ్చేవరకు డీప్ ఫ్రై చేయండి. వేయించిన పనీర్ ముక్కలను ప్లేట్ లో టిష్యూ పేపర్ మీద వేసి పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు పాన్ ని స్టవ్ మీద పెట్టి అందులో రెండు స్పూన్ల నూనె వేడి చేసి.. వేడి చేసి వెల్లుల్లి, పచ్చిమిర్చి, పచ్చి ఉల్లిపాయలోని తెల్ల భాగం ముక్కలు వేసి ఒక నిమిషం వేయించాలి.
- ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి 2 నిమిషాలు వేయించాలి. తరువాత క్యాప్సికమ్ ముక్కలు వేసి హై ఫ్లేమ్ మీద కాసేపు (సుమారు 2 నిమిషాలు) వేయించాలి. కూరగాయ ముక్కలు కొద్దిగా క్రంచీగా ఉండేలా వేయించుకోవాలి.
- తరువాత ఈ మిశ్రమంలో సోయా సాస్, టొమాటో కెచప్, రెడ్ చిల్లీ సాస్, వెనిగర్, చక్కెర, మిరియాల పొడి, కొంచెం ఉప్పు వేసి బాగా కలపాలి.
- ఇప్పుడు ఈ మిశ్రమంలో కొంచెం నీరు పోసి మరిగించాలి. సాస్ చిక్కగా అయ్యే వరకూ ఈ మిశ్రమాన్ని నిరంతరం కలుపుతూ ఉండాలి.
- సాస్ చిక్కగా అయ్యాక.. ముందు వేయించుకున్న పనీర్ ముక్కలు వేసి మెల్లగా కలపండి.. ఈ సాస్ పనీర్ ముక్కలకు అద్దుకునేలా కలిపి.. ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. చివరిగా కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు వేసి అలంకరించండి. అంతే పెద్దలు, పిల్లలు ఇష్టంగా తింటే చిల్లీ పనీర్ రెడీ.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




