Paneer Bread Pakoda: సాయంత్రం టీతో ఈ స్నాక్ తింటే స్వర్గమే! నోరూరించే పనీర్ బ్రెడ్ పకోడీ రెసిపీ..
బయట చలి వణికిస్తున్నప్పుడు, వంటింట్లో వేడి వేడి పకోడీలు వేగుతుంటే ఆ సువాసనే వేరు! సాధారణంగా మనం ఉల్లిపాయ పకోడీలు లేదా మిర్చి బజ్జీలు తింటూ ఉంటాం. కానీ, ఈసారి కొంచెం వెరైటీగా, రెస్టారెంట్ స్టైల్‌లో ఉండే "పనీర్ బ్రెడ్ పకోడీ"ని ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది? కరకరలాడే బ్రెడ్, లోపల మెత్తని పనీర్ రుచికరమైన ఆలు స్టఫింగ్‌తో కూడిన ఈ స్నాక్ పిల్లలకే కాదు, పెద్దలకు కూడా అమితంగా నచ్చుతుంది. మరి ఈ సూపర్ టేస్టీ పకోడీని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

సాయంత్రం ఆఫీసు నుండి భర్త వచ్చినప్పుడైనా, స్కూల్ నుండి పిల్లలు వచ్చినప్పుడైనా వారికి ఏదైనా స్పెషల్ స్నాక్ చేసి పెట్టాలని ప్రతి ఇల్లాలు కోరుకుంటుంది. ముఖ్యంగా ఈ శీతాకాలంలో వేడి టీతో పాటు పనీర్ బ్రెడ్ పకోడీ ఒక అద్భుతమైన కాంబినేషన్. కేవలం కొన్ని నిమిషాల్లోనే పూర్తయ్యే ఈ వంటకం రుచిలో మాత్రం అమోఘంగా ఉంటుంది. బయట దొరికే ఆయిలీ ఫుడ్ కంటే ఇంట్లోనే శుభ్రంగా, పోషక విలువలున్న పనీర్‌తో ఈ స్నాక్ ఎలా సిద్ధం చేసుకోవాలో తెలుసుకోండి.
ఈ రుచికరమైన స్నాక్ కోసం కావలసినవి:
4-6 బ్రెడ్ ముక్కలు
4-6 పనీర్ ముక్కలు
4 ఉడికించిన బంగాళాదుంపలు.
ఒక కప్పు శనగ పిండి
1/2 టీస్పూన్ బేకింగ్ సోడా
పసుపు
కారం
ఉప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్
చాట్ మసాలా
నల్ల ఉప్పు
కొత్తిమీర
ఎర్ర కారం పొడి.
తయారీ విధానం:
స్టఫింగ్ సిద్ధం చేయడం: ముందుగా ఉడికించిన బంగాళాదుంపలను మెత్తగా చేసి.. అందులో ఉప్పు, చాట్ మసాలా, నల్ల ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర వేసి బాగా కలపాలి.
పిండి మిశ్రమం: ఒక గిన్నెలో శనగ పిండి, పసుపు, కారం, ఉప్పు వేసి తగినంత నీరు పోసి బజ్జీల పిండిలా (కోటింగ్‌కు వీలుగా) కలుపుకోవాలి. చివరగా బేకింగ్ సోడా వేయాలి.
లేయరింగ్: బ్రెడ్ ముక్కలను త్రిభుజాకారంలో కట్ చేసి, ఒక ముక్కపై ఆలు మిశ్రమాన్ని రాయాలి. దానిపై ఒక పనీర్ ముక్కను ఉంచి, మరో బ్రెడ్ ముక్కతో మూసివేయాలి.
సిద్ధం చేసుకున్న బ్రెడ్ శాండ్‌విచ్‌ను శనగ పిండి మిశ్రమంలో ముంచి, వేడి నూనెలో వేయాలి. మీడియం మంటపై బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించి తీయాలి.
చివరగా వేడి వేడి పకోడీలను గ్రీన్ చట్నీ లేదా టొమాటో సాస్‌తో వడ్డిస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్ లొట్టలేసుకుంటూ తింటారు!
