పిల్లల ఎముకల బలానికి ఇదే సూపర్ ఫుడ్.. 10 నిమిషాల్లోనే రాగి ఇడ్లీలు రెడీ.. ఇలా చేస్తే ఇష్టంగా తినేస్తారు..
ఇంట్లో ఇడ్లీ పిండి లేకపోయినా, కేవలం రాగి పిండి, బొంబాయి రవ్వ, పెరుగుతోనే 10 నిమిషాల్లో మెత్తటి ఇన్‌స్టంట్ రాగి ఇడ్లీలు తయారు చేసుకోవచ్చు. పప్పులు నానబెట్టడం, పిండిని పులియబెట్టడం వంటి ప్రక్రియలు లేకుండానే స్పాంజిలా, దూదిలాంటి ఇడ్లీలు సిద్ధమవుతాయి. రాగిలో పీచు పదార్థం, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటంతో ఇది ఆరోగ్యకరమైన అల్పాహారంగా చెప్పవచ్చు.

ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి ఇంట్లో ఎలాంటి పిండి లేనప్పుడు లేదా ఎప్పుడైనా హెల్దీగా, డిఫరెంట్ గా తినాలి అనుకున్నప్పుడు అప్పటికప్పుడు కేవలం 10 నిమిషాల్లో దూదిలాంటి మెత్తటి రాగి ఇడ్లీలను తయారు చేసుకోవచ్చు. సాధారణంగా పప్పు నానబెట్టి, రుబ్బి, పులియబెట్టిన తర్వాతే రాగి ఇడ్లీలు చేస్తుంటారు. అయితే అలా కాకుండా ఎలాంటి పిండి పులియబెట్టాల్సిన అవసరం లేకుండానే, రెగ్యులర్ ఇడ్లీల కంటే సాఫ్ట్ గా, స్పాంజిలా వచ్చే ఇన్స్టెంట్ రాగి ఇడ్లీల తయారీ విధానాన్ని ఇక్కడ తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు:
- రాగి పిండి – 1 కప్పు
- బొంబాయి రవ్వ (ఉప్మా రవ్వ) – 1 కప్పు
- పెరుగు (కాస్త పులిసినది) – 2 కప్పులు
- క్యారెట్ తురుము – ¼ కప్పు
- పచ్చిమిర్చి తరుగు – 1 టేబుల్ స్పూన్
- కరివేపాకు తరుగు – 1 టేబుల్ స్పూన్
- కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు
- వంట సోడా (Baking Soda) – ½ టీస్పూన్
- ఉప్పు – రుచికి సరిపడా
- ఆయిల్ – ½ టేబుల్ స్పూన్
- తాలింపు దినుసులు – పచ్చిశనగపప్పు (1 టేబుల్ స్పూన్), మినప్పప్పు (1 టేబుల్ స్పూన్), ఆవాలు (½ టీస్పూన్), జీలకర్ర (½ టీస్పూన్)
తయారీ విధానం:
రవ్వ – రాగి పిండిని వేయించడం:
ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అర టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కాక పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి. తాలింపు వేగాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్ తురుము వేసి సన్నటి సెగపై ఒక నిమిషం పాటు వేయించాలి. ఇవన్నీ వేగాక ఒక కప్పు బొంబాయి రవ్వ వేసి సన్నటి సెగపై కమ్మటి వాసన వచ్చే వరకు కనీసం 5 నుండి 10 నిమిషాలు నిదానంగా వేయించుకోవాలి. రవ్వ బాగా వేగితేనే ఇడ్లీలు రుచిగా వస్తాయి. రవ్వ వేగిన తర్వాత అదే కప్పుతో ఒక కప్పు రాగి పిండి వేసి, మరో 2-3 నిమిషాలు కాస్త వెచ్చబడే వరకు వేయించి, చివరగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆపి పిండిని పూర్తిగా చల్లారనివ్వాలి.
పిండిని నానబెట్టడం:
వేయించిన పిండి మిశ్రమం కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత, అందులో రుచికి సరిపడా ఉప్పు.. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల పులిసిన పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి మొదట పిండిని కాస్త గట్టిగానే కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కనీసం 15 నుండి 20 నిమిషాల పాటు పిండిని నానబెట్టాలి. దీనివల్ల రవ్వ పెరుగును పీల్చుకుని పిండి గట్టిపడుతుంది.
ఇడ్లీ బ్యాటర్ సిద్ధం చేయడం:
20 నిమిషాల తర్వాత మూత తీసి, అందులో అర టీస్పూన్ వంట సోడా వేయాలి. సోడా వేసిన తర్వాత కొద్దిగా నీళ్లు పోస్తూ మనం రెగ్యులర్ గా చేసుకునే ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలా అడ్జస్ట్ చేసుకోవాలి. పులిసిన పెరుగులో వంట సోడా వేయడం వల్ల పిండిలో ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి, ఫెర్మెంట్ (పులిసిన) చేసిన పిండి లాగా తయారవుతుంది. దీనివల్ల ఇడ్లీలు చాలా ఫ్లఫీగా వస్తాయి.
ఇడ్లీలు ఉడికించడం:
స్టవ్ మీద ఇడ్లీ పాత్రను ఉంచి నీళ్లు పోసి మరిగించాలి. ఈ లోపు ఇడ్లీ ప్లేట్లపై కాస్త తడిపిన కాటన్ క్లాత్ వేసి (లేదా ప్లేట్లకు నెయ్యి/నూనె రాసి అయినా వేసుకోవచ్చు) అందులో ఇడ్లీ పిండిని కొద్దికొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్లను ఇడ్లీ పాత్రలో ఉంచి మీడియం ఫ్లేమ్‌లో 10 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత రెండు నిమిషాలు అలాగే వదిలేసి, ఆపై ఇడ్లీలను బయటకు తీయాలి.
అంతే.. ఎంతో సులభంగా, అప్పటికప్పుడు దూదిలాంటి మెత్తటి, నోట్లో వేస్తే కరిగిపోయే హెల్దీ రాగి ఇడ్లీలు సిద్ధం అవుతాయి. పప్పులు నానబెట్టే ఓపిక లేనప్పుడు లేదా ఇన్స్టెంట్ గా బ్రేక్‌ఫాస్ట్ చేయాలనుకున్నప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్. ఈ వేడి వేడి రాగి ఇడ్లీలను టమాటో చట్నీ లేదా మీకు నచ్చిన ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా అద్భుతంగా ఉంటాయి. మీరు కూడా ఈ ఆరోగ్యకరమైన రెసిపీని ఇంట్లో తప్పకుండా ప్రయత్నించి చూడండి..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




