AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చికెన్ కూర ఇట్ల చేస్తే నీచు వాసన రాదు.. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు లొట్టలేసుకుంటూ తింటారు..

ఆదివారం స్పెషల్‌గా ఇంట్లోనే రుచికరమైన చికెన్ కర్రీ చేయాలనుకునే వారికి కొన్ని సులభమైన వంట చిట్కాలు ఎంతో ఉపయోగపడతాయి. చికెన్‌ను ఉప్పు, పసుపుతో శుభ్రం చేయడం, మొదట మసాలాలు వేయకుండా చికెన్‌లోని సహజ నీరు పూర్తిగా ఆవిరయ్యే వరకు వేయించడం, ఆ తర్వాతే కారం, ధనియాల పొడి కలపడం వల్ల చికెన్‌కు నీచు వాసన రాకుండా, మసాలా బాగా పట్టి, గ్రేవీ చిక్కగా వస్తుంది.

చికెన్ కూర ఇట్ల చేస్తే నీచు వాసన రాదు.. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు లొట్టలేసుకుంటూ తింటారు..
Chicken Curry Recipe
Shaik Madar Saheb
|

Updated on: Jul 19, 2026 | 12:35 PM

Share

ఆదివారం వచ్చిందంటే చాలు ముక్క ఉండాల్సిందే.. నాన్ వెజ్ ప్రియులు చికెన్ ను ఎంతో ఇష్టంగా వండుకుని తింటారు. కర్రీ, ఫ్రైతోపాటు.. పలు రకాలుగా చికెన్ వంటకాలను వండుకుని ఆస్వాదిస్తారు. అందుకే.. చికెన్ కర్రీ అనగానే బ్యాచిలర్స్ నుండి వంట రాని వారి వరకు ఎంతో ఇష్టంగా నేర్చుకోవాలనుకుంటారు. అయితే చాలా మంది చికెన్ వండినప్పుడు అది నీచు వాసన వస్తుందని లేదా ముక్కకు ఉప్పు, కారం సరిగ్గా పట్టలేదని అంటుంటారు. అయితే.. కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఎలాంటి నీచు వాసన లేకుండా, గ్రేవీ చిక్కగా, ముక్క మెత్తగా జ్యూసీగా వచ్చేలా సింపుల్ చికెన్ కర్రీని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు..

నీచువాసన రాకుండా చికెన్ కర్రీని నిమిషాల్లోనే ఎలా వండాలో ఈ కథనంలో చూద్దాం..

కావలసిన పదార్థాలు:

చికెన్ – మీకు కావాలసిన పరిమాణంలో..

ఇవి కూడా చదవండి

ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, నూనె, గరం మసాలా దినుసులు – లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క (చిన్న ముక్క), జాపత్రి, షాజీరా, బిర్యానీ ఆకు (కొద్దిగా), జీలకర్ర

అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు – రుచికి సరిపడా (చికెన్ ఉడకడానికి మరికొంత).. కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి, కసూరి మేతి, కొత్తిమీర – కొద్దిగా..

పోపు – ఉల్లిపాయలు వేయించడం:

ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి 3-4 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నాన్-వెజ్ వంటకాలకు నూనె కాస్త ఎక్కువ ఉంటేనే రుచి బాగుంటుంది. నూనె వేడెక్కాక లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, జాపత్రి, షాజీరా, బిర్యానీ ఆకు, జీలకర్ర వేసి తక్కువ మంటపై దోరగా వేయించాలి. మసాలా సువాసన వస్తున్నప్పుడు పచ్చిమిర్చి చీలికలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి.

ఉల్లిపాయలను మగ్గించడం:

మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు, అర టీస్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. కడాయిపై మూత పెట్టి ఉల్లిపాయలు మంచి బంగారు రంగు (గోల్డెన్ బ్రౌన్) వచ్చే వరకు మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగితేనే గ్రేవీ చిక్కగా వస్తుంది. ఉల్లిపాయలు వేగాక ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.

చికెన్ వేయించడం (నీచు వాసన పోవడానికి ముఖ్యమైన స్టెప్):

అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక, ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను (చికెన్ కడిగేటప్పుడు కాస్త ఉప్పు, పసుపు వేసి కడిగితే నీచు వాసన తగ్గుతుంది) కడాయిలో వేయాలి. చికెన్ వేసిన తర్వాత ఉప్పు, కారం ఏమీ వేయకుండా మీడియం టు హై ఫ్లేమ్‌లో మూత పెట్టి వేయించాలి. చికెన్ లోంచి నీరు ఊరి, ఆ నీరంతా పూర్తిగా ఇరిగిపోయి, నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. చికెన్ లోని నీరు పూర్తిగా ఆవిరైతే.. కూర అస్సలు నీచు వాసన రాదు.

మసాలాలు – నీరు చేర్చడం:

నూనె పైకి తేలిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి ముక్కలకు పట్టేలా ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. మసాలాలు ముక్కలకు పట్టిన తర్వాత గ్రేవీ కోసం ఒక గ్లాస్ నీళ్లు పోయాలి. ఎక్కువ నీళ్లు పోస్తే కూర చప్పగా అయిపోతుంది కాబట్టి తగినన్ని నీళ్లు మాత్రమే పోసి, మూత పెట్టి మంటను సిమ్‌లో ఉంచి 10 నుండి 15 నిమిషాల పాటు చికెన్ ముక్క మెత్తబడే వరకు ఉడికించుకోవాలి.

కూర చిక్కబడి నూనె పైకి తేలుతున్న సమయంలో అర టీస్పూన్ గరం మసాలా పొడి, కొద్దిగా కసూరి మేతి (పెనంపై కొద్దిగా వేడి చేసి నలిపి వేస్తే ఫ్లేవర్ అద్భుతంగా ఉంటుంది) వేసి కలపాలి. కసూరి మేతి వేసిన తర్వాత మూత పెట్టి కేవలం రెండు నిమిషాలు సిమ్‌లో ఉంచాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన, ఘుమఘుమలాడే చికెన్ కర్రీ సిద్ధమవుతుంది.

ఈ పద్ధతిలో చేసిన చికెన్ కర్రీ అన్నం, చపాతీ, బగారా రైస్ లేదా బిర్యానీ దేనిలోకైనా అద్భుతమైన కాంబినేషన్. వంట రాని వారు కూడా ఎంతో సులభంగా ఇలా చేసుకోని తినవచ్చు..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us