AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరు తినే నెయ్యి అమృతమా? విషమా? కల్తీ నెయ్యిని ఇంట్లోనే పట్టేసే 5 పద్ధతులివే

భారతీయ వంటకాల్లో నెయ్యికి ఉన్న స్థానం ప్రత్యేకం. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి పడితే ఆ రుచి, సువాసన నెక్స్ట్ లెవల్‌లో ఉంటుంది. ఆయుర్వేదం నెయ్యిని అమృతంతో పోల్చింది. అయితే, నేడు అదే నెయ్యి అనారోగ్యాన్ని పంచే విషంలా మారుతోంది. కల్తీ మాఫియా అత్యాశకు బలైపోతున్న నెయ్యిలో.. కాసుల కక్కుర్తి కోసం డాల్డా, జంతువుల కొవ్వు, పామాయిల్ ఇంకా విషపూరిత రసాయనాలు కలుపుతున్నారు. ఈ కల్తీ నెయ్యి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా దీర్ఘకాలిక రోగాలకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో, మనం తింటున్న నెయ్యి స్వచ్ఛమైనదో కాదో ఇంట్లోనే సులభంగా ఎలా గుర్తించాలో ఆహార భద్రత సంస్థ ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ (FSSAI) కొన్ని పద్ధతులను సూచించింది.

మీరు తినే నెయ్యి అమృతమా? విషమా? కల్తీ నెయ్యిని ఇంట్లోనే పట్టేసే 5 పద్ధతులివే
Check Purity Of Ghee At Home.jpg
Nikhil
|

Updated on: Apr 16, 2026 | 10:11 PM

Share

కల్తీ నెయ్యిని గుర్తించడానికి పంచదార టెస్ట్ ఒక ఉత్తమ మార్గం. ఒక గాజు సీసాలో కరిగించిన నెయ్యి తీసుకుని దానికి కొంచెం పంచదార, హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలిపి బాగా షేక్ చేయాలి. కొద్దిసేపటి తర్వాత ఆ మిశ్రమం ఎరుపు రంగులోకి మారితే అందులో వనస్పతి కలిపినట్లు అర్థం. అలా కాకుండా ఆ మిశ్రమం ముదురు గోధుమ రంగులో ఉంటే అది స్వచ్ఛమైనదిగా భావించవచ్చు. అదేవిధంగా, నెయ్యిని వేడి చేయడం ద్వారా కూడా నాణ్యతను పరీక్షించవచ్చు. ఒక గిన్నెలో కొంచెం నెయ్యి తీసుకుని వేడి చేసినప్పుడు అది త్వరగా కరిగి ముదురు గోధుమ రంగులోకి మారితే ఆ నెయ్యి స్వచ్ఛమైనది. ఒకవేళ కరగడానికి ఎక్కువ సమయం తీసుకుని పసుపు రంగులోకి మారితే అది కల్తీ అయినట్లు గుర్తించాలి.

సులభమైన పద్ధతులు..

మన శరీర ఉష్ణోగ్రతను ఉపయోగించి కూడా నెయ్యి స్వచ్ఛతను తెలుసుకోవచ్చు. కొంచెం నెయ్యిని అరచేతిలో వేసుకున్నప్పుడు అది శరీర ఉష్ణోగ్రతకు త్వరగా కరిగిపోతే అది స్వచ్ఛమైనది. అలా కాకుండా కరగకుండా అలానే ఉంటే అందులో వనస్పతి లేదా ఇతర కొవ్వులు కలిపినట్లు అనుమానించాలి. మరో సులభమైన పద్ధతి వాటర్ టెస్ట్. ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ నెయ్యి వేసినప్పుడు అది నీటిపై తేలితే స్వచ్ఛమైన నెయ్యిగా పరిగణించవచ్చు. కల్తీ నెయ్యి లేదా ఇతర పదార్థాలు కలిసిన నెయ్యి అయితే బరువు వల్ల నీటి అడుగు భాగానికి చేరుతుంది. ఇలా చాలా సింపుల్ గా ఇంట్లోనే నెయ్యి నాణ్యతను తనిఖీ చేయవచ్చు.

నెయ్యిలో బరువు పెంచడానికి కొందరు ఉడికించిన బంగాళదుంప లేదా ఇతర పిండి పదార్థాలను కలుపుతుంటారు. దీనిని గుర్తించడానికి అయోడిన్ టెస్ట్ చేయాలి. కొంచెం కరిగించిన నెయ్యి తీసుకుని అందులో రెండు చుక్కల అయోడిన్ ద్రావణాన్ని కలపాలి. ఆ నెయ్యి నీలం లేదా ముదురు రంగులోకి మారితే అందులో పిండి పదార్థం కలిసిందని అర్థం చేసుకోవాలి. మన పిల్లలు ఎంతో ఇష్టంగా తినే నెయ్యి విషపూరితం కాకుండా చూసుకోవడం మన బాధ్యత.

బయట మార్కెట్లో దొరికే నెయ్యి పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆకర్షణీయమైన ప్యాకింగ్ చూసి మోసపోకుండా పైన పేర్కొన్న చిన్న చిన్న పరీక్షలు చేయడం ద్వారా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. స్వచ్ఛమైన ఆహారమే ఆరోగ్యానికి అసలైన పునాది అని గుర్తించి మెలగాలి. మన వంట గదిలో వాడుతున్న నెయ్యి అమృతమో కాదో మీరే స్వయంగా పరీక్షించి తెలుసుకోండి!

Follow Us