Shreyas Iyer Catch : సూపర్మ్యాన్లా ఎగిరి క్యాచ్ పట్టిన శ్రేయస్ అయ్యర్.. నోరెళ్లబెట్టిన సూర్య, రోహిత్
Shreyas Iyer Catch : ముంబై ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో మార్కో యాన్సెన్ వేసిన బంతిని హార్దిక్ పాండ్యా భారీ సిక్సర్ కోసం ప్రయత్నించాడు. బంతి నేరుగా బౌండరీ లైన్ వైపు దూసుకెళ్లింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన సమయస్ఫూర్తిని ప్రదర్శించాడు.

Shreyas Iyer Catch : ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం రాత్రి వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన పోరులో అసలైన మజా కనిపించింది. ముంబై బ్యాటర్ క్వింటన్ డికాక్ సెంచరీతో స్టేడియాన్ని హోరెత్తిస్తే, పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన ఫీల్డింగ్ విన్యాసాలతో ముంబై ఫ్యాన్స్‌కు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా వికెట్ తీయడంలో శ్రేయస్ చేసిన విన్యాసం చూసి రోహిత్ శర్మ సైతం ఆశ్చర్యపోయాడు.
ముంబై ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో మార్కో యాన్సెన్ వేసిన బంతిని హార్దిక్ పాండ్యా భారీ సిక్సర్ కోసం ప్రయత్నించాడు. బంతి నేరుగా బౌండరీ లైన్ వైపు దూసుకెళ్లింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన సమయస్ఫూర్తిని ప్రదర్శించాడు. గాల్లోకి ఎగిరి క్యాచ్ అందుకున్న శ్రేయస్, బ్యాలెన్స్ తప్పుతున్నానని గ్రహించి వెంటనే బంతిని లోపలికి విసిరాడు. అక్కడ సిద్ధంగా ఉన్న జేవియర్ బార్ట్లెట్ ఆ క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో హార్దిక్ పాండ్యా (14) పెవిలియన్ చేరక తప్పలేదు. ఈ క్యాచ్ చూసిన రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ కూడా నోరెళ్లబెట్టారు.
క్యాచ్ పట్టిన తర్వాత శ్రేయస్ అయ్యర్ చేసిన సెలబ్రేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. సాధారణంగా ముంబై ఫ్యాన్స్ ప్రత్యర్థి ఆటగాళ్లను ఆటపట్టించడం చూస్తుంటాం. కానీ ఇక్కడ శ్రేయస్ అయ్యర్ రివర్స్ ర్యాగింగ్ చేశాడు. క్యాచ్ పట్టాక తన వేళ్లతో పెదవులపై సైగ చేస్తూ, ఇక నోళ్లు మూయండి అన్నట్లుగా ముంబై ప్రేక్షకులకు సెటైర్లు వేశాడు. వాంఖడే గడ్డపై ముంబై కెప్టెన్‌ను అవుట్ చేసి, అదే స్టేడియంలో ఫ్యాన్స్‌ను సైలెంట్ చేయమని చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
SHREYAS IYER, WHAT HAVE YOU DONE!! 🤯
🎥 One of the best catches you would see in the #TATAIPL history 🔥🔥
Updates ▶️ https://t.co/Fn2dxJ4zYR#KhelBindaas | #MIvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/6EKgHR82cL
— IndianPremierLeague (@IPL) April 16, 2026
రోహిత్ శర్మ గాయంతో ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో వచ్చిన అవకాశాన్ని క్వింటన్ డికాక్ అద్భుతంగా వాడుకున్నాడు. ఆరంభం నుండే పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డ డికాక్, కేవలం 60 బంతుల్లోనే 112 పరుగులతో అజేయ సెంచరీ సాధించాడు. అతనికి యువ బ్యాటర్ నమన్ ధీర్ (50) తోడవ్వడంతో ముంబై 20 ఓవర్లలో 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. అంతకుముందు సూర్యకుమార్ యాదవ్ డకౌట్ కావడంతో ముంబై కొద్దిసేపు తడబడింది.
ముంబై నిర్దేశించిన 196 పరుగుల లక్ష్యం పంజాబ్ కింగ్స్‌కు పెద్ద సవాలే. కానీ శ్రేయస్ అయ్యర్ ఊపు చూస్తుంటే బ్యాటింగ్‌లో కూడా పంజాబ్ పంజా విసరడం ఖాయంగా కనిపిస్తోంది. పంజాబ్ జట్టు ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా మంచి జోరు మీదుంది. మరి డికాక్ సెంచరీని శ్రేయస్ సేన ఎలా ఎదుర్కొంటుందో, బుమ్రా బౌలింగ్‌లో పంజాబ్ బ్యాటర్లు ఎలా నిలుస్తారో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
