హనుమాన్ జయంతి నైవేద్యానికి బెస్ట్ స్వీట్..! బూందీ లడ్డూ రెసిపీ.. ఎందుకో తెలుసా..?
హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు హనుమంతుడికి బూందీ లడ్డూను నైవేద్యంగా సమర్పిస్తారు. పసుపు రంగులో ఉండే ఈ లడ్డూ ఆయనకు చాలా ఇష్టమని నమ్ముతారు. ఇది భక్తి, శక్తిని సూచించే మిఠాయి. అలాంటి ఈ లడ్డూను మనమే ఇంట్లో సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

హనుమాన్ జయంతి సందర్భంగా ఆయన పుట్టిన రోజుగా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు, ఉపవాసాలు, ప్రత్యేక నైవేద్యాలు చేస్తారు. అటువంటి సందర్భంలో బూందీ లడ్డూను హనుమంతుడికి ప్రత్యేకంగా నైవేద్యంగా అర్పించడం ఒక ప్రాచీన సంప్రదాయం. ఎందుకు లడ్డూనే పెడతారు..? పసుపుపచ్చ రంగులో ఉండే బూందీ లడ్డూ బజరంగబలికి ఎంతో ఇష్టమైన మిఠాయి అని పురాణాల్లో చెప్పబడింది. ఈ లడ్డూ శక్తిని, ఉత్సాహాన్ని పెంచే స్వభావం కలిగినది. హనుమంతుడి గుణాలు అయిన ధైర్యం, బలాన్ని ప్రతిబింబించే స్వీట్ ఇది. మిగతా మిఠాయిలతో పోల్చితే.. ఇది భక్తి, వినయాన్ని సూచించే ప్రాతినిధ్యం కలిగి ఉంటుంది. అందుకే ఈ లడ్డూను నైవేద్యంగా పెట్టడం ద్వారా భక్తులు హనుమంతుని ఆశీస్సులు కోరుకుంటారు.
ఎందుకు రెడ్, ఎల్లో కలర్ స్వీట్స్ ఇస్తారు..? హనుమంతుడు రెడ్ కలర్, ఎల్లో కలర్స్ ను చాలా ఇష్టపడుతాడు అని భావించబడుతుంది. బూందీ లడ్డూ కూడా ఎల్లో కలర్ లో ఉండటంతో ఇది ఆయనకు ఇష్టమైనదిగా భావిస్తారు. ఈ స్వీట్‌ను సమర్పించడం ద్వారా భక్తులు తమ ప్రేమను, వినయాన్ని తెలియజేస్తారు. మనం ఇంట్లోనే బూందీ లడ్డూ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- శనగపిండి – 1 కప్పు
- నీరు – సరిపడా
- నెయ్యి లేదా ఆయిల్ – వేయించడానికి
- చక్కెర – 1 కప్పు
- యాలకుల పొడి – అర టీ స్పూన్
- కుంకుమపువ్వు – తగినన్నీ
- బాదం, జీడిపప్పు, పిస్తా – అలంకరణకు (ఆప్షనల్)
తయారీ విధానం
మొదట శనగపిండిలో తగినన్నీ నీరు కొద్ది కొద్దిగా పోస్తూ మృదువుగా ఉండే మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో నెయ్యి లేదా ఆయిల్ వేసి బాగా వేడి చేయాలి. ఇప్పుడు చిన్న రంధ్రాలు ఉన్న జల్లెడ తీసుకొని అందులో ఈ మిశ్రమాన్ని వేసుకుంటూ వేడి నెయ్యి లేదా నూనెలో వేయాలి. జల్లెడ నుంచి మీరు వేసిన మిశ్రమం చిన్న చిన్న ముత్యాల్లా కింద ఆయిల్ లో పడుతుంటాయి. ఇవే బూందీలు అవుతాయి. ఈ బూందీలు బంగారు రంగు వచ్చే వరకు నెమ్మదిగా వేయించాలి.
ఇప్పుడు ఒక వేరే గిన్నెలో చక్కెర, తగినంత నీరు వేసి మధ్యమంటపై పెట్టాలి. చక్కెర పూర్తిగా కరిగే వరకు కలుపుతూ మరిగించాలి. చక్కెర నీటిని పాకంలా మారే వరకు ఉంచాలి.. అంటే రెండు మెత్తటి తీగలు వచ్చే స్థాయిలో ఉండాలి. ఇప్పుడు ఇందులో యాలకుల పొడి, కుంకుమపువ్వు వేసి మరో రెండు నిమిషాలు మరిగించాలి. ఇలా చేస్తే సిరప్ బాగా సిద్ధమవుతుంది.. బూందీలకు బాగా అంటుతుంది.
ఇప్పుడు వేయించిన బూందీని ఈ సిరప్‌లో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి రాసుకుని చిన్న చిన్న లడ్డూలుగా ఒత్తుకోవాలి. తయారైన లడ్డూలను పైన డ్రై ఫ్రూట్స్ వేసి అలంకరించండి. పూర్తిగా చల్లారిన తర్వాత వాటిని నైవేద్యంగా హనుమంతునికి సమర్పించి.. ఆ తర్వాత కుటుంబసభ్యులతో పంచుకోండి.
