జామ ఆకుకు ఫుల్ డిమాండ్..! టన్ను ధర ఎంతో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు!!
కాయలందు జామకాయ రుచి వేరు. ఎంత మధురంగా ఉంటుందో అన్ని ఔషధ విలువలుంటాయి. జామకాయమాత్రమే కాదండోయ్.. జామ ఆకుల్లోనూ ఆయుర్వేద గుణాలున్నాయి. అందుకే ఈ జామాకు పొడిని ఎన్నోరకాలుగా వాడుతున్నారు. రోజు రోజుకు జామ ఆకు పౌడర్ డిమాండ్ పెరగడంతో.. తెలుగు రాష్ట్రాల్లో జామతోటల నర్సరీలకు వ్యాపారులు పోటెత్తుతున్నారు.

ఈ భూమ్మీద వందల, వేల రకాల మొక్కలు ఉన్నాయి. వాటన్నిటిలో భారతదేశంలోనే 90శాతం పెరుగుతుంటాయి. అందుకే మన దేశానికి అంత ప్రత్యేకత. సంజీవనీ పుట్టుకొచ్చి నేల మనది. ప్రపంచాన్నే బతికిస్తున్న వేప పండే భూమి మనది. వేలాది రకాల పూలు, పళ్లు, ఆకుకూరల తోటలకు నిలయం మన భారతం. అలాంటి మన దేశంలో ప్రతీ మొక్కా విలువైనదే. ప్రతీ చెట్టూ ఏదో ఓ ఔషధాన్ని ఇస్తూనే ఉంటుంది. అలాంటి మొక్కలు మనముందే ఉన్నా పట్టించుకోం. మన పెరట్లోనే పెరుగుతున్నా కనపడదు. అందులో ఒకటి మన జామచెట్టు. అసలు జామచెట్టు చేసే మేలుగురించి మీకు తెలుసా? మీ ఆరోగ్యానికి ఎంత ఉపయోగపడుతుందో ఎప్పుడైనా తెలుసుకున్నారా? జామ ఆకులు చేసే మేలేంతో ఇక్కడ తెలుసుకుందాం..
నేటి బిజీ లైఫ్‌లో.. మనం ఏం తింటున్నాం.. ఎప్పుడు తింటున్నామన్నది పెద్దగా పట్టించుకోవడంలేదు. విపరీతమైన కాలుష్యం మన శరీరంలో ప్రవేశిస్తోంది. వాయు కాలుష్యం, నీటి కాలుష్యంతోపాటు.. ఈ మధ్య బయటకు వెళ్లి తినాలంటే ఆహారం కూడా కలుషితం అయిపోతోంది. దీంతో ఆరోగ్యం దెబ్బతింటోంది. హెల్త్ బాగుండాలంటే మంచి లైఫ్‌స్టేలే కాదు.. సరైన డైట్ కూడా అవసరమే. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎవరు పడితే వారు ఎలాంటి అవగాహన, అనుభవం లేనివారు కూడా ఉచిత సలహాలు ఇచ్చేస్తుంటారు. అలాంటి ట్రాప్‌లో మనం పడనే వద్దు. ఇక స్ట్రెయిట్‌గా పాయింట్‌లోకి వచ్చేద్దాం. చాలామంది జనాలు ప్రతీరోజు తాము తీసుకునే డైట్‌లో ఆర్గానిక్ ఉండేలా చూసుకుంటున్నారు. అలాంటి ఆర్గానిక్ ఆరోగ్యానికి సరికొత్త ఔషధం ఏంటంటే.. జామ పౌడర్. అంటే జామకాయ పౌడర్ కాదు. జామాకుతో తయారుచేసిన పొడి. ఈ జామ పౌడర్ కలిపిన టీలు, కషాయాలు ట్రెండ్‌గా మారాయి. ఈ జామ ఆకులను మౌత్ ఫ్రెష్‌నర్‌గా వాడేవారు మన పూర్వికులు. దానిలో చింతపండు పెట్టుకుని తిన్న జనరేషన్ కూడా ఉంది. ఈ పొడి వల్ల అనేక ఆరోగ్యపరమైన బెనిఫిట్స్ ఉండడంతో జామాకులకు డిమాండ్ అమాంతంగా పెరిగిపోయింది.
ఔషధ గుణాల లక్షణాలు అధికంగా ఉండడంతో ప్రస్తుతం జామాకులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం మండలాల్లో 20కి పైగా జామ క్లోనింగ్ నర్సరీలు ఉన్నాయి. నర్సరీలలో క్లోనింగ్ అనంతరం మిగిలిన జామ ఆకులను తుక్కుగా భావించి తగలబెట్టేవారు. ఇప్పుడు అది తుక్కుకాదు వారి పాలిట వరమైంది. ఈ జామాకు కోసం వ్యాపారులు ఎగబడుతుండడంతో నర్సరీ నిర్వాహకులకు కాసుల పంట పండుతోంది.
నర్సరీల్లో కుప్పలుగా పేరుకుపోయే ఈ జామ ఆకును.. వ్యాపారులు కిలోకి 20 నుంచి 50 రూపాయల వరకు ఇచ్చి కొని మార్కెట్ చేస్తున్నారు. అలా కొన్న జామాకులను వ్యాపారులు గోడౌన్లు, ఖాళీ ప్రదేశాల్లో ఎండబెట్టి, దానిని పొడిగా చేసి బెంగళూరు, చెన్నైతోపాటు.. ఇతర నగరాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇలాంటి జామ ఆకుల పొడిని.. డికాషనల్‌లా ఉపయోగించి తేనెతోపాటు తీసుకుంటే ఎంతో ఉపయోగకరం అని పలు పరిశోధనా సంస్థలు చెబుతున్నాయి. అందుకే ఇంత డిమాండ్ ఉందని నర్సరీ యజమానులంటున్నారు. అసలు టన్ను జామ ఆకు ధర 37 వేల రూపాయలు ఉందంటే దానికి ఉన్న డిమాండ్ ఏంటనేది మనం అర్ధం చేసుకోవచ్చు.
జామలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని వైద్య నిపుణులు, డైట్, న్యూట్రీషన్ నిపుణులు చెబుతున్నారు. కల్తీ లేని ఫ్రూట్ ఏదైనా ఉంది అంటే అది ఒక జామకాయేనని అంటున్నారు. ఒంట్లో వేడి కారణంగా ఆరోగ్యం దెబ్బతిన్నా.. నోటి రుగ్మతలు ఏర్పడినప్పుడు జామాకు నమిలితే వెంటనే ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు. షుగర్ వ్యాధిగ్రస్తులకు జామాకు మంచి ఔషధం. వేడి నీటిలో జామ ఆకుల్ని మరిగించి ఉదయం కషాయంలా తాగితే దీర్ఘకాలిక రోగాలకు చెక్ పెట్టే అవకాశం ఉందని నిపుణులంటున్నారు. ఇటీవల కాలంలో కొందరు గృహిణులు జామాకు రెసిపీలను ఉదయాన్నే తీసుకోవడం చూస్తున్నాం.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..