Pottikkalu: కోనసీమ స్పెషల్ ఇడ్లీ పొట్టిక్కలు రుచికి రుచి.. ఆరోగ్యం.. రెసిపీ మీ కోసం..
ఆంధ్రా వాసులు భోజన ప్రియులు.. ముఖ్యంగా ఉభయగోదావరి రుచులు చికెన్, మటన్, రొయ్యలు, చేపలు వంటి నాన్ వెజ్ వంటలను మాత్రమే కాదు.. టిఫిన్స్, స్వీట్స్, వెజ్ పదార్ధాలు ఇలా చెబుతూ వెళ్తే ఎన్నో రకరకాల రుచులు. అయితే ఆంధ్రాలో ముఖ్యంగా కోనసీమవాసులకు తప్ప మిగిలిన వారికీ తెలియని స్పెషల్ ఇడ్లీ.. పోట్టిక్కలు. ఈ రోజు పోట్టిక్కల రెసిపీ తెలుసుకుందాం..

ఉభయగోదావరి వాసులు ఆహారం నేడు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. నాన్‌వెజ్ పచ్చళ్లు, పూతరేకులు, పాలకోవాలు, పులసల పులుసు, కుండ బిర్యానీ, పనసపొట్టు, కందాబచ్చలి, గుత్తి వంకాయ ఇలా ఎన్నో రకాలున్నాయి. అయితే కోనసీమ స్పెషల్ పొట్టిక్కలు మాత్రం రాయలసీమ, తెలంగాణ సహా మిగతా రాష్ట్రాల్లో ఎవరికీ తెలియదు. ఇవి ఇడ్లీ వంటివే.. ఇడ్లీ లాగానే ఆవిరిపై ఉడికిస్తారు. అయితే పనస ఆకుల్లో ఆవిరిమీద ఉడికిస్తారు. ఇడ్లీలాగానే వుండే ఈ పొట్టిక్కలకు ఇడ్లీ కంటే ఎక్కువ డిమాండ్. పొట్టిక్కలకు అంత మంచి రుచి పనస ఆకుల నుంచి వస్తుంది. రెసిపీ మీ కోసం
కావలసిన పదార్ధాలు..
మినప పప్పు – ఒక గ్లాసు
ఇడ్లీ నూక – రెండు గ్లాసులు
మెంతులు- అర టీ స్పూన్
అటుకులు – మూడు స్పూన్లు
పనస ఆకులతో చేసిన బుట్టలు- 12
తయారీ విధానం: ఒక గిన్నెలో మినప పప్పు , మెంతులు వేసి ఒక పూట ముందుగా నానబెట్టుకోవాలి. గ్రైండ్ చేసే ముందు అటుకులను కూడా శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. నానిన మినపప్పుని రుబ్బుకునే ముందు ఇడ్లీ నూకని కడిగి .. నీరు లేకుండా పిండి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు మినప పప్పుని , అటుకులు వేసి మెత్తగా కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి. ఇప్పుడు నూకలో ఈ మినప పిండిని వేసి కలుపుకోవాలి. ఈ పిండిని సుమారు 5 నుంచి 6 గంటల పాటు నాననివ్వాలి. ఇంతలో పనస ఆకులను తీసుకుని కొబ్బరి ఈనెలతో బుట్టలుగా చేసుకోవాలి.
ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకుని అందులో నీరు పోసి స్టవ్ మీద పెట్టాలి. ఇడ్లీ రేకు పెట్టి.. ఇప్పుడు పొట్టిక్కల బుట్టల్లో మినప పిండిని వేసుకుని ఒకొక్కటిగా ఇడ్లీ రేకు మీద అమర్చుకోవాలి. తర్వాత ఆవిరి మీద ఉడికించాలి. సుమారు 20 నిమిషాల పాటు ఉడికించాలి. అంతే పొట్టిక్కలు రెడీ.
వేడి వేడిగా పొట్టిక్కలను కారప్పొడి, నెయ్యి, కొబ్బరి చట్నీ, బొంబాయి చట్నీ, దబ్బకాయ చట్నీ, చింతామణి చట్నీ వంటి వాటితో అందిస్తే ఆహా ఏమి రుచి అనాల్సిందే.
అయితే ఈ పోట్టిక్కలను కోనసీమలో పనస ఆకులతో చేస్తే.. కర్నాటక, మంగళూర్, ఉడిపి వంటి ప్రాంతాల్లో పసుపు ఆకులు , అరటి ఆకులు వంటి వివిధ రకాల ఆకులతో పండుగల సమయంలో చేస్తారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








