వ్యాధుల పద్మవ్యూహం.. నగర యువత ఆయుష్షు గాలిలో దీపం..!

జీవనశైలి వ్యాధుల పద్మవ్యూహంలో చిక్కుకుంటోన్న నగర యువత ఆయుష్ఫు గాలిలో దీపంలో మారుతోంది. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ పట్టణంలో హెల్త్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో తేలిన విషయాలు చూసి అటు ఆరోగ్య నిపుణులు, ఇటు ప్రభుత్వ యంత్రాంగం షాక్‌కు గురైయ్యింది. 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న ప్రతి నలుగురు యువకుల్లో ఒకరు ప్రీ-డయాబెటిక్ దశలో ఉన్నట్లు తేలింది. అలాగే 40 శాతం మంది యువకులు అధిక కొలెస్ట్రాల్ బారినపడినట్లు ఆ సర్వేలో తేలింది.

వ్యాధుల పద్మవ్యూహం.. నగర యువత ఆయుష్షు గాలిలో దీపం..!
Lifestyle Diseases
Follow us

| Edited By: Ravi Panangapalli

Updated on: Jul 01, 2024 | 8:49 AM

డయాబెటీస్.. అధిక కొలెస్ట్రాల్.. ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని ఇవి గడగడలాడిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆధునిక జీవనశైలికి అలవాటుపడిన నగరాలలో ఇవి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఇన్ ఫ్రంట్ దేరీజ్ క్రోకోడైల్ ఫెస్టివల్ అన్న రీతిలో డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఓ తాజా సమగ్ర హెల్త్ సర్వేలో వెన్నులో వణుకుపుట్టించే షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నగరవాసులు.. మరీ ముఖ్యంగా యువకులు డయాబెటీస్, అధిక కొలెస్ట్రాల్ పద్మవ్యూహంలో చిక్కుకుపోతున్నట్లు గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఆధునిక జీవనశైలి శాపంగా మారి నగర యువకులు వ్యాధుల బారినపడుతున్నారు. ఈ వ్యాధులతో పట్టణ యువత ఓ రకంగా పెద్ద యుద్ధమే చేయాల్సిన పరిస్థితి నెలకొంటోంది. డయాబెటీస్ వంటి వ్యాధులకు సంబంధించి ఇప్పటి వరకు మనం వింటున్న గణాంకాలు ఓ ఎత్తైతే.. అసలు గణాంకాలు గుండె దడ పుట్టించే స్థాయిలో ఉన్నట్లు తాజా అధ్యయనాల్లో తేలాయి. పట్టణ యువత ఆయుష్షును గాలిలో దీపంలా మారుస్తున్న ఈ జీవనశైలి వ్యాధులను గెలవాలంటే.. వారి ఆధునిక జీవన విధానంలో సమూల మార్పులు తప్పనిసరిగా నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నేరుగా విషయంలోకి వస్తే.. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ పట్టణంలో హెల్త్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో తేలిన విషయాలు చూసి అటు ఆరోగ్య నిపుణులు, ఇటు ప్రభుత్వ యంత్రాంగం షాక్‌కు గురైయ్యింది. 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న ప్రతి నలుగురు యువకుల్లో ఒకరు ప్రీ-డయాబెటిక్ దశలో ఉన్నట్లు తేలింది. అలాగే 40 శాతం మంది యువకులు అధిక కొలెస్ట్రాల్ బారినపడినట్లు ఆ సర్వేలో తేలింది. 34 శాతం రక్తపోటు సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో వారు గుండె జబ్బుల బారినపడే ప్రమాదం పొంచి ఉంది. అలాగే 7.34 శాతం మంది యువతకు థైరాయిడ్ సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. దాదాపు రెండు శాతం మందికి క్రియాటినిన్ స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. 10 శాతం మందికి పైగా అధిక SGPT స్థాయిలతో కాలేయ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. అందులో చాలా మందికి అసలు తమకు సదరు అనారోగ్య సమస్య ఉన్నట్టే తెలియదని.. తాము ఆరోగ్యవంతులుగా భావిస్తున్నట్లు చెప్పారు.

Health Survey

Health Survey

మొత్తానికి ఇండోర్ నగరంలో 30 వేల మంది యువకులు సహా 2.5 లక్షల మందికి 28 లక్షల రకాల ఆరోగ్య పరీక్షలు చేయగా.. హెల్త్ ఆఫ్ ఇండోర్ సర్వే అనేక ఆందోళనకరమైన ఆరోగ్య ధోరణులను వెలికితీసింది. 33 శాతం మంది అధిక బాడీ మాస్ ఇండెక్స్ స్థాయిలను కలిగి ఉన్నారని, 18 శాతం మందిలో ఊబకాయం ఉన్నట్లు సర్వేలో తేలింది. గాడితప్పిన జీవనశైలి కారణంగా క్యాన్సర్ బాధితులు పెరగడానికి కారణం అవుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాధి లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించి, సకాలంలో సంరక్షణ చర్యలు చేపట్టే లక్ష్యంతో ఈ సర్వే నిర్వహించారు. స్త్రీల కంటే పురుషులే ఎక్కువ మంది ఈ సర్వేలో పాల్గొన్నారని అధికారులు వెల్లడించారు. ఈ సర్వే ఫలితాలు యువతలో అత్యవసర జీవనశైలి మార్పులకు పిలుపునిచ్చాయి. మధ్యప్రదేశ్ సేవా సంకల్ప్, సెంట్రల్ ల్యాబ్, రెడ్ క్రాస్ సొసైటీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ సర్వే ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ సర్వేగా పరిగణించబడుతుంది.

భారతీయుల్లో సగం మంది అన్ ఫిట్..!

ఆధునిక జీవనశైలి కారణంగా ఉత్పన్నమైన ఆందోళనకర ఆరోగ్య పరిస్థితికి మరో సర్వే నివేదిక అద్దంపడుతోంది. దేశంలోని దాదాపు 50 శాతం మంది వయోజనులు శారీరకంగా చురుకుగా లేరని ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించిన ఓ ఆధ్యయన నివేదిక వెల్లడించింది. 42 శాతం మంది పురుషులతో పోల్చితే మహిళలు ఏకంగా 57 శాతం మంది శరీరక శ్రమకు దూరంగా ఉంటున్నారు. దక్షిణాసియా దేశాల్లో అంతటా ఇదే ట్రెండ్ నెలకొన్నట్లు ఆ నివేదిక తెలిపింది. అంతర్జాతీయంగా 31.3 శాతం మంది శారీరకంగా యాక్టివ్‌గా లేరు. అంటే..వీరు వారంలో 150 నిమిషాల మోస్తరు ఫిజికల్ యాక్టివిటీ లేదా వారంలో 75 నిమిషాల తీవ్రమైన ఫిజికల్ యాక్టివిటీ కూడా చేయడం లేదు. 2000 సంవత్సరంలో భారతీయుల్లో 22 శాతం ఫిజికల్లీ అన్ యాక్టివ్‌గా ఉండగా, 2010 నాటికి ఇది 34 శాతానికి, 2022 నాటికి 50 శాతానికి పెరిగింది. ఇదే పరిస్థితి కొనసాగితే భారత్‌లో ఫిజికల్ అన్ యాక్టివ్ 60 శాతానికి పెరిగే ముప్పు ఉంది.

Lifestyle Diseases

Lifestyle Diseases

జీవనశైలి వ్యాధులకు కారణాలు ఏంటి..?

గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోని యువకుల్లోనే డయాబెటీస్, అధిక కొలెస్ట్రాల్, థైరాయిడ్ వంటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఆధునిక జీవనశైలి దీనికి ప్రధాన కారణం అవుతోంది. శారీరక శ్రమ లేని విలాసవంతమైన జీవన విధానానికి అలవాటుపడుతూ తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టేస్తున్నారు. కెరీర్ పరమైన ఒత్తిడి, ఆనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, గ్యాడ్జెట్ల అతి వినియోగం, శీతలపానీయాలు, మద్యపానం, ధూమపానం, కాలుష్యం తదితరాలు నగర యువత ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. జీవనశైలి వ్యాధులకు గురిచేసే కారకాలలో మానసిక ఒత్తిడి, నిద్రలేమి సమస్యలు కూడా ముఖ్యమైనవి. ఒత్తిడి కారణంగా ఊబకాయం, మానసిక రుగ్మతలు, అల్జీమర్స్, జీర్ణాశయ సంబంధిత వ్యాధుల బారినపడుతున్నారు. నిద్ర తీరులో మార్పు కారణంగా ఉద్రేకానికి గురవుతున్నారు. నిద్రలేమి కారణంతో మానసిక రుగ్మతలు ఎక్కువగా కలుగుతున్నాయి.

Lifestyle Diseases

Lifestyle Diseases

ఆరోగ్యకరమైన అలవాట్లు ఇవీ..!

ఆరోగ్యమే మహాభాగ్యమన్న సత్యాన్ని విస్మరిస్తున్న నగర యువత.. ఇప్పటికైనా మేల్కొని శారీరక, మానసిక ఆరోగ్యంపై దృష్టిసారించాల్సిన అత్యవసర పరిస్థితి నెలకొంటోంది. జీవనశైలి వ్యాధుల బారిన పడకుండా వ్యాయామం, ఆరోగ్యకర ఆహారపు అలవాట్లు, ఒత్తిడి లేని జీవనశైలిని అలవరుచుకోవాలి. ప్రతి రోజూ శారీర వ్యాయమం, నడక, పరుగు వంటివి చేయాలి. దగ్గరి దూరాలకు కాలి నడకన వెళ్లి రావాలి. గ్యాడ్జెట్లకు బానిసలుగా మారకుండా.. వాటి వాడకం విషయంలో పూర్తి నియంత్రణ కలిగి ఉండాలి. యోగా, ధ్యానం వంటివి అలవరుచుకోవాలి. మత్తు పదార్థాలకు గుడ్ బై చెప్పేయాలి. జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. ఇంట్లో వంచుకునే ఆహారంలోనూ చెక్కర, ఉప్పును వీలైనంతగా తగ్గించుకోవాలి. ప్రతి రోజూ కాసేపైనా ఇంటిలోని తమ కుటుంబీకులతో సరదాగా గడపాలి. వారాంతపు సెలవు దినాల్లో ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి కొత్త ప్రదేశాలను సందర్శించడం వంటి ఆరోగ్యకర జీవనశైలిని అలవరుచుకోవాలి.

Healthy Habits

Healthy Habits

యువతా బీ అలెర్ట్..!

జీవనశైలి వ్యాధులకు సంబంధించి యువకులు అవగాహన పెంచుకోవాలి. తాము డయాబెటీస్, బీపీ, అధిక కొలెస్ట్రాల్‌ బారినపడినా.. యువకుల్లో చాలా మందికి ఆ విషయమే తెలియదని తాజా సర్వేల్లో తేలింది. ప్రతి ఆరు మాసాలకు వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాధికి సంబంధించి ముందే తెలిస్తే దాని నివారణ చర్యలు చేపట్టేందుకు వీలుంటుందని చెబుతున్నారు. మేము చాలా బిజీ అంటూ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయడం ఏ మాత్రం సరికాదు. ఆరోక్యకరమైన ఆహారపు అలవాట్లతో పాటు ప్రతి రోజూ శారీరక వ్యాయామం, నడక, పరుగు అలవాటు చేసుకోవాలి.