Hygiene Tips: షాకింగ్ నిజం.. ఈ శరీర భాగాలను అతిగా శుభ్రం చేస్తే అంతే సంగతులు!
శరీరం పరిశుభ్రంగా ఉండటం ముఖ్యం. అయితే, కొందరు అతిగా శుభ్రత పాటిస్తారు. రోజుకు అనేకసార్లు స్నానం చేస్తారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు అంటున్నారు. మన శరీరంలోని కొన్ని భాగాలను మరీ ఎక్కువగా శుభ్రం చేయకూడదు. అలా చేస్తే ఆయా భాగాల సున్నితత్వం పెరిగి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఎక్కువగా శుభ్రం చేయకూడని ఆ శరీర భాగాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

చాలామంది ముఖం కాంతివంతంగా, తెల్లగా ఉండాలని కోరుకుంటారు. దానికోసం పదే పదే సబ్బుతో రుద్ది కడుగుతుంటారు. ఇలా ముఖాన్ని అతిగా శుభ్రం చేయడం సరైనది కాదు. రోజుకు రెండుసార్లు ముఖం కడుక్కుంటే చాలు. తరచూ స్క్రబ్ చేయడం వల్ల చర్మంలోని సహజ నూనెలు తొలగిపోయి ముఖం అందవిహీనంగా మారుతుంది. కాబట్టి ముఖాన్ని పదే పదే రుద్ది శుభ్రం చేయకండి.
ముక్కు లోపలి భాగాన్ని కూడా తరచూ శుభ్రం చేయకూడదు. ముక్కు లోపల గాలిని శుద్ధి చేసే, తేమను అందించే ఒక పొర ఉంటుంది. దీన్ని ఊరికే నీటితో ఎక్కువసేపు శుభ్రం చేస్తే ఆ పొర దెబ్బతింటుంది. శుద్ధి చేసే ఫిల్టర్ పనిచేయదు. దీనివల్ల గాలిలోని దుమ్ము, ధూళి నేరుగా లోపలికి వెళ్తాయి.
అలాగే, ఎక్కువగా శుభ్రం చేయకూడని శరీర భాగాల్లో జననేంద్రియాలు ఒకటి. ఇవి చాలా సున్నితంగా ఉంటాయి. ఎక్కువసేపు సబ్బుతో రుద్దుతూ, నీటితో తరచూ శుభ్రం చేస్తే వాటిలోని పీహెచ్ స్థాయిలు దెబ్బతింటాయి. సాధారణంగా రోజుకు ఒకటి లేదా రెండుసార్లు జననేంద్రియాలను శుభ్రం చేసుకోవచ్చు. కానీ పదే పదే సబ్బు రుద్దుతూ శుభ్రం చేయడం మంచిది కాదు.
చాలామంది పాదాల మధ్య ప్రాంతాన్ని, కంటి చుట్టూ ఉన్న భాగాన్ని కూడా తరచూ శుభ్రం చేస్తుంటారు. ఇలా చేయడం కూడా సరైనది కాదు. కంటి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ఎక్కువసేపు నీటితో శుభ్రం చేస్తే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. పాదాల మధ్య భాగం కూడా చాలా సున్నితంగా ఉంటుంది. దాన్ని కూడా ఎక్కువసేపు రుద్దుతూ శుభ్రం చేయకూడదు. ఎక్కువసేపు రుద్దితే మురికి పోతుందని అనుకోవడం పొరపాటు. శరీరంలోని భాగాల సున్నితత్వాన్ని గుర్తుంచుకుని మాత్రమే వాటిని శుభ్రం చేసుకోవాలి. అతిగా శుభ్రం చేయడం కంటే సరైన పద్ధతిలో శుభ్రం చేసుకోవడం ముఖ్యం.
