Dental Care: తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా.. ముందు ఇలా బ్రష్ చేయడం ఆపేయండి..
దంతాల ఆరోగ్యం మన మొత్తం శారీరక ఆరోగ్యానికి ఎంత కీలకమో వైద్యులు పదే పదే చెబుతుంటారు. కానీ, చాలామంది పళ్లను శుభ్రం చేసుకునే విషయంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. దీనివల్ల వివిధ రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, బ్రష్ చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో, సరైన పద్ధతులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మన శరీరంలోకి ఎక్కువ ఇన్ఫెక్షన్లు నోటి ద్వారానే ప్రవేశిస్తాయి. అందుకే నోటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అయితే, చాలామంది బ్రష్ చేసేటప్పుడు కొన్ని సాధారణ పొరపాట్లు చేస్తుంటారు. దీనివల్ల దంతాలు, చిగుళ్లపై ప్రతికూల ప్రభావం పడి రక్తస్రావం కావచ్చు. అంతేకాకుండా, సరిగా బ్రష్ చేయకపోవడం వల్ల పంటి నొప్పి, ఇతర సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, దంతవైద్య నిపుణులు బ్రష్ ఎలా చేసుకోవాలి, ఎలాంటి బ్రష్ వాడాలి, ఎన్ని రోజులకు ఒకసారి బ్రష్ మార్చాలి వంటి అంశాలపై స్పష్టమైన సూచనలు అందిస్తున్నారు.
బ్రష్ మార్పు ఎప్పుడు? ఎలా బ్రష్ చేయాలి?
టూత్ బ్రష్‌ను ఎక్కువ రోజులు వాడటం సరికాదు. సాధారణంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి బ్రష్‌ను మార్చడం తప్పనిసరి అని సూచిస్తున్నారు. ముఖ్యంగా జ్వరం లేదా ఇతర అనారోగ్య సమస్యల బారిన పడినప్పుడు బ్రష్‌ను మార్చడం మంచిది. బ్రష్‌ను ఎక్కువ కాలం వాడితే దానిపై బ్యాక్టీరియా పేరుకుపోయి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
రోజుకు రెండుసార్లు (ఉదయం, రాత్రి) బ్రష్ చేసుకోవడం ఉత్తమం. బ్రష్ చేసే సమయం విషయంలో కూడా చాలామంది తప్పులు చేస్తుంటారు. ఎక్కువ సేపు బ్రష్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం రెండు నుంచి నాలుగు నిమిషాల పాటు నాణ్యమైన టూత్‌పేస్ట్‌తో బ్రష్ చేస్తే సరిపోతుందని వివరిస్తున్నారు.
బ్రషింగ్ చేసేటప్పుడు చేయకూడని తప్పులు:
చాలామంది పళ్లు బాగా శుభ్రం కావాలంటే ఎక్కువ సేపు, గట్టిగా తోమాలని నమ్ముతారు. కానీ ఇలా చేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. గట్టిగా బ్రష్ చేయడం వల్ల పంటిపై ఉండే ఎనామిల్ (పంటి పై పొర) అరిగిపోయే ప్రమాదం ఉంది. ఇది పళ్లను సున్నితంగా మార్చి, ఇతర సమస్యలకు దారితీస్తుంది. కొందరు కేవలం పంటి పక్కల భాగాన్ని మాత్రమే బ్రష్ చేస్తారు. ఇలా చేయడం వల్ల చిగుళ్లు అరిగిపోతాయి. బ్రష్ చేసేటప్పుడు పై నుంచి కిందకు, కింద నుంచి పైకి, గుండ్రంగా క్లీన్ చేయాలి.
చాలామంది పళ్ల ముందు భాగాన్ని మాత్రమే శుభ్రం చేసి, లోపలి భాగాన్ని పట్టించుకోరు. దీనివల్ల పళ్లపై గార పేరుకుపోతుంది. పళ్లతో పాటు నాలుకను శుభ్రం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. నోటి దుర్వాసన రాకుండా ఉండాలంటే టంగ్ క్లీనర్ లేదా బ్రష్‌తో నాలుకను తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. బొగ్గు పొడి, మంజన్ వంటివి వాడటం వల్ల పంటి ఎనామిల్ అరిగిపోయే ప్రమాదం ఉంది. అలాంటి వాటికి దూరంగా ఉండాలని దంతవైద్యులు సూచిస్తున్నారు.




