Coriander Farming: వర్షాకాలంలో రైతులకు లక్షలు కురిపిస్తోన్న కొత్తిమీర.. ఈ పంటను ఎలా పండించుకోవాలంటే
పచ్చి కొత్తిమీరను మార్కెట్‌లో హోల్‌సేల్‌గా కిలో రూ.300 చొప్పున విక్రయిస్తున్నారు. మార్కెట్‌లో కొత్తిమీర కొరత కారణంగా ఒక్కో మొక్కని రూ.10 వరకు విక్రయిస్తున్నారు
Coriander Farming: వానాకాలంలో కొత్తిమీర సాగు చేసి రైతులు మంచి లాభాలు పొందవచ్చని ఉత్తరప్రదేశ్‌లోని రైతులు నిరూపించారు. హర్దోయ్ జిల్లా రైతులు కొత్తిమీర సాగుని చేపట్టారు. జిల్లాలోని కత్రి, కతియారి ప్రాంతాల్లో కొత్తిమీర సాగు పెద్ద ఎత్తున జరుగుతోంది. గంగా నది దిగువ ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతంలో రైతులు చాలా కాలంగా కొత్తిమీర సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో పెరుగుతున్న కొత్తిమీర ఉత్తమమైనదిగా గుర్తింపుని సొంతం చేసుకుంది. తేరా పుర్సౌలి గ్రామానికి చెందిన రైతు శివకుమార్ కొన్నేళ్లుగా వానాకాలం సీజన్‌లో కొత్తిమీరను సాగుచేస్తున్నాడు.ఈ సమయంలో పండించిన కొత్తిమీరకు మార్కెట్‌లో మంచి ధర వస్తుంది.
ఈ సమయంలో పండించిన పచ్చి కొత్తిమీరను మార్కెట్‌లో హోల్‌సేల్‌గా కిలో రూ.300 చొప్పున విక్రయిస్తున్నారు. మార్కెట్‌లో కొత్తిమీర కొరత కారణంగా ఒక్కో మొక్కని రూ.10 వరకు విక్రయిస్తున్నారు. జూన్, జూలై నెలల్లో పొలాన్ని లోతుగా దున్నడంతో పాటు పొలంలోని గడ్డి, కలుపు మొక్కలను తొలగిస్తారు. కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటే ధనియాలు విత్తడానికి 15 రోజుల ముందు పొలంలో మందు వేస్తారు. ఇలా మందులు పిచికారీ చేయడం వల్ల పొలంలో కలుపు మొక్కలు నశిస్తాయి. పొలం సిద్ధం చేసే ముందు కుళ్లిన పేడ ఎరువును పొలంలో వేస్తారు.
కొత్తిమీర సాగుకు పొలాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలంటే: పొలాన్నిదున్నిన తర్వాత సరైన పరిమాణంలో డీఏపీ, పొటాష్‌ని ఉపయోగించాలి. కొత్తిమీర సాగుకు హిసార్ సుగంధ విత్తనాన్ని పొలంలో ఉపయోగిస్తున్నారు. ఇది విత్తిన వెంటనే మొలకెత్తుతుంది. వానాకాలంలో గండ్లు వేసి కొత్తిమీర విత్తుతారు. కొత్తిమీరను నాటడానికి ముందు, దాని గింజలను జనపనార సంచిలో నానబెట్టాలి. ఇది మూడు నుండి నాలుగు రోజుల తర్వాత విత్తనాలు విత్తుకోవడానికి రెడీ అవుతాయి. దీనివల్ల విత్తనం బాగా మొలకెత్తుతుంది.
చీడపీడల నివారణకు ఉద్యానవన శాఖ సూచించిన పద్ధతులను ఉపయోగిస్తారు. వర్షాకాలంలో తేమ కారణంగా అనేక రకాల కీటకాలు మొక్కల పెరుగుదలపై ప్రభావం చూపిస్తాయి. చీడ నివారణకు తగిన మోతాదులో క్లోరోపైరిఫాస్ అనే ద్రావణాన్ని పిచికారీ చేస్తారు. వర్షాకాలం తర్వాత ఈ కొత్తిమీర మార్కెట్‌లోకి వెళ్ళడానికి రెడీ అవుతుంది. మార్కెట్‌లో వర్షాకాలం రాకముందే వేసిన కొత్తిమీర మంచి ధరకు అమ్ముడుపోతోంది.
ఒక హెక్టారులో 10 క్వింటాళ్ల పచ్చికొత్తిమీర: అనేక మంది రైతులు ఆధునిక పద్ధతులతో కొత్తిమీరను సాగుని చేసి లక్షల్లో లాభాలు పొందుతున్నారని ఉద్యానవన అధికారి తెలిపారు. ఈ రోజుల్లో కొత్తిమీర సాగు చేయడం వల్ల రైతు ఆశించిన దానికంటే ఎక్కువ లాభం వస్తుంది. ఒక హెక్టారులో దాదాపు 10 క్వింటాళ్ల పచ్చి కొత్తిమీర లభిస్తుంది. కొత్తిమీర విత్తనాలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. దీనిని మసాలాగా కూడా ఉపయోగిస్తారు.
భారతదేశంలో తయారయ్యే కూరల్లో కొత్తిమీరను ఉపయోగిస్తారు. కొత్తిమీర పొడి, పచ్చడి వంటి రాకరకాలుగా ఉపయోగిస్తున్నారు. ఒక్కోసారి కొత్తిమీర ధర క్వింటాల్‌కు రూ.10 వేల వరకు పలుకుతోంది. కొత్తిమీర ప్రతి దశలోనూ రైతుకు కాసుల వర్షం కురిపిస్తోందన్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి