వర్షాకాలంలో పెరుగు తింటే జలుబు, దగ్గు వస్తాయా? అపోహలపై నిపుణుల క్లారిటీ
వర్షాకాలం ప్రారంభమవగానే ఆహారం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తుంటారు. ముఖ్యంగా ఈ సమయంలో పెరుగు, మజ్జిగ వంటి పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు లేదా కఫం పెరుగుతుందని చాలామంది భావిస్తారు. దీంతో కొందరు వర్షాకాలం మొత్తం పెరుగుకు దూరంగా ఉంటారు. అయితే వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల అందరికీ జలుబు, దగ్గు వస్తుందనేది నిజం కాదని నిపుణులు చెబుతున్నారు..

అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ క్రిటికల్ కేర్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ఆశిష్ మెహ్రోత్రా ఏం చెబుతున్నారంటే.. వర్షాకాలంలో పెరుగు తినకూడదనే నియమం అందరికీ వర్తించదు. పెరుగు ఎంత తాజాగా ఉంది, ఏ ఉష్ణోగ్రతలో తీసుకుంటున్నారు, వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పెరుగును ఆహారంలో చేర్చుకోవచ్చని తెలిపారు.
పెరుగు తింటే జలుబు వస్తుందా?
ఫ్రిజ్ నుంచి తీసిన వెంటనే బాగా చల్లగా ఉన్న పెరుగును తినడం వల్ల కొంతమందికి గొంతులో అసౌకర్యం కలగవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే సైనస్, అలర్జీ లేదా తరచుగా జలుబు వంటి సమస్యలు ఉన్నవారిలో చల్లటి ఆహార పదార్థాల వల్ల ఇబ్బంది అనిపించవచ్చు. అయితే పెరుగు నేరుగా జలుబు లేదా దగ్గుకు కారణమవుతుందని చెప్పడానికి ఆధారాలు లేవని నిపుణులు సూచిస్తున్నారు. అందువల్ల వర్షాకాలంలో పెరుగును పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అయితే వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని బట్టి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
పెరుగులోని ప్రోబయోటిక్స్ వల్ల ప్రయోజనాలు
పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేసే సజీవ బ్యాక్టీరియా. ఇవి ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థకు సహాయపడతాయి. జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా తమ ఆహారంలో తగిన మోతాదులో తాజా పెరుగును చేర్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. సమతుల్య ఆహారంలో భాగంగా పెరుగును తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి మేలు కలగవచ్చు. అయితే ఏ ఆహారమైనా మితంగా తీసుకోవడం ముఖ్యం.
వర్షాకాలంలో పెరుగును ఎలా తినాలి?
- ఫ్రిజ్ నుంచి తీసిన వెంటనే పెరుగు తినకుండా కొంతసేపు బయట ఉంచి సాధారణ ఉష్ణోగ్రతకు వచ్చిన తర్వాత తీసుకోవచ్చు.
- ఎప్పుడూ తాజాగా ఉన్న పెరుగునే తినాలి.
- రంగు, వాసన లేదా రుచి మారిన పెరుగును తీసుకోకూడదు.
- రుచికి తగినంత వేయించిన జీలకర్ర పొడి, నల్ల మిరియాల పొడి లేదా కొద్దిగా ఉప్పు కలుపుకోవచ్చు.
- పెరుగులో ఎక్కువగా మసాలాలు కలపాల్సిన అవసరం లేదు.
ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
పెరుగు తిన్న ప్రతిసారీ గొంతులో మంట, కఫం లేదా ఇతర అసౌకర్యాలు ఎదురైతే దాని వినియోగాన్ని తగ్గించడం మంచిది. అలాగే సైనస్, అలర్జీ వంటి సమస్యలు తరచుగా ఎదురయ్యేవారు తమ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆహారంలో మార్పులు చేసుకోవాలి. పాలు లేదా పాల ఉత్పత్తుల పట్ల అలెర్జీ లేదా అసహనం ఉన్నవారు పెరుగు తీసుకునే ముందు వైద్యుడు లేదా పోషకాహార నిపుణుడి సలహా తీసుకోవడం మంచిది. కాబట్టి వర్షాకాలంలో పెరుగు తింటే అందరికీ జలుబు, దగ్గు వస్తాయనే అపోహను నమ్మాల్సిన అవసరం లేదు. తాజాగా ఉన్న పెరుగును సరైన ఉష్ణోగ్రతలో, మితమైన మోతాదులో తీసుకుంటే సమతుల్య ఆహారంలో భాగంగా కొనసాగించవచ్చు. అయితే మీకు ప్రత్యేకమైన ఆరోగ్య సమస్యలు ఉంటే నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.




